YS sharmila : రేవంత్ రెడ్డి నిర్ణయం దేశానికే ఆదర్శం.. వైఎస్ షర్మిల ఇంట్రెస్టింగ్ కామెంట్స్-ys sharmila interesting comments on revanth reddy caste census decision ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila : రేవంత్ రెడ్డి నిర్ణయం దేశానికే ఆదర్శం.. వైఎస్ షర్మిల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

YS sharmila : రేవంత్ రెడ్డి నిర్ణయం దేశానికే ఆదర్శం.. వైఎస్ షర్మిల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Basani Shiva Kumar HT Telugu
Feb 04, 2025 05:11 PM IST

YS sharmila : తెలంగాణలో కుల గణనపై రాజకీయ రచ్చ నడుస్తోంది. కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. కుల సర్వే-2024 నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రేవంత్ రెడ్డి. ఈ సమయంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కుల గణన నిర్ణయం దేశానికే ఆదర్శం అని కొనియాడారు.

సీఎం రేవంత్‌తో వైఎస్ షర్మిల (ఫైల్ ఫొటో)
సీఎం రేవంత్‌తో వైఎస్ షర్మిల (ఫైల్ ఫొటో)

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన.. దేశానికే ఆదర్శం అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కొనియాడారు. ఇదో చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి.. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, అంటే.. దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశం అని అన్నారు.

yearly horoscope entry point

ఏపీలో కూడా చేయాలి..

'ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నమ్ముతున్నాం. ఏపీలో కూడా కులగణన చేపట్టాలి. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలి. కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలి. మనమెంతో మనకంతా అన్నట్లుగా.. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాలి. జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలి' అని షర్మిల డిమాండ్ చేశారు.

బీజేపీ కుట్రలు చేస్తోంది..

'గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా.. బీజేపీ దత్తపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారు. బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. బీజేపీ డైరెక్షన్‌లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారు. ఇక దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే.. రిజర్వేషన్లు రద్దుకు కుట్ర అని బీజేపీ తప్పు దారి పట్టిస్తోంది. బీజేపీ ఉచ్చులో మీరు పడవద్దని.. వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం' అని షర్మిల ట్వీట్ చేశారు.

రేవంత్ కీలక కామెంట్స్..

కుల సర్వే-2024 నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదు. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదు. జనాభా లెక్కల్లోనూ బలహీనవర్గాల లెక్కలు పొందుపరచలేదు' అని సీఎం వ్యాఖ్యానించారు.

మాట ఇచ్చాం.. చేసి చూపించాం..

'అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం. కులగణన ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ నివేదికను సభలో ప్రవేశపెట్టాం. ప్రతీ గ్రామంలో, తండాల్లో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారు. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్‌గా గుర్తించి ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించాం' అని రేవంత్ వివరించారు.

అందరికీ అభినందనలు..

'76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారు. రూ.160 కోట్లు ఖర్చుచేసి ఒక నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించాం. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశపెట్టాం. 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. దేశానికి ఆదర్శంగా నిలిచేలా నివేదికను రూపొందించడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

Whats_app_banner