Trap : వలపు వల వేసి నిలువు దోపిడి చేసి…
ఇంట్లో ఎవరు లేరు ఏకాంతంగా గడుపుదాం రమ్మని పిలవగానే సంబరపడి గంతులేసుకుంటూ వెళ్లిన యువకుడు చివరకు తన్నులు తిని ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. పథకం ప్రకారం కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసి నిలువుదోపిడికి పాల్పడిన సంగతి పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.
ఈజీ మనీకి అలవాటు పడిన ఓ జంట వలపు వల వేసి దోపిడీలకు ప్లాన్ చేసింది. వారి ట్రాప్ లో చిక్కుకున్న ఓ యువకుడు లక్షల రుపాయలు పోగొట్టుకుని పోలీసుల్ని ఆశ్రయించడంతో నిందితుల నిర్వాకం వెలుగు చూసింది. ఇంట్లో ఎవరు లేరు ఏకాంతంగా గడపడానికి రమ్మని పిలిచి ఆ తర్వాత పథకం ప్రకారం బంధువులతో దాడి చేయించిన వైనం ఘట్‌కేసర్‌లో వెలుగు చూసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పాల్వంచ మండలం హమాలీకాలనీకి చెందిన కందుల వంశీ, అతని భార్య రోజా, మరదలు దేవి ఘట్‌కేసర్ మండలం పోచరంలో ఉంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లెక్చరర్ వీధికి చెందిన సాగి వర్మ పరిచయమయ్యాడు. వీరంతా కలిసి ఎవరినైనా ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో మియాపూర్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగికి వలపన్నారు.
బాధితుడితో పరిచయం పెంచుకున్న తర్వాత గత నెల 27న ఇంట్లో ఎవరు లేరని, ఒంటరిగా ఉన్నానని, ఇంటికి వస్తే తనతో గడపొచ్చని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన యువకుడు పోచారంలోని ఆమె ఇంటికి వెళ్లాడు. అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన వంశీ, దేవి, వర్మలు యువకుడిని చితకబాది బెదిరించారు. తమ ఇంట్లోకి వచ్చినందుకు కేసు పెడతామని బెదిరించి ఏటిఎం కార్డుల నుంచి రూ.2.2లక్షల నగదు డ్రా చేసుకున్నారు.
బాధితుడి ఫోన్ లాక్కుని బెదిరించి పంపేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులంతా పథకం ప్రకారమే వలపన్నినట్టు గుర్తించారు. నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి రూ.1.6లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ముక్కు ముఖం తెలియని యువతులతో చాట్ చేసి చిక్కుల్లో పడొద్దని, ఎక్కడకు రమ్మంటే అక్కడకు వెళ్లిపోయి కష్టాలు కొని తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బాధితుడి నైజం వల్లే ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడని పోలీసులు చెబుతున్నారు
టాపిక్