Adilabad : పులి దాడిలో మహిళ మృతి.. బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలు
Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పులులు భయపెడుతున్నాయి. తాజాగా.. కాగజ్‌నగర్ మండలంలో మహిళపై పులి దాడి చేసింది. బోథ్ మండలం బాబెర తాండలో చిరుతపులి సంచారం హడలెత్తిస్తుంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పులుల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడిలో మహిళ మృతి చెందింది. కాగజ్‌నగర్ మండలం గన్నారం సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతురాలు మోర్లె లక్ష్మిగా గుర్తించారు. మృతురాలి బంధువులు, గ్రామస్తులు కాగజ్ నగర్ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇటీవల జిల్లాలోని జైనూర్, వాంకిడి మండలాల్లోనూ పులి పశువులపై దాడి చేసింది. ఈ సంఘటనను మర్చిపోకముందే శుక్రవారం కాగజ్ నగర్ మండలంలో పులి దాడిలో మహిళ మృతి చెందింది. దీంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పులుల దాడుల నుండి కాపాడాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.
అటు బోథ్ మండలం బాబెర తాండలో చిరుతపులి సంచారం హడలెత్తిస్తోంది. గ్రామంలో అర్ధరాత్రి మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో నాలుగు మేకల మృతి చెందాయి. మేకల అరుపులకు గ్రామస్థులు మేల్కొన్నారు. గ్రామస్తుల అలికిడితో చిరుతపులి పారిపోయింది. చిరుతపులి సంచారంతో గ్రామస్థులు భయభ్రంతులకు గురవుతున్నారు.
కుంటాల మండలంలోని సూర్యాపూర్, మెదన్పూర్, అంబుగామ అటవీ ప్రాంతాల్లోనూ పెద్దపులి అలజడి సృష్టిస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ నుంచి బొందిడి, కిన్వట్ అటవీ ప్రాంతాల మీదుగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని భీంపూర్, తాంసి, తలమడుగు మీదుగా బోథ్ మండలానికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
అక్కడి నుంచి నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం అడెల్లి తండా నుంచి మహారాష్ట్రలోని అప్పారావుపేట్ మీదుగా కుంటాల మండలంలోని సూర్యాపూర్, మెదన్పూర్ బుడుబుడు జలప్రాంతంలో సంచరిస్తుందని అధికారులు చెబుతున్నారు. పెద్దపులి సంచారం కొనసాగుతున్న నేపథ్యంలో పశువుల కాపారులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఉదయం 9 గంటల వెళ్లి 4 గంటల లోపు పనులు ముగించుకోవాలని అధికారులు సూచించారు.
కర్రకు గజ్జెలు కట్టి శబ్దం, అరుపులు చేస్తూ వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. అటవీ ప్రాంతానికి అర కిలోమీటరుకు మించి వెళ్లరాదని, పంటల రక్షణకు కంచెలు ఏర్పాటు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పులి సరిహద్దు దాటే వరకు పశువులను మేత కోసం అడవిలోకి తీసుకెళ్లద్దని సూచించారు.