YS Sharmila On Munugode : మునుగోడు ఉప ఎన్నికపై షర్మిల షాకింగ్ కామెంట్స్
YS Sharmila On Munugode మునుగోడు ఉప ఎన్నిక కుక్కల కొట్లాట కంటే హీనంగా తయారైందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ఎవరైనా చనిపోతే ఉప ఎన్నిక వస్తే అర్థముందని, మునుగోడు ఉప ఎన్నికకు అవసరమేముందని ప్రశ్నించారు. మునుగోడు పోటీకి దూరంగా ఉంటున్నట్లు షర్మిల తేల్చేశారు.
YS Sharmila On Munugode మునుగోడు Munugode ఉప ఎన్నిక ఎమ్మెల్యే చనిపోతే రాలేదని, ఓ పార్టీ అధికారంలోకి రావాలి అని అనుకుంటే, ఓ పార్టీ ఓ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించడం వల్ల మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. ఇంకో పార్టీ అధికార మదంతో తమ అధికారాన్ని నిలబెట్టుకోడానికి, రాజీనామాను స్పీకర్ ద్వారా అమోదించి తీసుకొచ్చిన ఎన్నిక అని చెప్పారు. వీధిలో కుక్కల పొట్లాట మాదిరి జరుగుతున్న ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నికను అభివర్ణించారు. మునుగోడు ఎన్నిక తెలంగాణ ప్రజాభిప్రాయానికి ఎలా రిఫరెండం అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ పాలన దరిద్రంగా ఉందని, ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికకు వెళితే అది రిఫరెండం అవుతుందని, మునుగోడు ఉప ఎన్నిక రిఫరెండం కాదని చెప్పారు. కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని సవాలు చేశారు.

తెలంగాణలో మాత్రమే రాజకీయాలు…..
తాను పుట్టింది సీమలో అయినా బాల్యం మొత్తం తెలంగాణలో సాగిందని, చదువు, పెళ్లి, ఇప్పటి వరకు జీవితం మొత్తం తెలంగాణలోనే సాగిందని తన జీవితం తెలంగాణతోనే ముడిపడి ఉందని షర్మిల చెప్పారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో వైఎస్సార్‌టీపీకి YSRTP ఎలాంటి సంబంధం లేదని, తన జీవితం మొత్తం తెలంగాణతోనే ముడిపడి ఉందన్నారు. వైఎస్సార్ అందించిన సంక్షేమాన్ని తెలంగాణ ప్రజలు మరువలేదని, తన తండ్రి పాలనను తెలంగాణకు అందించడమే తన లక్ష్యమని చెప్పారు. తన భవిష్యత్ రాజకీయాలు కూడా తెలంగాణతోనే ఉంటాయన్నారు. ఆంధ్రా రాజకీయ వ్యవహారాలు తనకు సంబంధం లేదన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన కూడా తనకు లేదని ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు షర్మిల చెప్పారు. తనకు తల్లి సంపూర్ణ మద్దతు ఉందని, ఏపీ రాజకీయాల్లో తనకు సంబంధం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ పాలనను తిరిగి తీసుకురావడం కోసమే పార్టీ పెట్టినట్లు షర్మిల చెప్పారు. వైఎస్సార్‌టీపీ ఆంధ్రాలో పోటీ చేసే అవకాశం లేదన్నారు . ఆంధ్రాలో జరిగే వ్యవహారాలతో తనకు సంబంధం లేదని, అక్కడ కూడా ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగితే అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు సిబిఐకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ వంటి పార్టీలతో కలిసి పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. బీజేపీ కేసీఆర్‌పై ఎందుకు ఉదాసీన వైఖరి అవలంబిస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ విషయంలో బీజేపీ వైఖరి సందేహాస్పదంగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
చేసింది చెప్పుకోకూడదన్న షర్మిల…..
జగన్ కోసం పాదయాత్ర చేసిన విషయంపై స్పందిస్తూ తన గురించి తాను గొప్పలు చెప్పుకోకూడదని, తనను ఒకరు సాయం అడిగినప్పుడు తనకు చేతనైన సాయం చేశానని, అప్పుడు తనకు చేతనైన దానికంటే ఎక్కువే తాను సాయం చేశాను కాబట్టి అంతా తనకు సాయం చేయాలని తాను కోరుకోనని షర్మిల చెప్పారు.
తెలంగాణలో మద్యంపై ఆదాయం 10వేల కోట్ల రుపాయల ఆదాయం 40వేల కోట్ల రుపాయలకు చేరిందని, బిఆర్‌ఎస్ పార్టీ చప్పుడు మాత్రమే చేస్తోందని, కేసీఆర్ అటెన్షన్ మాత్రమే కోరుకుంటున్నారని Sharmila చెప్పారు. అమ్ముడుపోయే పార్టీలను పిలిపించుకుని వారి మద్దతు పొందుతున్నాడని విమర్శించారు. అమ్ముడుపోయే వారు మాత్రమే కేసీఆర్‌కు మద్దతు చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ BRSగా మారి త్వరలో విఆర్‌ఎస్ తీసుకుంటుందని చెప్పారు. రెండుసార్లు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ గెలవడానికి రాజకీయ ప్రత్యామ్నాయం లేకపోవడమే కారణమని చెప్పారు.