YS Sharmila : BRSలోని ఎమ్మెల్యేలంతా 'వనమాలే' - తనిఖీ చేయాలన్న షర్మిల
YSRTP Latest News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. ఎమ్మెల్యేలంతా మరో ‘వనమాలే’ అని ఆరోపించారు.
YS Sharmila Latest News: బీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలంతా మరో వనమాలే అని మండిపడ్డారు. అంతా ఎన్నికల కమిషన్ ను తప్పు దోవ పట్టించిన వాళ్లే అని ఆరోపించారు. దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలే అంటూ ధ్వజమెత్తారు.
ట్రెండింగ్ వార్తలు
ఎన్నికల అఫిడవిట్ లో చూపింది గోరంతైతే దాచింది కొండంత అని అన్నారు వైఎస్ షర్మిల. లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతమని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేయాలని కోరారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారం అనుభవిస్తున్న వారిని మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరారు.
అప్పు ఎలా తీర్చారు కేసీఆర్...?
కాళేశ్వరం అప్పు అంతా అయిపోయిందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు షర్మిల. "రూ.1.49లక్షల కోట్లతో "కాళేశ్వరం తిప్పిపోతల పథకం" కట్టిన కేసీఆర్ గారు.. మూడేండ్లకే మునిగిన ప్రాజెక్టుతో రూ.80వేల కోట్ల అప్పెట్ల తీర్చారు? రోజుకు 3 TMC లు అని చెప్పి, అర TMC కూడా ఎత్తలేని ప్రాజెక్టు బాకీలు తీర్చిందా?ఎత్తిపోసిన 157 టీఎంసీలలో 100 టీఎంసీలను గోదాట్లో పోసినందుకు బాకీలు తీరినయా? లక్ష ఎకరాల సాగుకు దిక్కులేని ప్రాజెక్టుతో వడ్లు ఉష్కె లెక్క పండినయా? ప్రతి సీజన్ లో పట్టుపని 40వేల ఎకరాలను కూడా తడపని ప్రాజెక్టుతో రైతులకు డబ్బులే డబ్బులా? మీరు పుట్టకపోతే తెలంగాణలో వ్యవసాయమే లేనట్లు.. ప్రాజెక్టు కట్టకపోతే రైతుకు దిక్కేలేనట్లు ఉంది మీ వ్యవహారం. 70 ప్రాజెక్టుల పాత ఆయకట్టును కనికట్టు చేసి కొత్త ఆయకట్టుగా చూపి.. కాళేశ్వరం ఖాతాలో వేసినంత మాత్రానా కోటి ఎకరాలకు తడిపినట్లు కాదు దొర! విస్తారంగా వర్షాలు పడి,పాత ప్రాజెక్టులు నిండినయే తప్పా.. మీ కాసులధార కాళేశ్వరం ఒక్కటీ నింపలే" అంటూ కౌంటర్ ఇచ్చారు.
"9ఏండ్లలో 15లక్షల కొత్త బోర్లు పడ్డాయంటే, మీ డ్రీమ్డ్ ప్రాజెక్ట్ అంతా బోగస్ అని తేలిపోయింది. మీ కమీషన్ల సౌదం కాళేశ్వరం అప్పులు తీర్చేది కాదు. అప్పుల మీద అప్పులు మోపేది. తెలంగాణ నెత్తిన ఎప్పటికీ గుదిబండే. రాష్ట్ర సొమ్మును వడ్డీలకు, నిర్వహణకు కాజేసే కన్నీటి సౌదం. కాళేశ్వరం ముమ్మాటికీ కేసీఆర్ వైట్ ఎలిఫెంట్. తెచ్చిన రూ.97,447కోట్లకు అదనంగా రూ.71,575కోట్లు కలిపి కట్టే ఫలితం లేని ప్రాజెక్ట్ కాళేశ్వరం. నిర్వహణ కింద ఏటా రూ.23వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరుతో సమానమే. అప్పులు తీర్చి, ఖజానా నింపుకున్నది కేసీఆర్ మాత్రమే. అందుకే దొరకు కాళేశ్వరం ఒక ATM. మీ బంధిపోట్ల పాలనలో రైతుల జేబులకు చిల్లులు పడ్డయ్ తప్పితే.. జేబులు నిండలే. దేశంలోని రైతులకు ఉన్న అప్పుల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. రైతుల ఆదాయంలో 25వ స్థానంలో ఉంది. ఒక్కో రైతు మీద రూ.లక్షన్నర అప్పు ఉంది. ఇది పార్లమెంటులో కేంద్రం చెప్పిన వివరాలే. ఇప్పుడు చెప్పండి దొర గారు.. మీరు కట్టిన కాళేశ్వరం పుణ్యాన ,రైతులకు అప్పులు తేరినయా? అప్పులు మిగిలినయా?" అంటూ ట్విట్టర్ వేదికగా వైఎస షర్మిల ప్రశ్నించారు.
సంబంధిత కథనం
టాపిక్