Opinion: తెలంగాణ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం-women voters are crucial in upcoming telangana assembly elections 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Women Voters Are Crucial In Upcoming Telangana Assembly Elections 2023

Opinion: తెలంగాణ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం

HT Telugu Desk HT Telugu
May 24, 2023 03:06 PM IST

‘చట్టసభలో 5 శాతం ప్రాతినిథ్యంతో 48 శాతం మహిళా ఓటర్ల సమస్యలపై మహిళా ప్రజాప్రతినిధులు ఏం పోరాడగలరు? తమకు ఎక్కువ సీట్లు ఇవ్వమని అడగలేని సంక్లిష్ట పరిస్థితులను మహిళా నాయకులు ఎదుర్కొంటున్నారు..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్ వి.సంధ్య విశ్లేషణ.

కర్ణాటకలో మహిళా ఓటర్లను వినూత్న మేనిఫెస్టోతో కాంగ్రెస్ ఆకట్టుకుంది
కర్ణాటకలో మహిళా ఓటర్లను వినూత్న మేనిఫెస్టోతో కాంగ్రెస్ ఆకట్టుకుంది (PTI)

తెలంగాణ ఉద్యమంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. ప్రజా సంఘాలు మొదలుకొని సబ్బండ వర్గాల మహిళామణులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా ముందుండి ఉద్యమించారు. ఎన్నో ఆశలతో తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళలకు ఆశించిన మేరకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పవచ్చు. మహిళలకు ఒకటి అర పథకాలు ప్రవేశపెట్టి కేసీఆర్‌ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు

బంగారు తెలంగాణ కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే బంగారం అయ్యిందనే విమర్శలు మహిళా రంగంలో కూడా కనిపిస్తోంది. తెలంగాణ జాగృతి, బతుకమ్మ పేరిట క్రియాశీలకంగా వ్యవహరించిన కేసీఆర్‌ కుమార్తె కవితకు మాత్రమే ప్రత్యేక రాష్ట్రంలో ప్రాధాన్యత లభించింది. కవిత 2019 ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోవడంతో ఆమెకు అధికారిక హోదా తగ్గకుండా ఉండేందుకు వెంటనే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత అంటే కవిత మాత్రమే అనే వ్యవహారంగా పరిస్థితులు మారిపోయాయి.

రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా లిక్కర్‌ స్కాం వ్యవహారంతో దేశవ్యాప్తంగా కూడా కవిత పేరు మార్మోగిపోయింది. ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత జాతీయ స్థాయిలో సానుభూతి పొందాలనే వ్యూహంతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అంశాన్ని ఢిల్లీ వేదికగా లేవనెత్తి హడావుడి చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ముందుగా రాష్ట్రంలో మహిళలకు అన్ని రంగాల్లో 33 శాతం రిజర్వేషన్లను కల్పించి దేశానికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు రావడంతో కవితతో పాటు బీఆర్‌ఎస్‌ కూడా వెనుకంజ వేశాయి.

2014లో మొదటి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్‌లో ఒక మహిళకు కూడా చోటు దక్కకపోవడం చూస్తే నారీలోకంపై కేసీఆర్‌ ప్రభుత్వానికి ఉన్న వివక్ష ఎంటో అర్థం అవుతోంది. మహిళలకు రాష్ట్ర కేబినెట్‌లో స్థానం ఇవ్వకపోవడంపై ఒక ప్రతిపక్ష మహిళా ప్రజాప్రతినిధి ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో దావా వేయడం అప్పట్లో సంచలనం రేపింది. దీంతో రెండో మారు ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు మంత్రి పదవులిచ్చారు.

మహిళలకు ప్రాతినిథ్యం ఏదీ?

తెలంగాణ ఓటర్లలో 48 శాతం మహిళలున్నా శాసనసభలో వారి ప్రాతినిధ్యం మాత్రం కేవలం 5 శాతమే ఉండడం దురదృష్టకరం. 2014లో 7.56 శాతంగా ఉన్న మహిళల ప్రాతినిధ్యం 2018లో తగ్గింది. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పద్మాదేవేందర్‌ రెడ్డి, గొంగిడి సునీత, రేఖా నాయక్‌ గెలవగా, కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియా నాయక్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు. సీతక్క మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. మిగిలిన పార్టీల నుంచి ఒక్క మహిళ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు.

