Yadadri Bhuvanagiri Collector : తెల్లారకముందే విద్యార్థి ఇంటి తలుపుతట్టిన జిల్లా కలెక్టర్ - ఎందుకో తెలుసా...?-yadadri bhuvanagiri collector hanumantha rao visited ssc student home at 5 am ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yadadri Bhuvanagiri Collector : తెల్లారకముందే విద్యార్థి ఇంటి తలుపుతట్టిన జిల్లా కలెక్టర్ - ఎందుకో తెలుసా...?

Yadadri Bhuvanagiri Collector : తెల్లారకముందే విద్యార్థి ఇంటి తలుపుతట్టిన జిల్లా కలెక్టర్ - ఎందుకో తెలుసా...?

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Feb 06, 2025 02:55 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టెన్త్ పరీక్షల నేపథ్యంలో ఉదయం 5 గంటలకే ఓ విద్యార్థి ఇంటికెళ్లి తలుపుతట్టారు. కంకణాలగూడెం గ్రామంలోని భరత్​ చంద్ర అనే విద్యార్థితో మాట్లాడారు. చదువుకునేందుకు వీలుగా ఒక చైర్, రైటింగ్ పాడ్ గిఫ్ట్ గా ఇచ్చారు.

విద్యార్థి ఇంటి వద్ద యాదాద్రి జిల్లా కలెక్టర్
విద్యార్థి ఇంటి వద్ద యాదాద్రి జిల్లా కలెక్టర్

ఉదయం 5 అవుతోంది..! భరత్ చంద్ర అనే పిలుపు వినిపిస్తోంది. డోర్ తీసి చూస్తే… జిల్లా ఉన్నతాధికారి దర్శనమిచ్చారు. వచ్చింది ఎవరో కాదు… జిల్లా కలెక్టర్ అని తెలిసి విద్యార్థితో పాటు కుటుబమంతా కూడా ఆశ్చ్యర్యానికి గురైంది. అ అనూహ్య ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది.

తలుపు తట్టిన జిల్లా కలెక్టర్…

వివరాల్లోకి వెళ్తే… త్వరలోనే పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. టెన్త్ ఫలితాల్లో ప్రతి జిల్లా కూడా సత్తా చాటాలని, ఉత్తీర్ణత శాతం పెరిగాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం సాధించడమే లక్ష్యంగా యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు "విద్యార్థుల ఇంటి తలుపు తట్టే(Knocking on Doors)" కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

విద్యార్థికి భరోసా…

ఇవాళ సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాలగూడెం వెళ్లారు.భరత్ చంద్ర చారి అనే విద్యార్థికి ఇంటికి వెళ్లి మేల్కొలిపారు. టెన్త్ పరీక్షలకు సన్నద్దమవుతున్న తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి…విద్యార్థి జేబు ఖర్చుల కోసం రూ.5,000ను అందజేశారు. అలాగే భరత్‌ చదువు కోసం ఒక కుర్చీ మరియు రైటింగ్ ప్యాడ్ కూడా అందించారు.

మంచిగా చదువుకోవాలి - జిల్లా కలెక్టర్

ఈ సందర్భంగా విద్యార్థి భరత్ ను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. “పదో తరగతి నీ భవిష్యత్తుకు కీలకమైన మైలురాయి. నీ తల్లి నిన్ను చదివించడానికి కష్టపడుతోంది. మంచి మార్కులు సాధించి ఆమెకు గర్వకారణంగా నిలవాలి. కష్టపడితే జీవితంలో ముందుకెళ్లగలుగుతావు. ఇది నీ విజయయాత్రలో తొలి అడుగు. నీ తల్లిదండ్రులు, గురువులు, జిల్లా గర్వించేట్టు నువ్వు మంచిగా చదువుకోవాలి. భవిష్యత్తులో స్థిరపడే వరకు నా సహాయం కొనసాగిస్తా" అని కలెక్టర్ హామీనిచ్చారు.

ఊహించలేదు - విద్యార్థి భరత్ చంద్రా చారి

విద్యార్థి భరత్ మాట్లాడుతూ, “నేను పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను. నా కల నెరవేర్చడానికి కష్టపడి చదువుకుంటాను. కలెక్టర్ గారు నన్ను స్వయంగా వచ్చి కలవడం ఊహించలేదు. ఇది నాకెంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. ఇకపై నా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మరింత ముమ్మరంగా చదువుతాను” అని చెప్పాడు. భరత్ తల్లి విజయలక్ష్మి… జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఉదయం 5 గంటలకే విద్యార్థి ఇంటికెళ్లిన జిల్లా కలెక్టర్ హనుమంతరావుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కలెక్టర్ అంటే ఇలా ఉండాలంటూ పోస్టులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Whats_app_banner

సంబంధిత కథనం