Travel Bus Gold chori : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 4 కిలోల బంగారు ఆభరణాలు చోరీ, సీసీకెమెరాల్లో రికార్డు
Travel Bus Gold chori : హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 4 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. చోరీ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యారు.
Travel Bus Gold chori : హైదరాబాద్ నుంచి ముంబయి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో బంగారు ఆభరణాలు తీసుకెళ్తున్న ఒక ప్రయాణికుడి నుంచి 4 కిలోల బంగారు ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయడం సంచలనం సృష్టించింది. ముంబయికి చెందిన ఒక పెద్ద బంగారు ఆభరణాల కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్న ఆశిష్ అనే వ్యక్తి ఆ ఆభరణాలను హైదరాబాద్ లో తయారీదారుల నుంచి ముంబయికి తీసుకెళ్తున్నాడు.
టీ తాగి వచ్చేసరికి బ్యాగు మాయం
హైదరాబాద్ లో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఎక్కిన ఆశిష్, జహీరాబాద్ శివారులో సత్వార్ వద్ద ఉన్న కోహినూర్ ఢాబా వద్ద చాయ్ తాగడానికి బస్సు దిగాడు. బస్సు డ్రైవర్ బస్సు ఆపడంతో, ప్రయాణికులందరూ కూడా ఇక్కడ కాలకృత్యాలు తీర్చుకోవడానికి, టీ దిగటానికి కిందకి దిగారు. నగలతో ఉన్న బ్యాగు బస్సులోనే పెట్టి దిగిన ఆశిష్, బస్సు ఎక్కినా తర్వాత బ్యాగు కన్పించకపోవడంతో లబోదిబోమన్నాడు. బస్సు డ్రైవర్ సహాయంతో, దగ్గర్లో ఉన్న చిరాగ్ పల్లి పోలిసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సుమారుగా మూడు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించడంతో అలర్ట్ అయినా ఎస్సై రాజేందర్ రెడ్డి వెంటనే సీసీ టీవీ కెమెరాలు చెక్ చేయటంతో బస్సు లో నుంచి ఆ బ్యాగుని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. ఎస్సై రాజేందర్ రెడ్డి వెంటనే ఆ ఘటనను తనపై అధికారులైనా డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శివలింగానికి తెలియజేశారు.
రెండు ప్రత్యేక బృందాలను పంపిన డీఎస్పీ
కేసును విచారణ చేస్తున్న డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, రెండు ప్రత్యేక బృందాలను హైదరాబాద్, ముంబయిలకు పంపారు. అదేవిధంగా, సీసీటీవీ కెమెరాలను, నిందితుల ఫోన్ లను ట్రాక్ చేస్తూ వారు ఎటువైపు వెళ్లారని దర్యాప్తు చేస్తున్నారు. సుమారు మూడు కోట్ల విలువైన బంగారు నగలు పోవటం, జహీరాబాద్ లో పెద్ద సంచలనం సృష్టించింది. ముంబయికు సంబంధించిన బంగారు నగల కంపెనీ యజమాని తరచుగా ఆశిష్ ను హైదరాబాద్ కు పంపించి, ఇక్కడ ఉన్న బంగారు తయారుదారులు వద్ద నగలు తయారు చేయించి, తిరిగి ముంబయికి తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదని కంపెనీ యజమాని పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తాము నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ముంబయికి వెళ్లే ప్రైవేట్ బస్సులు రెగ్యులర్ గా కోహినూర్ ఢాబా దగ్గర ఆగుతుంటాయని కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదని హోటల్ యజమాని అన్నారు.
సీసీటీవీ కెమెరాలో దొంగతనం రికార్డు
అయితే హోటల్లో సీసీటీవీ కెమెరాలు ఉండటం వలన, నిందితులు బ్యాగు తీసుకెళ్తున్న విషయం కెమెరాలో రికార్డు అయ్యింది. అయితే ఆశిష్ బంగారు నగలు తీసుకెళ్తున్నట్టు సమాచారం ఉన్నవాళ్లే, ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలు, మిగతా బ్యాగులు తీసుకెళ్లకుండా, నగల బ్యాగును మాత్రమే తీసుకెళ్లడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది.
సంబంధిత కథనం