YS Sharmila : రాహుల్ గాంధీకి షర్మిల బర్త్ డే విషెస్, వైఎస్ఆర్టీపీ విలీనంపై మరోసారి జోరుగా చర్చ!
YS Sharmila : వైఎస్ షర్మిల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. దీంతో మరోసారి వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనం అంశం తెరపైకి వచ్చింది.
YS Sharmila : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులంతా సోషల్ మీడియాలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా రాహుల్ గాంధీకి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో షర్మిల ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఇటీవల బెంగళూరులో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం విలీనం అంశం తెరపైకి వచ్చింది. షర్మిల తరపున కాంగ్రెస్ అధిష్ఠానంతో డీకే చర్చలు జరుపుతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. షర్మిలకు పాలేరు టికెట్ కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని సైతం ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను వైఎస్ షర్మిల కొట్టి పారేవారు. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
కాంగ్రెస్, వైఎస్ కుటుంబం మధ్య గ్యాప్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కీలక నేత, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ను రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అధిష్ఠానానికి మధ్య గ్యాప్ వచ్చింది. జగన్ ఓదార్పు యాత్రను అధిష్ఠానం అడ్డుకుందని, జగన్ జైలుకు వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ప్రచారం జరిగింది. దీంతో వైఎస్ఆర్ కుటుంబం, అనుచరులు కాంగ్రెస్ కు క్రమంగా దూరమయ్యారు. సొంత పార్టీ పెట్టుకున్న జగన్... 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. తర్వాత పరిస్థితులు మారాయి. వైఎస్ జగన్, షర్మిలకు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ ఏర్పాటు చేసి, తెలంగాణలో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ పాలనే తన లక్ష్యమని షర్మిల పాదయాత్ర చేశారు. బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. అయితే ఏపీలో సక్సెస్ అయిన వైఎస్ఆర్ ఫార్ములా తెలంగాణలో అంతగా ఆకట్టుకోలేకపోయింది.
కాంగ్రెస్ తో జట్టుకడతారా?
వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని షర్మిల రాజకీయాలు చేస్తున్నారు. నిత్యం కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో కాస్త బలంగా ఉన్న కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమె రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో మరోసారి విలీనం అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తు్న్న వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాంగ్రెస్ లో చేరికలు జోరందుకున్నాయి. వైఎస్ షర్మిల కూడా ఇటీవల డీకే శివకుమార్ తే భేటీ అవ్వడం, కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ పోరాడతామని చెప్తుడడంతో... వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలను షర్మిల తిప్పికొడుతున్నారు. వైఎస్సార్ పేరు మీద పార్టీ పెట్టింది ఏ పార్టీలో విలీనం చేయడానికి కాదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
.