Investments in Telangana : తెలంగాణలో విప్రో విస్తరణ.. 5 వేల మందికి ఉద్యోగాలు.. ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు
Investments in Telangana : దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. గతేడాది పెట్టుబడులను రేవంత్ సర్కార్ అధిగమించింది. బుధవారం ఒక్క రోజే తెలంగాణకు రూ.56,300 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చాయి. తాజాగా విప్రో కంపెనీతో కీలక ఒప్పందాలు జరిగాయి.
తెలంగాణ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సును ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారు. దావోస్ పర్యటనకు వెళ్లిన రేవంత్ బృందం.. వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. కేవలం బుధవారం ఒక్కరోజే.. రూ.56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది.

కీలక ఒప్పందాలు..
రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సన్ పెట్రో కెమికల్స్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రూ.10 వేల కోట్లతో కంట్రోల్ ఎస్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ఒప్పందం చేసుకుంది. ఇటు మేఘా ఇంజినీరింగ్‌తోనూ ప్రభుత్వం మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇక రూ.500 కోట్లతో స్కై రూట్ కంపెనీతో ఒప్పందం జరిగింది. హెచ్‌సీఎల్, యూనీలివర్, విప్రో కంపెనీలతో విస్తరణకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి.
విప్రో విస్తరణ..
దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ప్రఖ్యాత విప్రో సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణలో పెట్టుబడుల విస్తరణకు విప్రో సంస్థ అంగీకారం తెలిపింది. విప్రో కంపెనీ హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
ఐటీ పెట్టుబడులకు గమ్యస్థానం..
హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధిలో విప్రో కీలక భాగస్వామిగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. విప్రో క్యాంపస్ విస్తరణతో రాష్ట్రంలో సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందనుందని అధికారులు చెబుతున్నారు. ఇటు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. కొత్త ఐటీ సెంటర్ రాబోయే రెండేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో.. ప్రపంచ ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ ఖ్యాతి మరింత బలోపేతమవుతుందని స్పష్టం చేస్తున్నారు.
స్వాగతించిన సీఎం..
విప్రో విస్తరణ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, అవకాశాలు సృష్టించడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తమకు ఉత్సాహంగా ఉందని.. విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ వ్యాఖ్యానించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలని.. మంత్రి శ్రీధర్ బాబు విప్రో కంపెనీని ఆహ్వానించారు.