2018 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీఆర్‌ఎస్‌ నుంచి కేవలం నలుగురు మహిళలకే టికెట్లు కేటాయించారు. ప్రజాకూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ 100 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టగా, ఇందులో 11 సీట్లే మహిళలకు ఇచ్చింది. టీడీపీ 13 స్థానాల్లో ఒక స్థానాన్ని మహిళకు ఇచ్చింది. బీజేపీ 14 స్థానాలను, సీపీఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ 10 స్థానాలను, టీజేఎస్‌, సీపీఐలు ఒక్కో స్థానాన్ని మహిళలకు కేటాయించాయి. ఎంఐఎం ఒక్క మహిళకు కూడా టికెట్‌ ఇవ్వలేదు.

చట్టసభలో 5 శాతం ప్రాతినిథ్యంతో 48 శాతం మహిళా ఓటర్ల సమస్యలపై మహిళా ప్రజాప్రతినిధులు ఏం పోరాడగలరు? తమకు ఎక్కువ సీట్లు ఇవ్వమని అడగలేని సంక్లిష్ట పరిస్థితులను మహిళా నాయకులు ఎదుర్కొంటున్నారు. ‘మహిళలు ఎన్నికల్లో గెలువలేరు. రాజకీయం చేయలేర’ని పార్టీలు భావించడమే దీనికి ప్రధాన కారణం. ఎన్నికల్లో ప్రతి సీటూ ముఖ్యమే కాబట్టి, మహిళలకు సీట్లు ఇచ్చే విషయంలో పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. అయితే, సీట్ల విషయంలో మహిళలు వద్దు గానీ, ఓట్లు దగ్గరకు వచ్చేసరికి మాత్రం రాజకీయ పార్టీలకు మహిళలు కావాలి. ఇటీవల మహిళా ఓటర్ల తీరులో మార్పు వస్తున్నట్లు తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

రాబోయే ఎన్నికల్లో పార్టీల అంచనాలకు మించి మహిళల ఓటింగ్‌ సరళి ఉండబోతుందని, మహిళలను తమవైపు తిప్పుకున్న పార్టీదే విజయమని కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు సంకేతాలు ఇచ్చాయి. పీపుల్స్‌ పల్స్‌ సంస్థ గత డిసెంబర్‌ నుంచి మూడు పర్యాయాల్లో కర్ణాటక వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలలో మహిళలు కాంగ్రెస్‌ వైపు నిలబడ్డారని స్పష్టంగా తేలింది. బీజేపీతో పోలిస్తే దాదాపు 10 శాతం మంది మహిళలు అధికంగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడమే ఆ పార్టీ అఖండ విజయానికి దారులు వేసింది.

ధరల గుదిబండ

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ధరల పెరుగుదల పెద్ద సమస్యగా ఉంది. గత కొన్నేళ్లుగా ఆదాయం పెరగకుండా, ధరల పెరగడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమస్యపై మహిళలు మాత్రమే సరిగ్గా స్పందించగలరు. మన దేశ సంస్కృతిలో ఇంటిని నడిపే పాత్ర ప్రధానంగా మహిళదే కావడం దీనికి కారణం. వంట గ్యాస్‌ మొదలుకొని బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. మహిళలు సీరియస్‌గా తీసుకుంటున్న ఈ ధరల పెరుగుదల చుట్టే కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసి, వారి మనసు గెలుచుకోగలిగింది. కాంగ్రెస్‌ ప్రకటించిన ఐదు హామీలల్లో నాలుగు మహిళలను లక్ష్యంగా చేసుకొని రూపొందించడమే దీనికి నిదర్శనం!

గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్‌, గృహ లక్ష్మి పథకం కింద కుటుంబంలో పెద్దగా ఉన్న మహిళకు ప్రతి నెలా 2 వేల రూపాయిల ఆర్థిక సాయం, అన్న భాగ్య పథకం కింద కుటుంబంలో ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ, శక్తి పథకం కింద రాష్ట్రమంతటా మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం... ఈ నాలుగు హామీలు మహిళల్ని కాంగ్రెస్‌ పార్టీకి దగ్గర చేశాయి. వీటితో పాటు గ్రామీణ మహిళల నుంచి కేజీకి మూడు రూపాయిల చొప్పున ఆవు పేడను కొనుగోలు చేసి ఎరువుల తయారీకి ఉపయోగిస్తామని ప్రకటించడం కూడా వారిని ఆకర్షించింది.

