Dharmapuri Yama Temple : యముడి ఆలయం గురించి ఎప్పుడైన విన్నారా?.. ఇదిగో
Yama Dwitiya In Dharmapuri : మరే ప్రాంతంలో లేని విధంగా యమ ధర్మరాజుకు జగిత్యాల ధర్మపురిలో ఆలయం ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవడం అంటే.. యమ ద్వితీయ గురించి తెలుసుకోవాలి కాబట్టి. ఇంతకీ యమ ద్వితీయ అంటే ఏంటి?
భయంతో యమ ధర్మరాజు(Yamadharma raju) పేరు వినడానికి ఎవరూ ఇష్టపడరు. యముడిని ఆహ్వానించడం మరణానికి ఆహ్వానంతో సమానమని అంటుంటారు. కానీ చాలామంది భక్తులు యమ ద్వితీయ సందర్భాన్ని పాటిస్తారు. ఆ రోజున యముడు తన సోదరి యమునా దేవి ఇంటికి భోజనానికి వస్తాడని నమ్ముతారు.
ధర్మపురి(Dharmapuri)లోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పక్కనే ఉన్న యమ ధర్మరాజు ఆలయానికి ప్రతి సంవత్సరం దీపావళి(Deepavali) తర్వాత రెండో రోజున వచ్చే యమ ద్వితీయ(Yama Dwitiya), వేసవి కాలంలో వచ్చే భరణి నక్షత్రం నాడు భక్తులు ఎక్కువగా వస్తుంటారు.
యమ ద్వితీయ రోజున యముడు(Yamudu) తన చెల్లి యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లాడని చెబుతారు. తిరిగి యమలోకం వెళ్లే ముందు ఈ రోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిస్తాడని కథ ప్రచారంలో ఉంది. అలా చేస్తే.. అకాల మరణం సంభవించదని అంటుంటారు. అందుకోసమే.. దీపావళి రెండో రోజున సోదరీమణులు తమ సోదరులను భోజనానికి పిలుస్తారంటారు. 'భాయిదూజ్' అని పిలిచే ఆహారాన్ని వారికి అందిస్తారు.
భక్తులు(Devotees) తమ జీవితాలలో అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు యమ ధర్మరాజు గండ దీపంలో నూనె పోసి పూజిస్తారు. గండాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా కొందరు భక్తులు శనిగ్రహ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈసారి యమ ద్వితీయ కోసం అధికారులు ఏర్పాట్లు భారీగా చేశారు. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఆయురారోగ్యాలు, మంచి ఆరోగ్యం కోసం యమ ధర్మ రాజుకు మన్యు సూక్తం, ఆయుష్య సూక్తం, అభిషేకం, ఆరతి, మంత్ర పుష్పం, రుద్రాభిషేకం, ఆయుష్ సూక్త హోమం వంటి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
ప్రాణాలను హరిస్తాడని నమ్మే యమధర్మరాజుకి ఎంతో భక్తితో ఇక్కడ పూజలు చేస్తారు. ఇలా గుడి ఉండటం ఆశ్చర్యంగా అనిపించినా.. కొన్ని వందల ఏళ్ల నుంచి ధర్మపురిలో యముడు పూజలు అందుకుంటున్నాడు. శని గ్రహ దోషాలు, జాతక దోషాలు ఉన్న వారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. తమ జాతకాలు బాలేవు అని, ఏం చేసిన కలిసి రావట్లేదని, జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని అనుకునే వాళ్లు కూడా ఇక్కడకు వస్తుంటారు.