YS Sharmila : కేటీఆర్ గారు... ఈ ఎన్నికల్లోనే మీ సీటును మహిళకు ఇచ్చేయండి-ys sharmila counter to minister ktr comments about womens reservation bill ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Ys Sharmila Counter To Minister Ktr Comments About Womens Reservation Bill

YS Sharmila : కేటీఆర్ గారు... ఈ ఎన్నికల్లోనే మీ సీటును మహిళకు ఇచ్చేయండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 21, 2023 01:06 PM IST

Womens Reservation Bill : మహిళా బిల్లు ద్వారా తన సీటు పోయినా ఫర్వాలేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. బిల్లు అమలయ్యేదాక ఎదురుచూడటం ఎందుకు..? ఈ ఎన్నికల్లోనే మీ సీటు త్యాగం చేసి ఒక మహిళకు ఇవ్వండంటూ కౌంటర్ ఇచ్చారు.

కేటీఆర్ కామెంట్స్ - షర్మిల కౌంటర్
కేటీఆర్ కామెంట్స్ - షర్మిల కౌంటర్

YS Sharmila On KTR Comments : మహిళా రిజర్వేషన్ బిల్లుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు మంత్రి కేటీఆర్. బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… మహిళా బిల్లు అమలు ద్వారా తన సీటు పోయినా ఫర్వాలేదంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. అమలు అయ్యే వరకు ఎందుకు ఇప్పుడే ఓ మహిళకు సీటు త్యాగం చేయవచ్చు కదా అంటూ ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

“మహిళా రిజర్వేషన్లతో తన సీటు కోల్పోయినా సిద్ధమే అని చెప్పే కేటీఆర్ గారు.. బిల్లు అమలయ్యేదాక ఎదురుచూడటం ఎందుకు? ఈ ఎన్నికల్లోనే మీ సీటు త్యాగం చేసి ఒక మహిళకు ఇవ్వండి.. మిమ్మల్ని అడ్డుకునేదెవరు..? నిజంగా మహిళల రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే.. మీరు డబ్బాలు కొట్టుకుంటున్నట్టు మహిళా బిల్లు మీ పోరాట ఫలితమే అయితే.. ఈ ఎన్నికల్లోనే మహిళలకు పెద్దపీట వేయండి. మీ సీటు మహిళకు ఇవ్వండి. మీ పార్టీ ప్రకటించిన సీట్లలో మహిళలకు 33 శాతం తక్షణమే అమలు చేసి చూపించండి. బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన రాష్ట్రంగా తెలంగాణను ఆదర్శంగా నిలపండి. మహిళలను దారుణంగా అవమానించిన మీరే ఈరోజు మహిళల గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు.. నిరుద్యోగుల కోసం మేం దీక్షలు చేస్తే వ్రతాలంటూ ఎద్దేవా చేసింది మీరే.. మహిళా మంత్రులు లేకుండా చేసింది మీరే.. మహిళా కమిషన్ ఉందన్న సంగతే మర్చిపోయారు. శ్రీకాంత చారి తల్లి ఓడిపోతే ఆమెకు ఏ పదవి ఇవ్వలేదు” అంటూ విమర్శలు గుప్పించారు షర్మిల.

మీ చెల్లి కవితమ్మ ఓడిపోతే కేసీఆర్ బిడ్డ కాబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారని ఆరోపిచారు షర్మిల. “మీకున్నది మహిళల మీద ప్రేమ కాదు.. మీ కుటుంబం మీద ప్రేమ.. మీకు సామాన్య ప్రజల్ని ప్రేమించే సత్తాలేదు. మాటలతో చిత్తశుద్ధి నిరూపణ కాదు.. చేతలతోనే అవుతుంది. 119 నియోజకవర్గాల్లో 63 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువని ఎన్నికల సంఘం చెప్తోంది. 33 శాతం లెక్కన ఈ ఎన్నికల్లో మీరిచ్చిన 7 సీట్లతో పాటు మరో 32 సీట్లు ఇవ్వండి. గజ్వేల్ ,సిద్దిపేట,సిరిసిల్లలో మహిళల ఓట్లే అధికం కాబట్టి దమ్ముంటే మీ సీట్లను ఇప్పుడే త్యాగం చేయండి. అప్పుడు నమ్ముతాం మహిళా బిల్లు మీ పోరాట ఫలితమేనని..! మహిళల పట్ల మీకు ఎంతో చిత్తశుద్ధి ఉందని..! మీవి అవకాశవాద రాజకీయాలు కాదని..! దమ్ముంటే కేటీఆర్ ఈ సవాల్ స్వీకరించాలి” అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు వైఎస్ షర్మిల.

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.