EV Battery Explosion | పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ.. హైదరాబాద్‌లో మరో ఘటన-yet another ev battery explosion incident took place in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Yet Another Ev Battery Explosion Incident Took Place In Hyderabad

EV Battery Explosion | పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ.. హైదరాబాద్‌లో మరో ఘటన

HT Telugu Desk HT Telugu
Feb 02, 2022 03:26 PM IST

పెట్రోల్, డీజిల్ వద్దనీ.. ఇప్పుడు ట్రెండ్ అంతా ఎలక్ట్రానిక్ వాహనాలదేనని మార్కెట్లో మంచి ప్రమోషన్ ఉంది. కానీ కొన్ని ఘటనలు ఎలక్ట్రిక్ వాహనాలంటేనే భయం పుట్టేలా చేస్తున్నాయి. హైదరాబాద్ లోని చింతల్ ఏరియాలో EV బ్యాటరీ పేలిన ఘటన కలకలం రేపుతోంది.

E-Scooter Batter Explodes in Hyderabad
E-Scooter Batter Explodes in Hyderabad (FB)

Hyderabad, February 2 | హైదరాబాద్‌లోని చింతల్ ఏరియాలో EV బ్యాటరీ పేలిన ఘటన కలకలం రేపుతోంది. సేల్స్ మార్కెటింగ్ చేసే సాయికుమార్ అనే వ్యక్తి పెట్రోల్ ఖర్చులు భరించలేక రోజుకు రూ. 150 అద్దె చెల్లిస్తూ ఎలక్ట్రిక్ స్కూటీని నడుపుకుంటున్నాడు. ప్రతిరోజూ ఆ స్కూటర్ బ్యాటరీ తీసి రాత్రి ఛార్జింగ్ పెట్టి ఆ మరుసటి రోజు ఉపయోగిస్తున్నాడు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఎప్పట్లాగే స్కూటర్ బ్యాటరీ తీసి ఒక గదిలో ఛార్జింగ్ పెట్టి తాను మరో గదిలో నిద్రపోయాడు. తెల్లవారుఝామున 3 గంటల సమయంలో ఏదో కాలుతున్న వాసన, కమ్ముకున్న పొగను గమనించాడు, బ్యాటరీ నుంచి వస్తున్నట్లు గ్రహించి వెంటనే స్విఛాఫ్ చేద్దామనుకునేలోపు ఆ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

బ్యాటరీ పేలుడు ధాటికి ఇంట్లో ఇతర సామాగ్రి కూడా ధ్వంసం అయింది. అగ్ని ప్రమాదం సంభవించి మొబైల్, బట్టలు, చెక్క సామాగ్రి ఇతర వస్తువులు కాలిపోయాయి. చుట్టుపక్కల వారు, జీడిమెట్ల పోలీసులు అటుగా వచ్చి మంటలు ఆర్పడంలో సహాయం చేశారు.

అయితే ఈ పేలుడు ఘటనలో ఎవరికీ ఏ హాని కలుగలేదు. ఆ సమయంలో ఆ రూంలో ఎవరూ లేరని, ఒకవేళ ఉండి ఉంటే తమ పరిస్థితి ఏమయ్యేదోనని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు.

కాగా, వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలడం ఇప్పుడు కలవరపెడుతోంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే మూడు నెలల వ్యవధిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండో సారి. గత సెప్టెంబర్ నెలలో కూడా ఓ షాంపిగ్ మాల్ వద్ద పార్క్ చేసిన ఇ-స్కూటర్ బ్యాటరీ పేలింది. ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

పెట్రోల్, డీజిల్ వద్దనీ.. ఇప్పుడు ట్రెండ్ అంతా ఎలక్ట్రానిక్ వాహనాలదేనని మార్కెట్లో మంచి ప్రమోషన్ ఉంది. ప్రభుత్వం కూడా ఈవీలు కొనుగోలు చేసే వారికి వివిధ రాయితీలు, పన్ను మినహాయింపులు కల్పిస్తుండటంతో జనం కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ తరహా ఘటనలు మాత్రం వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలంటేనే భయం పుట్టేలా చేస్తున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం