Nizamabad : నక్సలిజం మాయమైపోతోంది.. ఇండియన్ ఆర్మీ పిలుస్తోంది.. ఈ గ్రామం ఎంతో ప్రత్యేకం!
Nizamabad : మూడు దశాబ్దాల కిందట తెలంగాణ పల్లెల పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు. అందుకు ఉదాహరణే పూర్వపు నిజామాబాద్ జిల్లాలోని తిప్పాపూర్ విలేజ్. ఒకప్పుడు ఆ గ్రామం నక్సలిజానికి పెట్టింది పేరు. కానీ ఇప్పుడు అది సైనికుల గ్రామంగా మారింది. ఇప్పటికే 18 మంది ఆర్మీలో చేరారు. అలాంటి గ్రామం గురించి ప్రత్యేక కథనం.
తెలంగాణ ప్రాంతంలో 1980-90 మధ్య నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చాలా ఎక్కువ. ఆ సమయంలో ఎందరో విప్లవ సాహిత్యానికి ఆకర్షితులై.. కుటుంబాన్ని, భవిష్యత్తును వదిలి అడవుల బాట పట్టారు. విద్యావంతులు కూడా నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. దీంతో వారి బలం పెరిగి, చాలా ప్రాంతాలపై పట్టు ఉండేది. ఆ ప్రాంతాలకు వెళ్లాలంటే పోలీసులు భయపడేవారు.

నక్సలిజం వైపు అడుగులు..
కానీ క్రమంగా రాజ్యం బలపడుతూ వచ్చింది. దట్టమైన అడవులపైనా పట్టు సాధిస్తూ వస్తోంది. అటు అడవి ప్రాంత గ్రామాల యువత నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అవగాహన కల్పించాయి. అదే సమయంలో నక్సలైట్ల ఏరివేతను ముమ్మరం చేశాయి. దీంతో పరిస్థితులు మారాయి. ఒకప్పుడు నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న గ్రామాలు.. ఇప్పుడు జవాన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. అందుకు మంచి ఉదాహరణ తిప్పాపూర్.
ఇంటికో నక్సలైట్ అన్నట్టు..
తిప్పాపూర్ గ్రామం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన చాలామంది యువకులు 1980 నుంచి 1990 మధ్య కాలంలో నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. ఇంటికో నక్సలైట్ అన్నట్టు మారిపోయింది పరిస్థితి. రాజ్యానికి వ్యతిరేకంగా పోరుబాట, అడవిబాట పట్టారు. గ్రామం నడిబొడ్డున పెద్ద అమరవీరుల స్మారక స్థూపాన్ని కూడా నిర్మించారు. అప్పట్లో నలుగురు అధికారును కిడ్నాప్ చేసి సంచలనం సృష్టించారు.
కాలం మారింది..
దాదాపు దశాబ్ద కాలంపాటు తిప్పాపూర్ నక్సలైట్లకు అడ్డాగా మారింది. కానీ.. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. కొన్ని రోజుల తర్వాత రాజ్యం పైచేయి సాధించింది. 1990లో ఒకేసారి నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఆ గ్రామ ప్రజలతోనే స్థూపాన్ని కూల్చివేయించారు. అప్పటి నుంచి తిప్పాపూర్‌పై నిఘా పెంచారు. తీవ్ర నిర్బంధంతో.. నక్సలిజం తగ్గింది. యువతలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి.
ఆర్మీలో చేరిన మొదటి వ్యక్తి..
ఎన్‌కౌంటర్ తర్వాత 1991లో గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి మొదట ఇండియన్ ఆర్మీలో చేరారు. ఈ విషయం తెలిసి అతన్ని నక్సలైట్లు పిలిపించారు. రాష్ట్ర పోలీస్ శాఖలో మాత్రం చేరవద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆయన ఆర్మీలో చేరారు. అశోక్‌ను చూసి మరికొందరు అదే బాటలో నడిచారు. అలా ఒకరి తర్వాత ఒకరు.. ఇప్పటివరకు 18 మంది ఇండియన్ ఆర్మీలో చేరారు. మరో 30 మంది వరకు వెళ్లడానికి శిక్షణ పొందుతున్నారు.
జవాన్లకు కేరాఫ్ అడ్రస్..
దీంతో ఒకప్పుడు నక్సలైట్లకు అడ్డాగా ఉన్న తిప్పాపూర్ గ్రామం.. ఇప్పుడు ఆర్మీ జవాన్ల అడ్డాగా మారుతోంది. గతంలో ఇంటికొక నక్సలైట్ అన్నట్టు ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు ఇంటికొక జవాన్ అన్నట్టుగా మారింది. దీంతో ఆ గ్రామ రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో పోలిస్తే.. ఇప్పుడు చాలా ప్రశాంతంగా బతుకుతున్నామని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు.