YSRTP: నా భవిష్యత్ తెలంగాణతోనే... నా పోరాటం తెలంగాణ కోసమే - షర్మిల
YSRTP Latest News: తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల. ఊహాజనిత కథనాలను నమ్మవద్దని కోరారు.
YS Sharmila:గత కొద్దిరోజులుగా వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన పలు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే వీటిపై స్పందించారు వైఎస్ షర్మిల. తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటదని స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
"ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫలయత్నాలు జరుగుతున్నాయి. పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే. నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండి. అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనే, నా ఆరాటం.. నా పోరాటం తెలంగాణ కోసమే. జై తెలంగాణ" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
గత కొద్దిరోజులుగా వైఎస్ఆర్టీపీకి సంబంధించి పలు ఆసక్తికరమైన కథనాలు తెరపైకి వస్తున్నాయి. కర్ణాటక ఫలితాల తర్వాత...డీకే శివకుమార్ ను షర్మిల కలవటంతో సరికొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం కాబోతుందన్న చర్చ జోరందుకుంది. అందుకు తగ్గట్టుగానే పరిణామాలు చోటు చేసుకున్నట్లు కనిపించాయి. డీకేతో షర్మిల రెండు సార్లు భేటీ కావటంతో.... ఈ మధ్యనే రాహుల్ గాంధీకి ట్విట్టర్ వేదికగా షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో.... వైఎస్ఆర్టీపీ విలీనం కావటం పక్కా అని అందరూ భావించారు. ఇక ఆంధ్రా పీసీసీ పదవి కూడా కట్టబెట్టే దిశగా అడుగులు పడుతున్నాయన్న కథనాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే ఇలాంటి వార్తల నేపథ్యంలో.... వైఎస్ఆర్టీపీ శ్రేణులు కూడా గందరగోళానికి గురయ్యే పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ బిడ్డగానే ఉంటానని... ఇక్కడి సమస్యలపైనే పోరాడతానని స్పష్టం చేశారు. ఊహాజనిత కథనాలను కొట్టాపారేశారు.
షర్మిల రియాక్షన్ నేపథ్యంలో…. విలీనం వార్తలు ఆగుతాయా..? లేక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి షర్మిల నిజంగానే పని చేస్తారా…? అనేది వేచి చూడాలి…!
సంబంధిత కథనం