సుమారు రెండేళ్ల కింద జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఘన విజయం సాధించిన తర్వాత ‘మన దగ్గర మమతా బెనర్జీ లేదు అందుకే ఓడిపోయాం’ అని బీజేపీ జాతీయ నాయకత్వం లోలోపలే మథనపడడటమే కాకుండా మీడియా సమావేశాల్లో కూడా ఆ విషయాన్ని పరోక్షంగా అంగీకరించా. నిజమే, బెంగాల్‌లో వారి దగ్గర మమతా లేదు.. తెలంగాణలో వారికి కేసీఆర్‌కు సరితూగే నాయకుడు లేరు. బెంగాల్ ఫలితాల నుండి బీజేపీ జాతీయ నాయకత్వం గుణపాఠం నేర్చుకోలే. అచ్చంగా బెంగాల్ లో చేసిన తప్పులనే తెలంగాణలోనూ చేస్తూ తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తామని పగటి కలలు కంటోంది.,కేసీఆర్‌కి సరితూగే నాయకుడు తెలంగాణ బీజేపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. కేసీఆర్‌ని పక్కనపెడితే కనీసం కేసీఆర్ తనయుడు కేటీఆర్‌కి మ్యాచ్ అయ్యే పొలిటికల్ ఫిగర్ కూడా బీజేపీ సహా కాంగ్రెస్ పార్టీలోనూ కనపడటం లేదు. ఫలితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నట్లు సంకేతాలు కనపడుతున్నాయి.,పీపుల్స్ పల్స్ సంస్థ క్షేత్ర స్థాయిలో వివిధ అంశాలపై నిర్వహిస్తున్న వివిధ సర్వేల ప్రకారం... తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్ పార్టీకి 60 నుంచి 70 సీట్లు, బీజేపీకి 20 నుంచి 25, కాంగ్రెస్ కి 15 నుంచి 20 సీట్లు, ఎంఐఎం కి 7 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనబడుతోంది. వివిధ పార్టీల మధ్య ఓట్ల చీలిక, కమ్యూనిస్టులతో జట్టు కట్టడం వంటి అంశాలు కలగలిసి బీఆర్‌ఎస్ సీట్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.,వైఎస్సార్ టీపీ, టీడీపీ, బీఎస్పీ, టీజేఎస్ పార్టీలు కలిసి మొత్తం ఓట్లలో 5 శాతం ఓట్లని తమ ఖాతాలో వేసుకుంటాయి. ఎం.ఐ.ఎం., కమ్యూనిస్టు పార్టీలు కలిసి 10 శాతం ఓటు బ్యాంకును కొల్లగొడతాయి. బీజేపీ, కాంగ్రెస్ 35 నుంచి 40 శాతం ఓట్లు పంచుకుంటాయి. ఈ చీలిక వల్ల బీఆర్‌ఎస్ లాభపడుతుంది. కారణం ఆ పార్టీకి పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ నిర్వహిస్తున్న వివిధ సర్వేల ప్రకారం 35-40 శాతం ఉన్న ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. కేవలం ప్రతిపక్షాల ఓట్లనే కాంగ్రెస్, బీజేపీలు పంచుకుంటాయి కాబట్టి, బీఆర్‌ఎస్ విజయం నల్లేరు మీద నడకే అవుతుంది.,2014 లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ 34.3 శాతం ఓట్లు సాధించి 63 సీట్లు గెలుపొందింది, 2018 లో 46.9 శాతం ఓట్లు సాధించి 88 సీట్లు గెలుపొందింది. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 25 నుండి 29 శాతం ఓట్లు మాత్రమే పొందింది. తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ 7 శాతం ఓట్లు మాత్రమే 2014, 2018 లో సాధించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ దాదాపు 20 శాతం ఓట్లు సాధించి 4 పార్లమెంటు సీట్లు గెలుపొందింది. పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న వివిధ సర్వేల ప్రకారం అధికార బీఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణలో 40 శాతం ఓట్లకు తగ్గకుండా వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనబడుతోంది. వివిధ పార్టీలకు వచ్చే ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ అన్నీ పార్టీలకన్నా ముందంజలో ఉంది. రెండవ స్థానంలో బీజేపీ, మూడవ స్థానంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. మొదటి స్థానానికి, రెండవ స్థానానికి కూడా దాదాపు 30-35 సీట్లు వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టమౌతోంది.,బెంగాల్, తెలంగాణలకు పోలికపశ్చిమబెంగాల్, తెలంగాణలకు సాంస్కృతికంగా, చారిత్రకంగా కొన్ని ప్రత్యేకమైన పోలికలు ఉన్నాయి. బెంగాల్‌లో కమ్యూనిస్టులు, నక్సలైట్ల ప్రభావం ఉన్నట్టే తెలంగాణలోనూ ఉంది. బెంగాల్‌కు ప్రత్యేకమైన వేష భాషలు ఉన్నట్లుగానే తెలంగాణకూ ఉన్నాయి. బెంగాల్‌లాగే తెలంగాణలోనూ మతానికి హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వరు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్న తెలంగాణలో బీజేపీ మతం ఆధారంగా తమ సంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తూ పార్టీని నడపాలని చూస్తే వారికి రానున్న ఎన్నికల్లో భంగపాటు తప్పదు.,2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బెంగాల్ లో బీజేపీ 19 సీట్లు గెలిచింది. ఆ విజయం రుచి తెలుసుకున్న బీజేపీ 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సొంతం చేసుకోవడం చాలా సులభమని భావించి, భంగపడిరది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలవడంతో తెలంగాణలోనూ తమకు అవకాశం ఉందని బీజేపీ జాతీయ నాయకత్వం కలలు కంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆలోచనా తీరు వేరేలా ఉంటుంది. దానికి ఉదాహరణ బెంగాల్ ఎన్నికలే! అయినా, అవే విఫల ప్రయోగాలను తెలంగాణలోనూ బీజేపీ జాతీయ నాయకత్వం ప్రయోగిస్తున్నది.,ఉప్పు ఎక్కువైతే అది కూరంతా పాడు చేస్తుందన్నట్టు... ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, ఇతర బీజేపీ అగ్ర నాయకులు పదుల సార్లు బెంగాల్ లో ర్యాలీలకు రావడం అక్కడి ప్రజలకు నచ్చలేదు. బెంగాల్ ప్రజలకు వారంతా అవుట్ సైడర్స్ అని, నాన్ బెంగాలీస్ వచ్చి బెంగాల్ సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారనే భావన కలిగింది. మరోవైపు వారిని పదే పదే ‘అవుట్ సైడర్స్’ అని పిలుస్తూ ప్రజల్లో ఉన్న ఆ వ్యతిరేకతను తీవ్ర స్థాయికి తీసుకెళ్లడంలో మమతా విజయం సాధించారు. కేంద్రహోం మంత్రి అమిత్ షా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత పూర్తి సమయాన్ని తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర నాయకులు ఊదరగొడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మీడియాలో కూడా ఆ వార్తలు తాటికాయంత అక్షరాలతో వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా ఫేస్ ఆఫ్ ది పార్టీ అనేలా బలమైన నాయకుడు లేనప్పుడు ఢిల్లీ నుంచి పెద్ద నాయకులు ఎవరు వచ్చినా తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవడం కుదరని పని... ఈ విషయం బెంగాల్‌లో రుజువైంది. రేపు తెలంగాణలో కూడా అదే కాబోతోంది.,అస్సాంలోలాగే ముస్లిం ఓట్లను చీలిస్తే గంపగుత్తగా హిందూ ఓట్ల ద్వారా బెంగాల్ లో విజయం దక్కించుకోవచ్చని బీజేపీ భావించింది. కానీ, బెంగాల్‌కి అస్సాంకి ఉన్న తేడాను అర్థం చేసుకోలేకపోయింది. అలాంటి పద్ధతులు బీహార్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పని చేస్తాయి కానీ, బెంగాల్ ప్రజలు నాన్ రిలీజియస్‌గా ఉంటారు. అలాగే, ‘జై శ్రీరామ్’ నినాదం బెంగాల్ లో పని చేయలేదు. పైగా బెంగాల్ లో వాళ్లు ‘జై సియా రామ్’ అంటారు. కానీ, బీజేపీ వాడిన జై శ్రీరామ్ నినాదం తమది కాదని బెంగాల్ ప్రజలు మనసుల్లో నాటుకుపోయింది. బెంగాల్ ప్రజలు రాముడిని గౌరవిస్తారు. కానీ, అక్కడ తరతరాలుగా కాళీ మాతను పూజించే సంప్రదాయం ఉంది. మమత ఏటా జరిపించే కాళీ పూజల వల్ల మమతను అక్కడి ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఫలితంగా