Warangal Crime: యువతికిఉద్యోగం చూపించినందుకు వరంగల్‌లో యువకుడిపై దాడి చేశారు.ఈ ఘటనలో పోలీసులు 29 మంది యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన వరంగల్ నగరంలో శనివారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ములుగు జిల్లా నర్సాపూర్ కు చెందిన కొండం సాయిచరణ్ అనే యువకుడు ప్రస్తుతం వరంగల్ నగరంలోని న్యూ శాయంపేటలో ఉంటున్నాడు. ఉపాధి కోసం డామినోస్ పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. వరంగల్ నగరంలోని ఓ వెహికిల్ షోరూంలో పని చేస్తున్న తన అక్కతో పాటు వరంగల్ జాన్ పీరీలు ఏరియాకు చెందిన ఓ ముస్లిం యువతి పని చేస్తుండగా, ముస్లిం యువతి అక్కడ ఇచ్చే జీతం సరిపోక వేరే ఉద్యోగం ఏదైనా ఉంటే చూడాల్సిందిగా సాయి చరణ్ ను వేడుకుంది.
దీంతో హనుమకొండ చౌరస్తాలోని ఓ కన్సల్టెన్సీలో ఉద్యోగం ఉందని చెప్పగా.. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఆ యువతి అక్కడికి వెళ్లింది. ఇద్దరూ కలిసి హనుమకొండ చౌరస్తాలోని రోడ్డుపై మాట్లాడుతుండగా, అజీమ్ అనే యువకుడు ఆ ఇద్దరినీ చూసి, వీడియోలు తీశాడు.
అనంతరం సాయి చరణ్ వద్దకు వెళ్లి.. గొడవ పడ్డాడు. ఆ తరువాత సాయి చరణ్ ను తన బైక్ పై అలంకార్ జంక్షన్ కు బలవంతంగా తీసుకెళ్లాడు. అక్కడ ఇర్షాద్, ముజ్జు, మరో వ్యక్తి కలిసి సాయి చరణ్ పై దాడికి దిగారు. తీవ్రంగా దుర్భాషలాడుతూ అక్కడి నుంచి జాన్ పీరీల ఏరియాలోని యువతి ఇంటికి తీసుకెళ్లారు.
జాన్ పీరీలు ఏరియాలోని యువతి ఇంటి వద్ద మరోసారి సాయి చరణ్ పై దాడికి దిగిన యువకులు, బాధితుడి ప్యాంటుకు ఉన్న బెల్టు తీశారు. అదే బెల్టుతో అతడిని చితక బాదారు. అక్కడి నుంచి మండి బజార్ ఏరియాకు తీసుకొచ్చి, గ్రీన్ బావర్చి హోటల్ వెనుక ఉన్న ఓ పురాతన భవనంలో బంధించారు.
ఆ తరువాత మరికొంతమందిని అక్కడికి తీసుకొచ్చి, మరోసారి కర్రలతో సాయిచరణ్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సాయి చరణ్ తీవ్రంగా గాయపడగా.. ఒంటిపై వాతలు తేలాయి. దీంతో సాయి చరణ్ సొమ్మసిల్లగా, అతడిని సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు.
తీవ్ర గాయాల పాలైన సాయిచరణ్ స్థానికుల సహాయంతో హనుమకొండ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. ఒంటిపై వాతలు తేలడంతో ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న అనంతరం తనపై దాడికి పాల్పడిన యువకులపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎండీ అజీమ్, షేక్ అప్సర్, ఎండీ ఇర్షాద్, ముజ్జు, శహబాజ్, మహమ్మద్, ఫయాజ్, నెహాల్ తో పాటు మరో 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఆరుగురిని ఆదివారం రిమాండ్ కు తరలించగా.. మిగతా వాళ్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సాయిచరణ్ పై అతి కిరాతకంగా దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ వరంగల్ విభాగ్ సహాయ కార్యదర్శి ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలో 30 మంది ముస్లిం యువకులు హిందూ యువకులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వాట్సాప్ గ్రూప్ లు ఏర్పాటు చేసుకుని ఒక గ్యాంగ్ గా ఏర్పడ్డారని, వారందరిని గుర్తించి అరెస్టు చేయాలని ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం