Rajanna Sircilla : కేసులో ఇరికించాలని కిడ్నాప్ డ్రామా...! బెడిసికొట్టిన ప్లాన్, యువకుడు కటకటాలపాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడి కట్టుకథ కటకటాలపాలు చేసింది. భూ వివాదం నేపథ్యంలో పెద్దనాన్న కుటుంబాన్ని కేసులో ఇరికించాలని కిడ్నాప్ డ్రామా ఆడి కేసులో ఇరుక్కున్నాడు. యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎక్కల గంగారాజు కిడ్నాప్ డ్రామా ఆడారు. తన పెద్దనాన్న రాజయ్యతో ఉన్న రెండు ఎకరాల భూమి వివాదం నేపథ్యంలో వారి కుటుంబాన్ని కేసులో ఇరికించాలని పథకం పన్నాడు. కిడ్నాప్ కట్టుకథ అల్లాడు.
ఈనెల 15న ఉదయం వ్యవసాయ బావి వద్ధకు వెళ్ళిన గంగరాజు సాయంత్రం వరకు తిరిగి రాలేదు. ఆయన బైక్, చెప్పులు, సెల్ ఫోన్, రక్తపు మరకలతో షర్ట్ వ్యవసాయ బావి వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. భార్య చూసి భోరున విలపించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి పరిస్థితిని చూసి ఎవరైనా హత్య చేసి ఉంటారని అందరు భావించారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
హత్యనా.. ఆత్మహత్యనా..?
గంగరాజు బావి వద్ద పరిస్థితి చూసిన తర్వాత పోలీసులు హత్యనా...? ఆత్మహత్యనా అనే కోణంలో విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ తోపాటు డాగ్ స్క్వాడ్ తో ఆరాతీశారు. హత్య చేసి బావిలో పడేసి ఉంటారని బావించి గజ ఈతగాళ్ళతో బావిలో గాలించారు. 24 గంటలు అయిన అతని ఆచూకీ లభించలేదు. గంగరాజు అదృశ్యం మిస్టరీని చేధించేందుకు వేములవాడ రురల్ సర్కిల్ పరిధిలోని పోలీసులంతా నిమగ్నమయ్యారు. 24 గంటల తర్వాత గంగరాజు తన పొలానికి కొంత దూరంలో కాళ్ళు, చేతులు కట్టేయబడి కొన్ని గాయాలతో పడిఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా గంగారాజు గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడి చేసి తాళ్ళతో కాళ్ళు చేతులు కట్టేసి అడవిలో వదిలిపోయారని తెలిపాడు. అతని ఆరోగ్యాన్ని పరిశీలించి ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.
ఆరా తీయగా గుట్టురట్టు...
గంగరాజు వాలకం అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు ఆరా తీశారు. అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నాప్ డ్రామా కట్టుకథ అని తేలడంతో పోలీసులు తోపాటు గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు. పెద్దనాన్నతో భూ వివాదం నేపథ్యంలో వారి కుటుంబాన్ని కేసులో ఇరికించాలని కిడ్నాప్ డ్రామా అడినట్లు గంగరాజు వెల్లడించారు.
వెంటనే పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసుల విలువైన సమయాన్ని వృధా చేశాడని అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిఐ వెంకటస్వామి తెలిపారు. గంగరాజే కాదు ఎవరైనా తప్పుడు సమాచారంతో పోలీసుల విలువైన సమయాన్ని వృధా చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.
రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
టాపిక్