మరోవైపు పండగలకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని, పది కేజీల తృణ ధాన్యాలు, ఉచితంగా అర లీటర్‌ పాలు, ఉచిత ప్రయాణ సౌకర్యం, ఉద్యోగం చేసే మహిళలకు ఉచితంగా హాస్టల్స్‌, గర్భిణీలకు పోషకాహార కిట్స్‌ ఇవ్వడంతో పాటు వితంతు ఫించన్‌ని పెంచుతామని బీజేపీ కూడా ప్రకటించింది. బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అయ్యి ఉండి కూడా ఏమీ చేయలేదనే భావనతో మరో ఆలోచన లేకుండా మహిళలు బీజేపీని దూరం పెట్టేశారు. 2013-18 మధ్య సిద్ధరామయ్య తీసుకొచ్చిన అన్న భాగ్య, ఇందిరా క్యాంటీన్‌ లాంటి పథకాల్లో మహిళలే అత్యధిక లబ్దిదారులుగా ఉన్నారు. అన్న భాగ్య పథకాన్ని తగ్గించడం, ఇందిరా క్యాంటీన్లు ఎత్తేయడం వంటి చర్యలకు పూనుకున్న బీజేపీని మహిళలు నమ్మలేదు. ఇంట్లో వాళ్లు ఆకలితో ఉన్నా, ఇంట్లో లేమి కనపడినా వాటిని మరవకపోవడం, క్షమించకపోవడం మహిళల్లో సహజంగానే కనిపిస్తుంటుంది. ఇదే కర్ణాటక ఎన్నికల్లో ప్రతిబింబించింది.

ప్రతిపక్షం బలంగా లేకే

తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా సరైన ప్రతిపక్షం లేకపోవడంతో బీఆర్‌ఎస్‌కి కలిసొస్తోంది. ఫలితంగా ఈ సారి కూడా ప్రజలు కాంగ్రెస్‌, బీజేపీలను కాదని బీఆర్‌ఎస్‌ వైపే చూస్తున్నట్టు పీపుల్స్‌ పల్స్‌ క్షేత్రస్థాయిలో చేస్తున్న అధ్యయనాల్లో తెలుస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎంత బలంగా కనిపిస్తున్నా గ్యాస్‌ ధరల నుంచి బస్సు ఛార్జీలు, నిత్యావసరాల పెరుగుదలకు కారణమవుతున్న బీఆర్‌ఎస్‌, బీజేపీల పట్ల మహిళలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తి ప్రభావం రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపించి కర్ణాటక ఫలితమే రాష్ట్రంలో కూడా వస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

సంక్షేమ పథకాల కోణంలోంచి చూస్తే బీఆర్‌ఎస్‌ ట్రాక్‌ రికార్డు ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. వివిధ వర్గాలకు పింఛన్లు, కుటుంబానికి సరిపడా రేషన్‌ బియ్యం పంపిణీ, రైతుబంధు, దళితబంధు, కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్‌, గొర్రెల పంపకం, చేపల పంపిణీ వంటి సంక్షేమ పథకాలతో బీఆర్‌ఎస్‌ తన ఓటు బ్యాంకు జారిపోకుండా జాగ్రత్త పడుతోంది. ఈ పథకాలను జాగ్రత్తగా గమనిస్తే గర్భిణీలకు కేసీఆర్‌ కిట్‌ పథకం, ఓంటరి మహిళలకు నెలకు పెన్షన్‌ తప్ప మహిళల సాధికారత కోసం కేసీఆర్‌ ప్రత్యేకించి ఎలాంటి పథకాలు అమలు చేయడం లేదు. ఈ పథకాలలో కూడా పారదర్శకత కనిపించడం లేదు.

కల్యాణలక్ష్మీ, శాదీముబారక్‌ పథకాల్లో దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజులలో డబ్బులు అందించాల్సి ఉండగా ఏడాది దాటుతున్నా డబ్బులు అందడం లేదనే వార్తలున్నాయి. అంగన్‌వాడీలో కీలక పాత్ర పోషించే మహిళలపట్ల కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రాష్ట్రంలో గత 40 ఏండ్లుగా అంగన్వాడీలలో పనిచేస్తున్న 70 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే డిమాండ్‌ ఉన్నా తెలంగాణ పాలకులు పట్టించుకోవడం లేదు. పలు ఇతర రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.

