పేరెంట్స్ మందలించారని ప్రాణం తీసుకున్న యువకుడు
ఇంట్లో డబ్బుల విషయంలో జరిగిన గొడవలో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ట్రైన్ కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి రైల్వే ట్రాక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి రైల్వే ట్రాక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. మృతుడి స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ల పల్లి మండల కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది.
మంచిర్యాల జిఆర్పి పోలీసులు తెలిపిన ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కొడారి కొమురయ్య రాజమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలకు గతంలోనే పెళ్లిళ్లు కాగా కుమారుడు కొడారి శ్రీకాంత్ (26) బీటెక్ పూర్తి చేశాడు. ఆ తరువాత ఎంబీఏలో చేరి తల్లిదండ్రులతో వ్యవసాయ పనులకు సహకరిస్తూ ఇంటి వద్దే ఉంటున్నాడు.
ఇంతవరకు బాగానే ఉండగా.. ఆదివారం రాత్రి ఇంట్లో ఉన్న కొంత డబ్బును శ్రీకాంత్ తల్లిదండ్రులకు తెలియకుండా తన సొంత అవసరాలకు వాడుకున్నాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి శ్రీకాంత్ ను నిలదీశారు. ఈ క్రమంలో శ్రీకాంత్ కు, తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో డబ్బుల విషయంలో కుటుంబ సభ్యులు మందలించడంతో శ్రీకాంత్ తీవ్ర మనస్థాపం చెందాడు. తనను అకారణంగా పేరెంట్స్ మండలించారని, ఎలాగైనా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.
ట్రైన్ కింద పడి నుజ్జునుజ్జు
సోమవారం తెల్లారుజామున ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన బైక్ పై బయటకు వెళ్లిన శ్రీకాంత్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ రైల్వే ట్రాక్ పక్కన తన బైక్ పార్క్ చేసి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనలో శ్రీకాంత్ శరీరం నుజ్జు నుజ్జు అయి చెల్లాచెదురు కాగా.. అటుగా వెళ్లిన రైల్వే సిబ్బంది గమనించి జీఅర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ట్రాక్ పక్కనున్న బైకు, సెల్ ఫోన్ ఆధారంగా మృతిడిని శ్రీకాంత్ గా గుర్తించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని శ్రీకాంత్ మృత దేహాన్ని గుర్తించి బోరున విలపించారు. ఒక్కగానొక్క కొడుకు రైలు కింద నుజ్జునుజ్జవడంతో కన్నీరుమున్నీరయారు. అనంతరం రైల్వే పోలీసులకు కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అందరితో కలివిడిగా వుండే శ్రీకాంత్ రైలు కిందపడి చనిపోవడంతో మొగుళ్ళపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
-రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ జిల్లా ప్రతినిధి