TS Assembly Elections 2023 : 'కొత్త ఆప్షన్' అంటున్న కామ్రేడ్లు..! పొత్తుపై ఆలోచన మారిందా..?-will the thinking of communist parties change on alliance with brs party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Will The Thinking Of Communist Parties Change On Alliance With Brs Party

TS Assembly Elections 2023 : 'కొత్త ఆప్షన్' అంటున్న కామ్రేడ్లు..! పొత్తుపై ఆలోచన మారిందా..?

Mahendra Maheshwaram HT Telugu
May 17, 2023 08:34 AM IST

Telangana Assembly Elections - 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ప్రధాన పార్టీలన్నీ రేస్ గుర్రాలపై దృష్టి పెడుతుండగా… మరోవైపు పొత్తులపై కూడా కసరత్తు చేసే పనిలో పడ్డాయి. అయితే క్రామేడ్ల ఎటువైపు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పొత్తులపై కామ్రేడ్ల ఆలోచనేంటి...?
పొత్తులపై కామ్రేడ్ల ఆలోచనేంటి...?

BRS and CPI CPM Alliance in Telangana: ఎన్నికల ఏడాది కావటంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.ఎన్నికలను ఎదుర్కొవటం, వ్యూహ రచన విషయంలో ప్రధాన పార్టీలన్నీ బిజీ బిజీ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిన పార్టీలన్నీ రేసు గుర్రాలపై ఫోకస్ పెంచుతున్నాయి. ఇదే సమయంలో తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు రావటంతో ఇక్కడ కూడా లెక్కలు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ మారే వారు ఆలోచనలో పడిపోతున్నారు. ఇక పొత్తుల దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే విషయంలో కామ్రేడ్ల దారెటు..? అన్న చర్చ జోరందుకుంది.

ట్రెండింగ్ వార్తలు

గతేడాది మునుగోడులో జరిగిన ఉపఎన్నికలో అధికార బీఆర్ఎస్ తో కలిసి పని చేశాయి కమ్యూనిస్టు పార్టీలు. బీజేపీ వ్యతిరేకంగా తాము బీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నట్లు ప్రకటించటమే కాదు... ఆ ఎన్నికల్లో గట్టిగా పని చేశారు. బీఆర్ఎస్ విజయంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ ఫార్ములా కాస్తా వర్కౌట్ కావటంతో... వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తోనే కలిసి వెళ్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పలు స్థానాలపై కన్నేసిన కామ్రేడ్లు....పోటీ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న.... గులాబీ బాస్ నుంచి అనుకున్నంత స్థాయిలో స్పందన రాకపోవటం కామ్రేడ్లను కలవరపెడుతోంది. ఎన్నికల టైం దగ్గర పడుతున్నప్పటికీ పొత్తుపై క్లారిటీ ఇవ్వకపోటవం.. అసలు పొత్తు ఉంటుందా..? కలిసి పని చేసే ఆలోచన ఉందా..? లేదా..? అనే దానిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. సీన్ కట్ చేస్తే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సూపర్ విక్టరీ కొట్టిన నేపథ్యంలో.... కామ్రేడ్ల చూపు వారివైపు మళ్లిందా..? అన్న టాక్ కూడా వినిపిస్తోంది.

తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెక్యూలర్ పార్టీలకే మద్దతు ఇస్తామని చెప్పారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణ రాజకీయాలను మార్చేశాయన్నారు. ప్రధానంగా పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుందని.. ఈ రెండు పార్టీల్లో ఎవరితో చేతులు కలిపే విషయంపై త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కేసీఆర్ నుంచి సరైన స్పందన రావడం లేదని.. అలాగని తామేమీ సన్యాసం తీసుకోలేదని ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామంటున్నారు. ఈ నెలలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇదే అంశంపై లోతుగా చర్చిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఓ రకంగా తెలంగాణలో తమకు బీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్ ఆప్షన్ ఉందన్నట్లు పరోక్షంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

నిజానికి బీఆర్ఎస్ - కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న ఈ మధ్య పెద్దగా వినబడటం లేదు. పాలేరు, మిర్యాలగూడ, హుస్నాబాద్, బెల్లంపల్లి, దేవరకొండ, మునుగోడు, ఇబ్రహీంపట్నం వంటి స్థానాలపై నజర్ పెట్టిన కామ్రేడ్లు… పొత్తు కుదిరితే అడగాలని చూస్తున్నారు. అయితే కేసీఆర్ మౌనంగా ఉండటం, మరోవైపు ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ… కమ్యూనిస్టుల పంథా మారే అవకాశం కనిపిస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం