YS Sharmila : విశాఖ ఉక్కు సరే… నిజాం షుగర్స్ సంగతేంటి….కేసీఆర్‌కు షర్మిల ప్రశ్న-ysrtp president ys sharmila questions brs party president kcr about nizam sugar factory closure ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ysrtp President Ys Sharmila Questions Brs Party President Kcr About Nizam Sugar Factory Closure

YS Sharmila : విశాఖ ఉక్కు సరే… నిజాం షుగర్స్ సంగతేంటి….కేసీఆర్‌కు షర్మిల ప్రశ్న

HT Telugu Desk HT Telugu
Jan 04, 2023 08:37 AM IST

YS Sharmila విశాఖ ఉక్కు ను కాపాడటం కాదు, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో మూతపడిన నిజాం షుగర్స్ సంగతి ఏమిటని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మహోజ్వల భారత దేశం కంటే ముందు తెలంగాణ మహోజ్వలంగా ఉందో లేదో చెప్పాలని ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పలు ప్రశ్నలు సంధించారు.

వైఎస్ షర్మిల (ఫైల్ ఫొటో)
వైఎస్ షర్మిల (ఫైల్ ఫొటో) (twitter)

YS Sharmila దేశాన్ని మహోజ్వలం చేస్తానని చెబుతున్న కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమి అందిందా అని నిలదీశారు. రైతులకు రుణమాఫీ జరిగిందా, పంట పరిహారం అందిందా, ఇంటికో ఉద్యోగం వచ్చిందా, నిరుద్యోగ భృతి ఇచ్చారా అని ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు

ఎనిమిదేళ్ళలో తెలంగాణలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టారా, పోడు భూములకు పట్టాలు ఇచ్చారా? గొల్లకురుమలకు గొర్లు వచ్చాయా?, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారా? ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించారా? అని కేసీఆర్‌ను షర్మిల నిలదీశారు.

ఉజ్వల పాలనలో..ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం లేదని, పంట నష్టపరిహారం లేదని, కౌలు రైతుకు దిక్కు లేదని, యువతకు కొలువుల్లేవని అర్హులకు స్వయం ఉపాధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కార్మికులకు భరోసా లేదని, మహిళలకు రక్షణా లేదని.. మీది ఉజ్వల పాలన కాదు, అవినీతి పాలన.. అక్రమాల పాలన,దౌర్జన్యాల పాలన.. నిర్బంధాల పాలన అని ఆరోపించారు.

తెలంగాణలో మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలకు దిక్కులేదు కానీ విశాఖ ఉక్కును కాపాడుతారని ఎద్దేవా చేశారు. గ్రామానికి ఇద్దరికి కూడా ఇవ్వని దళిత బంధును.. ఏటా 25లక్షల మందికి ఇస్తాడట అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ‘ఓట్ల కోసమే పథకాలు పెడుతున్నం’ అని కరాఖండిగా చెప్పిన నోట.. ‘ఏం చేసినా ఎన్నికల కోసమేనా అని నిలదీశారు. మునుగోడులో వేల కోట్లు కుమ్మరించి, ప్రజలను ప్రలోభపెట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు దత్తతల పేరుతో దగా చేసి, ఓట్లు దండుకున్న కేసీఆర్‌కు ఎన్నికల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

మోడీ దేశాన్ని పట్టపగలే అమ్ముతుంటే.. కేసీఆర్‌ పట్టపగలే తెలంగాణ సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు. జనం మీద అప్పులు పెట్టి, ఖజానా నింపుకుంటున్నారని, తెలంగాణను ఆగం పట్టించి, ఉన్నకాడికి పీక్కు తిని, కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిన కేసీఆర్‌ దేశాన్ని ఏలుతాడని ఎద్దేవా చేశారు.

గోదావరి వరద బాధితులకు ఇంకా సహాయం అందించక పోవడాన్ని షర్మిల ప్రశ్నించారు. అకాల వర్షాలకు గోదారి ఉగ్రరూపం దాల్చి, అధికారికంగానే 26వేల కుటుంబాలు ఆగమైతే, లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగితే, వేలాది ఇండ్లు వరదల్లో కొట్టుకుపోతే, గాలి మోటార్ లో వచ్చి గాలి మాటలు, కారులో వచ్చి కారు కూతలు కూశాడని మండిపడ్డారు. వరదలకు కారణం క్లౌడ్ బరస్ట్ అని.. విదేశీ కుట్ర అంటూ జనం చెవుల్లో పువ్వులు పెట్టారన్నారు.

వరద బాధితులకు 2వేల ఇండ్లు..గోదావరి కరకట్టకు రూ.వెయ్యి కోట్లు, ములుగు జిల్లాకు రూ.2.50కోట్లు..భద్రాచలం జిల్లాకు రూ.2.30కోట్లు, భూపాలపల్లికి రూ.2కోట్లు, మహబూబాబాద్ కు రూ.1.5కోట్లు అంటూ మాటలతో కోటలు కట్టాడు తప్పితే ఆరు నెలలైనా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. వరదల్లో వేలాది మంది రైతులు ఆగమైనా.. నయా పైసా సాయం చేయని దొర, కిసాన్ పేరు చెప్పి రాజకీయాలు చేయడానికి సిగ్గుండాలన్నారు. ఇంట గెలవనోడు, రచ్చ గెలుస్తాడట అని మండిపడ్డారు. కేసీఆర్‌ మాటల మూటలు.. హామీల కోటలు జనం మర్చిపోరని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

IPL_Entry_Point