అక్కడ బీజేపీ హిందుత్వ పాచిక పారలేదు. ఇలాంటి ప్రత్యేకతే తెలంగాణలోనూ ఉంది. మతం పేరిట తెలంగాణ ప్రజల మనసు గెలవడం కష్టం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో హిందూ`ముస్లింలు కలిసి పీర్ల పండగ జరుపుకుంటారు. ఇక్కడ రామనవమి కంటే బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు. బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి, మతం పేరుతో ఇక్కడి వాళ్లను రెచ్చగొట్టడం సాధ్యం కాదు. అందుకే, గుమ్మటాలు కూలుస్తామని, మసీదులు కూలుస్తామని బీజేపీ తెలంగాణ నేతలు చేసిన ప్రకటనలను తెలంగాణ ప్రజలు ప్రతికూలంగానే చూశారు తప్పా, పాజిటివ్‌గా తీసుకోలేదు.,వివాదాస్పద వ్యాఖ్యల్లో సారూప్యతవివాదాస్పద హిందుత్వ కామెంట్స్ చేయడంలో 2021లో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న దిలీప్ ఘోష్‌కి, ఇక్కడ బీజేపీ అగ్రనాయకులకు కొంతవరకు సారూప్యత కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్, నాటి పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పని చేశారు. ఆయన రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, మమతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం ట్వీట్లూ చేస్తుండేవారు. యూనివర్సిటీల్లో, మీడియాలో మమతను ఇరకాటంలో పెట్టేవిధంగా మాట్లాడేవారు. కానీ, అనుకున్నది ఒక్కటి, అయినదొక్కటి అన్నట్టు... కేంద్రం డైరెక్షన్ లో గవర్నర్ మమతను ఇబ్బంది పెడుతున్నారాని, ఆమె పట్ల ప్రజల్లో సానుభూతి మరింత పెరిగింది. ఇక్కడ కూడా గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలపై విమర్శలకు పోవడం ఇటీవల కాలంలో పెరిగింది. ఎన్నికలు సమీపించే కొద్ది ఈ జోక్యం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు! ఎన్నికల ముందు మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మీద సీబీఐ రైడ్స్ చేయడం వల్ల మమత బీజేపీ బాధితురాలిగా ప్రొజెక్ట్ అయ్యారు. మమతను ఎంతగా విమర్శిస్తే, ఆమె అంత పెద్ద బాధితురాలిగా కనపడింది. ప్రజలెప్పుడూ బాధితుల వైపే నిలబడతారని గుర్తించాలి. ఒకవేళ ఇక్కడ కూడా కవితను సీబీఐ అరెస్టు చేస్తే, భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌కి కూడా ఇలాంటి సానుభూతే లభించి, కీడు కంటే మేలే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అభిషేక్ బెనర్జీ విషయంలో జరిగినట్టుగానే, కవిత చేసిన తప్పు ఎన్నికల ముందే ఎందుకు గుర్తొచ్చింది? సీబీఐ ఎన్నికల ముందే ఎందుకు రావాల్సి వచ్చింది? అనే ప్రశ్నలు బీజేపీకి ప్రతికూలంగా మారుతాయి.,అభ్యర్థుల కరువులోక్సభ ఎన్నికల ప్యాటర్నే అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని బీజేపీ జాతీయ నాయకత్వం భ్రమ పడుతున్నది. అందుకే, వాళ్లు చేస్తున్న రాజకీయ ప్రయోగాలు విఫలమవుతున్నాయి. తెలంగాణలోని క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయడంలో బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తిగా విఫలమయినట్టే కనబడుతోంది. పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ తెలంగాణలో వివిధ జిల్లాల్లో పర్యటించినప్పుడు దాదాపు 70 నియోజకవర్గాల్లో బీజేపీకి సరైన అభ్యర్థులు లేనట్లు స్పష్టంగా వెల్లడైంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న నలుగురు పార్లమెంట్ సభ్యుల పరిధిలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ నియోజకవర్గాల్లోనే 10 కి మించి గట్టి అభ్యర్థులు బీజేపీకి లేరు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలకు సరైన అభ్యర్థుల కొరత ఉంది.,బెంగాల్‌లో మమతా బెనర్జీ గెలవడానికి మరో కారణం ప్రతి కులానికి, ప్రతి వర్గానికి ఆమె అందిస్తున్న సంక్షేమ పథకాలు! తెలంగాణలో కూడా తన ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండేందుకు కేసీఆర్ కులాల ప్రాతిపాదికన అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతుబంధు, దళితబంధు, కళ్యాణ లక్ష్మీ, ఆసరా పించన్లు వంటి పథకాలు ప్రజల మనసు గెలుచుకున్నాయనడంలో సందేహం లేదు. ఈ పథకాలకు ప్రత్యామ్నాయంగా తాము ఏమివ్వగలరో బీజేపీ నాయకులు ఇప్పటివరకూ చెప్పలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సహా, వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన బండిసంజయ్ కూడా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? ఏం మారుస్తాం? అనే విషయాలపై స్పష్టత ఇవ్వలేకపోయారు. ఎంతసేపూ కుటుంబ పాలన అంటూ కేసీఆర్ పై తిట్ల పురాణం ఎత్తుకుంటూ కాలం కరగదీస్తున్న బీజేపీ దగ్గర బీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టేలా ఒక్క హామీ కూడా లేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నిర్వహించిన 5 విడతల ప్రజాసంగ్రామ యాత్రలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని చెప్పినా.. ఆయన వాటిని ఎలా అమలు చేస్తారో విడమరిచి ఇప్పటి వరకు చెప్పలేదు. ఆ హామీలు అమలు చేయడానికి ప్రణాళిక ఏంటో కూడా ప్రజలకు వివరించడంలో తెలంగాణ రాష్ట్ర శాఖ పూర్తిగా విఫలమయ్యింది. ఇప్పుడయితే ఈ నినాదాన్నే పక్కనపడేశారు.,బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్ అమలు చేయలేకపోయిన రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇండ్లు, బీసీ లోన్లు వంటి పలు హామీలను ఎలా అమలు చేస్తారో కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. బీఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని గానీ, వాటికి ప్రత్యామ్నాయంగా తాము ఇతర పథకాలు అమలు చేస్తామని కూడా చెప్పలేకపోతున్నారు. కనీస ప్రణాళికలు లేవుగానీ, రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ జాతీయ నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర శాఖ ధీమాతో ఉంది.,బెంగాల్‌లో కూడా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రొజెక్ట్ చేయడానికి బీజేపీ జాతీయ నాయకత్వం నిరాకరించి, దానికి తగిన మూల్యం చెల్లించుకుంది. తెలంగాణలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రొజెక్ట్ చేయకుండా నాన్చడం వల్ల ఆ పార్టీకి నష్టమే జరుగుతున్నది. 2004 లో చంద్రబాబు కాకుంటే ఎవరు? అని ప్రజలు ప్రశ్నించుకున్నప్పుడు వారికి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రత్యామ్నాయంగా కనపడ్డారు. 2019లో ఏపీలో చంద్రబాబు కాకుంటే ఎవరు అనుకున్నప్పుడు జగన్ కనపడ్డారు. ఇప్పుడు జగన్ కాకుంటే ఎవరు అనుకుంటే, మళ్లీ చంద్రబాబు కనపడతున్నారు. కానీ, తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. కాబట్టి, కేసీఆర్‌ని ఎదుర్కోవడానికి బీజేపీలో కేసీఆర్‌కి సరితూగే బలమైన నేత కావాలి గానీ, జాతీయ నాయకులు ర్యాలీలూ, మీటింగ్‌లూ, సునీల్ భన్సాల్ వ్యూహాలూ సరిపోవని గుర్తించిన రోజే తెలంగాణలో బీజేపీ దశా, దిశా మారుతుంది!,- ఎ. నాగరాజు,,అనలిస్ట్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ,,(గమనిక: ఇక్కడ తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త, సంస్థ వ్యక్తిగతం. వాటికి హెచ్‌టీ తెలుగుతో సంబంధం లేదు..)