Dating Apps: డేటింగ్ యాప్స్‌తో జాగ్రత్త.. వలపు వల వేస్తే.. గిలగిలా కొట్టుకుంటారు!
Dating Apps: డేటింగ్ యాప్‌లో పరిచయం అవుతారు. మాటలతో మైమరపిస్తారు. వలపు వల విసిరి.. డబ్బులు దండుకుంటారు. అవును.. హైదరాబాద్ నగరంలో డేటింగ్ యాప్స్‌తో ఇప్పుడు పెద్ద దందానే నడుస్తోంది. ఈ దందాలో కేవలం అమ్మాయిలే కాదు.. పబ్‌లు, క్లబ్‌లు కూడా ఉంటున్నాయి.
ప్రస్తుతం వందలాది డేటింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో రోజుకో రకమైన మోసం జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో డేటింగ్ యాప్స్ దందా నడుస్తోంది. కేవలం అమ్మాయిలే కాదు.. క్లబ్‌లు, పబ్‌లు కూడా ఈ దందాలో పాలు పంచుకుంటున్నాయి. అందినకాడికి దోచుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. మోసాలు మాత్రం తగ్గడం లేదు.
పక్కా స్కెచ్‌తో రప్పిస్తారు..
ఓ యువకుడకి డేటింగ్ యాప్‌లో అమ్మాయి పరిచయం అయ్యింది. ఆమె పిలిచింది కదా అని మనోడు ఎగేసుకుంటూ వెళ్లాడు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పబ్‌లోకి ఇద్దరూ కలిసి వెళ్లారు. ఇలా వెళ్లారో లేదో.. అలా వేల రూపాయల బిల్లు వచ్చింది. దీంతో పాపం మనోడికి గుండె ఆగినంత పనైంది. కానీ.. ఏం చేయలేని పరిస్థితి. అమ్మాయి పక్కన ఉంది కాబట్టి.. బిల్లు కట్టేసి రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని వచ్చేశాడు.
ఆ తర్వాత అసలు విషయం తెలిసింది..
సాధారణంగా పబ్‌కు వెళ్తే అంత డబ్బు ఖర్చు కాదు. అదే విషయంపై సదరు యువకుడు ఆరాతీశాడు. అప్పుడు అసలు విషయం తెలిసింది. తనకు పరిచయం అయిన అమ్మాయికి.. సదరు పబ్ నిర్వాహకులకు ముందే పరిచయం ఉంది. దీంతో ఒక్కో దానికి పదింతలు రేట్లు పెంచి బిల్లు వేశారు. ఆ డబ్బులను.. అమ్మాయి, పబ్ నిర్వాహకులు పంచుకున్నారు. మళ్లీ సదరు అమ్మాయితో మాట్లాడుదాం అంటే.. నో రెస్పాన్స్.
పోలీసులు అవగాహన కల్పించినా..
ఇలాంటి ఘటనలపై తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు సీరియస్‌గా ఉంటున్నారు. కానీ.. ఎవరూ బయటకు వచ్చి ఇలా మోసపోయాం అని చెప్పడం లేదు. చెప్తే పరువు పోతుందని చాలామంది వదిలేస్తున్నారు. అయితే.. ఇలాంటి వారిలో ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అటువైపు నుంచి ఎవరైనా సంప్రదిస్తే.. సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
డేటింగ్ కల్చర్‌తో చిక్కులు..
ఒకప్పుడు బాగా డబ్బున్న వారు డేటింగ్‌కు వెళ్లేవారు. ఇప్పుడు అదికాస్త మధ్యతరగతి యువత వరకు పాకింది. దీంతో చదువు కోసం, ఉద్యోగం కోసం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్లిన వారు డేటింగ్ చిక్కుల్లో పడుతున్నారు. ఇంట్లో వాళ్లకి తెలిస్తే పరువు పోతుందని భయపడి సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినా.. బయటకు రావడం లేదు. అందుకే డేటింగ్ యాప్‌లతో జాగ్రత్త అని చెబుతున్నారు పోలీసులు.