Mahabubabad Crime : మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. మహిళను హత్యచేసి పాతిపెట్టి.. పక్కనే పొయ్యి పెట్టారు!
Mahabubabad Crime : మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను హత్య చేసి ఇంటిపక్కనే పాతిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా.. పేడతో అలికి పొయ్యి పెట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులకు విషయం తెలియడంతో.. నిందితులు పరారయ్యారు.
అనాథ శవం కనిపించినా.. అయ్యో పాపం అనే సమాజం మనది. కానీ.. మహబూబాబాద్ జిల్లాలో మాత్రం కొందరు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. వివాహితను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా.. పాతిపెట్టిన స్థలాన్ని పేడతో అలికారు. దాని పక్కనే పొయ్యి పెట్టి వంట చేసుకున్నారు.
చిన్నారులు చెప్పడంతో..
ఈ దారుణమైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్‌కాలనీలో జరిగింది. ఆ ఇంట్లోని చిన్నారులు స్థానికులకు చెప్పడంతో ఈ ఘోరం బయటి ప్రపంచానికి తెలిసింది. మహబూబాబాద్ టౌన్ సీఐ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పాటి రాములు, లక్ష్మి, వారి కుమారుడు గోపి, కుమార్తె దుర్గ, అల్లుడు మహేందర్ సిగ్నల్‌కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
పిల్లలను వదిలేసి..
మహబూబాబాద్ పట్టణంలో కాగితాలు ఏరుకుంటూ వీరు జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బయ్యారం మండల లక్ష్మీనర్సింహాపురం గ్రామానికి చెందిన నాగమణి(35)తో కొన్ని నెలల కిందట గోపీకి పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆమెకు పెళ్లి అయ్యింది. ఇద్దరు కుమారులున్నారు. అయినా నాగమణి వారిని వదిలి గోపీతో వచ్చేసింది. రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఉంటోంది.
పొయ్యిపెట్టి వంట..
కొన్నిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గోపి, లక్ష్మి, రాములు, దుర్గ పది రోజుల కిందట నాగమణిని హత్య చేశారు. అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలోనే పూడ్చేశారు. ఈ విషయం బయటకు తెలియకుండా.. పేడతో అలికి.. పూడ్చిపెట్టిన స్థలంలోనే పొయ్యిపెట్టి వంట చేసుకున్నారు. దుర్గ కుమార్తెల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.
పరారీలో నిందితులు..
స్థానికులు గత మంగళవారం పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ దేవేందర్ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇంటి ఆవరణను పరిశీలించారు. నాగమణిని చంపి ఇంటి ఆవరణలోనే పాతి పెట్టినట్టు గుర్తించి, అక్కడ తవ్వకాలు జరిపి డెడ్ బాడీని వెలికి తీశారు. సంఘటనా స్థలాన్ని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పరిశీలించారు. క్లూస్ టీమ్ ద్వారా వివరాలను సేకరించారు. నాగమణిని భర్త, అత్త మామలే హత్య చేసి ఉంటారని స్థానికులు, నాగమణి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, తొందర్లోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు వివరించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)