Ysrtp Sharmila: పోలీసులకు హారతి పట్టిన షర్మిల.. గజ్వేల్ పర్యటనకు అడ్డగింత-ysrtp president sharmila was stopped by the police sharmila protested by holding a harati ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ysrtp Sharmila: పోలీసులకు హారతి పట్టిన షర్మిల.. గజ్వేల్ పర్యటనకు అడ్డగింత

Ysrtp Sharmila: పోలీసులకు హారతి పట్టిన షర్మిల.. గజ్వేల్ పర్యటనకు అడ్డగింత

HT Telugu Desk HT Telugu
Aug 18, 2023 11:34 AM IST

Ysrtp Sharmila: సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో పర్యటించేందుకు సిద్ధమైన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో వారికి హారతులిచ్చి నిరసన తెలిపారు.

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల

Ysrtp Sharmila: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమైన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

దళిత బంధు పథకం అమలులో అక్రమాలు జరిగాయంటూ గజ్వేల్‌లోని జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌ గ్రామస్థులు ఆందోళన చేశారు. వారికి మద్దతుగా గ్రామంలో పర్యటించాలని నిర్ణయించుకున్న షర్మిలకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆమెను గృహ నిర్బంధం చేశారు. షర్మిల నివాసం లోటస్‌పాండ్‌ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. గజ్వేల్‌ వెళ్లి తీరుతానంటూ పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగినా అనుమతించమంటూ పోలీసులు తేల్చి చెప్పారు.

తనను పోలీసులు గృహనిర్బంధించడంపై షర్మిల నిరసన తెలిపారు. గజ్వేల్‌ పర్యటనకు వెళ్లకుండా ఇంటి వెలుపల అడ్డుకున్న పోలీసులకు హారతి ఇచ్చారు. డ్యూటీ సరిగా చేయండి సార్‌ అంటూ సూచించారు.

గజ్వేల్‌లో నిరసన తెలుపుతున్న బిఆర్‌ఎస్‌ పార్టీ నేతలను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు సీఎం కేసీఆర్‌ తొత్తుల్లా పనిచేయడం మానుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలి మమ్మల్ని పట్టుకుంటున్నారని తాను దేనికి అనుమతి తీసుకోవాలని ప్రశ్నించారు.

ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలను కలవడానికి అనుమతి తీసుకోవాలా అని నిలదీశారు. కేసీఆర్‌ తనను చూసి భయ పడుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు.కేసీఆర్ దళిత ద్రోహి అని.. కేసీఆర్ తనను చూసి భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా లోటస్ పాండ్ లోని తన ఇంటి దగ్గర బైఠాయించి దీక్షకు దిగారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పారు.

Whats_app_banner