‘ఇంట్లో మగవాడు మన పార్టీ వైపు ఉంటే చాలు, అతనే తన భార్యతో సహా ఇంట్లో వాళ్లందరి ఓట్లు మనకే వేయిస్తాడు’ అనే పాత నానుడిని బీఆర్‌ఎస్‌ ఇంకా నమ్ముతున్నట్టుంది! ఎన్నికల్లో మహిళల పాత్రపై కొన్ని సంస్థలు నిర్వహించిన పరిశోధనలలో ఉత్తర భారత దేశం కంటే దక్షిణాదిలో మహిళలు ఓటింగ్‌ అంశంలో చైతన్యవంతంగా ఉంటారు. ఉత్తరాది వలే ఇక్కడ తండ్రి, భర్త సూచనల మేరకు ఓటు వేయడానికి ఆసక్తి చూపరని ఆ అధ్యయనాల్లో తేలిందనే విషయం మహిళల పట్ల వివక్ష చూపే పార్టీలకు ప్రమాద ఘంటికలే.

మహిళలపై పెరుగుతున్న దాడులు

రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాన్ని పరిశీలిస్తే మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ఎన్‌సిఆర్‌బి లెక్కలు చెబుతున్నాయి. అత్యాచారాలు, కిడ్నాపులు, కట్నం, గృహహింస కేసులతో రాష్ట్రంలోని మహిళలు బెంబేలెత్తుతున్నారు. వీటికి సంబంధించి రాష్ట్రంలో 2020లో 17,791 కేసులు నమోదవ్వగా 2021లో 17% పెరిగి 20,865 కేసులు నమోదయ్యాయి. వీటికి ప్రధాన కారణం రాష్ట్రంలో పెరిగిన మద్యం విక్రయాలే. తాగిన మత్తులో మృగాలుగా మారుతున్న వారు ప్రవరిస్తున్న తీరును చూస్తుంటే ఆడవారు అర్థరాత్రి తిరగడం పక్కనపెట్టి పగలు తిరగడమే గగనమైపోతుంది. రాష్ట్ర ఖజానాకు మద్యం ఆదాయంపైనే ప్రధానంగా ఆధారపడ్డ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళా సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు కంటితుడుపు చర్యలు మాత్రమే అని పత్రికలలో రోజూ వస్తున్న వార్తలను చూస్తుంటే తెలుస్తోంది.

మహిళా సాధికారిత కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టిన పావా వడ్డీకే రుణాలు, రూపాయికే కిలో బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సంఘాలకు వడ్డిలేని రుణాలు మహిళలను కాంగ్రెస్‌ పార్టీకి దగ్గర చేశాయి. 2014 వరకు కొనసాగిన ఈ పథకాల గురించి ఇప్పటికీ గ్రామీణ మహిళలు అధిక సంఖ్యలో మాట్లాడుతుండటాన్ని పీపుల్స్‌ పల్స్‌ బృందం పరిశీలనలో గమనించాం.

కుటుంబ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఇల్లు (డబుల్‌ బెడ్రూం ఇండ్లు) కేటాయింపులో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకపోవడం, స్వతంత్రంగా తమ కాళ్లపై తాము నిలబడే అవకాశం ఇచ్చే ఆర్థిక చేయూత అందివ్వకపోవడం, మహిళా సంఘాల రుణాలకు ప్రాధాన్యత తగ్గించడంతో పాటు అనేక విషయాల్లో బీఆర్‌ఎస్‌ కూడా కర్ణాటకలో బీజేపీ చేసిన తప్పులనే చేస్తోంది. దీని పట్ల తెలంగాణ మహిళలు వ్యతిరేకతతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఉపయోగించిన వ్యూహం ఆధారంగా, మహిళలను కేంద్ర బిందువుగా చేసుకొని రూపొందించే సరికొత్త మెనిఫెస్టోనే వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. తెలంగాణలో బీజేపీ క్షేత్ర స్థాయిలో బలంగా లేనందున, కాంగ్రెస్‌ పార్టీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే, బీఆర్‌ఎస్‌ విజయం కోసం ఎదురీదాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు! కాబట్టి, వచ్చే ఎన్నికలను తేల్చేది తెలంగాణ మహిళే!!

-వి.సంధ్య,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ

(గమనిక: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవి లేదా వ్యక్తిగతమైనవి. హెచ్‌టీ తెలుగువి కావు.)

వి.సంధ్య, రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ
వి.సంధ్య, రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ
IPL_Entry_Point