Political Analysis: చిగురిస్తున్న ఆశలు.. మరి 'హస్త'గతం అవుతుందా..?-will telangana congress wins in upcomming assembly elections 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Will Telangana Congress Wins In Upcomming Assembly Elections 2023

Political Analysis: చిగురిస్తున్న ఆశలు.. మరి 'హస్త'గతం అవుతుందా..?

HT Telugu Desk HT Telugu
May 24, 2023 06:05 AM IST

Telangana Assembly Elections 2023: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. లెక్కలు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ దూకుడుకు బ్రేక్ లు పడగా... కాంగ్రెస్ టాప్ గేర్ వేసేసింది. ఇక తెలంగాణలోనూ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023

Telangana Assembly Elections 2023: ఎన్నికల ఏడాది కావటంతో తెలంగాణ రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి. ఓవైపు నుంచి కామెంట్స్ రాగానే మరోవైపు నుంచి రియాక్షన్లు వచ్చేస్తున్నాయి. అటు నుంచి వ్యూహం రెడీ అవుతుండగానే...ఇటు నుంచి ప్రతివ్యూహం సంధించే ప్రయత్నాలు ముమ్మరం చేసేస్తున్నాయి. ఇక పార్టీలు మారే నేతలు కూడా ఓ అంచనాకు వచ్చే పనిలో పడ్డారు. ఇంతలోనే కర్ణాటక ఫలితాలు రావటం.. అందులో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయటం పరిణామాలు తెలంగాణలోనూ ఆసక్తికరంగా మారాయి. ఫలితంగా ఇక్కడ కాంగ్రెస్ గెలుపుపై ఆశలు చిగురుస్తున్నాయన్న చర్చ జోరందుకుంది.

ట్రెండింగ్ వార్తలు

ఎన్నికల్లో ప్రత్యర్థిని ఎలా ఓడించాలో కాదు... ఎలా గెలవాలి అనే దానిపై ఆలోచించాలి. ప్రస్తుత సమీకరణాలు చూస్తే.... కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ ను ఢీకొట్టడంతో పాటు... దక్షిణాదిలో విస్తరించాలని కలలు కంటున్న బీజేపీకి కూడా గట్టి షాక్ ఇచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది సాధ్యమయ్యే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు అధికార బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ.. 'కుటుంబ, అవినీతి పాలన' అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది బీజేపీ. ఈ విషయాన్ని ప్రచారం చేయటంలో ఎంతో కొంత సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. కానీ కేసీఆర్ ను ఢీకొట్టే నాయకుడు ఆ పార్టీలో లేకపోవటం, ప్రజల్లో విశ్వసనీయత ఉన్న నేతల లోటు, పూర్తిగా హిందుత్వవాద ప్రచారంపై ఆధారపడటం వంటి కారణాలతో... తెరపైకి తీసుకొచ్చిన అవినీతి, కుటుంబ పాలన అంశాలను సరిగా ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీలోని ప్రస్తుత పరిణామాలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అయితే ఈ పరిణామం...కాంగ్రెస్ కు కలిసివస్తుందనే చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో వ్యూహలు రచించేందుకు ఇది కాస్త పునాదిగా కూడా మారొచ్చు. జాతీయ స్థాయిలో చూస్తే... 2014 నుంచి కూడా బీజేపీ ఓ అజెండాను తెరపైకి తీసుకురావటం... దానిపై కాంగ్రెస్ ప్రతిస్పందించేలా చేయటం వంటి స్ట్రాటజీతో ముందుకొచ్చింది. ఫలితంగా ఏదో ఒకలా కాంగ్రెస్ ను ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేస్తూ రాజకీయంగా దెబ్బకొడుతూ వచ్చింది. సీన్ కట్ చేస్తే... ఇటీవల ముగిసిన కర్ణాటక ఫలితాల్లో సీన్ రివర్స్ అయింది. ఈసారి కాంగ్రెస్సే...ఓ అజెండా సెట్ చేసి బీజేపీని ట్రాప్ లో పడేసింది. విద్వేషాలు రెచ్చగొడుతున్న బజ్ రంగ్ దళ్ పై చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో ప్రకటించింది. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ఏకంగా నరేంద్రమోదీ కూడా రంగంలోకి దిగారు. కానీ అంచనాలు పూర్తిగా తప్పిపోయాయి. కన్నడిగుల తీర్పుతో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్లు అయింది. కాంగ్రెస్ సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది.

ఇక తెలంగాణలోనూ మతం ఆధారంగా బలం చేకూర్చుకోవాలని చూస్తోంది బీజేపీ. ఎప్పుడు ఎన్నికల వచ్చినా... ఆ దిశగానే పావులు కదుపుతోంది. ప్రజా సమస్యలపై పోరాడితేనే ఫలితం ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నట్లే కనిపిస్తోంది. తెలంగాణ వంటి రాష్ట్రంలో తమ పోలరైజేషన్ వ్యూహాలు గిట్టుబాటు కావనే విషయాన్ని గుర్తించటంలో కూడా బీజేపీ నాయకత్వం విఫలమైనట్లు అనిపిస్తోంది. మోదీ ఇమేజ్ పైనే పూర్తిగా ఆధారపడి ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. ఈ తరహా విధానాలతో క్షేత్రస్థాయిలోని ప్రజలతో మమేకం కావటం, కేసీఆర్ వంటి బలమైన నేతను ఢీకొట్టడం కష్టమైనన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదే అతిపెద్ద ప్రశ్న...?

తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే... మరీ కాంగ్రెస్ పుంజుకున్నట్లేనా..? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందా..? అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. అయితే ఈ విషయంలో ఇప్పుడే ఓ అంచనాకు రాలేం అని చెప్పొచ్చు. తెలంగాణ నాయకత్వం కానీ... ఢిల్లీ నాయకత్వం(ఏఐసీసీ) కానీ... కర్ణాటక ఫలితాలను చూసి నేర్చుకునే విషయాలు చాలానే ఉన్నాయి. అక్కడి ఎన్నికలను సూచనాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బలమైన స్థానిక నాయకత్వంతో పాటు... ప్రజాదారణ ఉన్న నేతలను రంగంలోకి దింపాలి. అలాంటప్పుడే నాయకత్వ సమస్యతో ఇబ్బందిపడుతున్న బీజేపీని కానీ....సెంటిమెంట్ పునాదులపై నిర్మితమైన బీఆర్ఎస్ ను కానీ ఢీకొట్టే అవకాశం దొరుకుతుంది. ఇక కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా... పలు అంశాలపై ఫోకస్ చేయాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రచారానికి జాతీయ నేతలను తీసుకువచ్చే బీజేపీ మాదిరిగా కాకుండా... స్థానిక నాయకత్వం నేతృతంలోనే పనులన్నీ చక్కబెట్టే వ్యవస్థను తీసుకురావాలి. స్థానికంగా ఆమోదించబడిన నాయకత్వంతోనే రాజకీయ ప్రణాళికా విధానం ఉండాలి. దీని చుట్టే ఎన్నికల ప్రచారం, వ్యూహరచన చేయడం వంటివి ఉండేలా కార్యాచరణ సిద్ధం చేయాలి. ఇక అన్నింటి కంటే ముఖ్యం... పార్టీలోని నేతలంగా ఏకతాటిపై నడవటం. టీపీసీసీ అనేది ఐక్యంగా ఉంటే... బీజేపీ, బీఆర్ఎస్ కంటే బలమైన శక్తిగా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహాం ఉండదు.

బీఆర్ఎస్ పార్టీనే కాకుండా... బీజేపీని కూడా ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ కు బలమైన వ్యహం ఉండాల్సిన అవసరం ఉంటుంది. 2018 ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో కోల్పోయిన సీట్లపై కూడా ప్రధానంగా ఫోకస్ చేయాలి. అక్కడ లోటుపాట్లను సవరించుకోవాలి. లేకపోతే 2019 పార్లమెంట్ ఎన్నికల మాదిరి పరిణామాలకు కూడా స్కోప్ ఉంటుంది. 2018 ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేని బీజేపీ... 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కీలకమైన పార్లమెంట్ స్థానాలను గెలిచుకుంది. అయితే అధికార పార్టీపై ఉండే వ్యతిరేకతను క్యాష్ చేసుకునే విషయంలో బీజేపీ కంటే... కాంగ్రెస్ చాలా అప్రమత్తంగా ఉంటేనే అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది.

ఇక 2018 ఎన్నికల్లో చూస్తే... విపక్షాల ఓట్ల చీలిక కూడా బీఆర్ఎస్ కు భారీగా కలిసి వచ్చింది. టీడీపీ - కాంగ్రెస్ కూటమి, బహుజన లెఫ్ట్ ఫ్రంట్,ఎంఐఎం, బీజేపీ వంటి పార్టీలు బరిలో ఉండటంతో చాలా నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది. దాదాపు 40 కి పైగా అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ కు ఇది అడ్వెంటేజ్ గా మారిందన్న అంచనాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ అధిగమించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక చీలితే... అది బీజేపీకి కూడా కలిసివచ్చే అంశమనే చెప్పొచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీపై కాంగ్రెస్ గట్టిగానే ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించాలని భావిస్తున్న బీజేపీ తన టార్గెట్ ను చేరుకోవాలంటే ముఖ్యంగా రెండు పరిణామాలు జరగాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మారటం లేదా... 4 నుంచి 5 వరకు బీఆర్ఎస్ ఓట్ల శాతం మారాల్సి ఉంటుంది. ప్రజలు కూడా బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం రావాల్సిందే అని బలంగా కోరుకోవటం కూడా పై అంశాల కంటే అతిప్రధానమని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో టీపీపీసీ నాయకత్వం... ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ వైపు మళ్లకుండా పకడ్బందీ వ్యూహలు రచించాల్సిన అవసరం ఉంటుంది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని ఓటర్లు మార్పు కోరుకుంటే... రెండు జాతీయ పార్టీల్లో ఏదో ఒకవైపు ఆలోచిస్తారు. ఈవిషయానికొస్తే బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా కాంగ్రెస్ నాయకత్వం పరిగణలోకి తీసుకోని... అడుగులు ముందుకువేయాల్సిన అవసరం ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏ చిన్న అవకాశాన్ని కూడా చేజార్చుకోకుండా పని చేస్తే… తెలంగాణను కూడా హస్తగతం చేసుకునే ఛాన్స్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందనే చెప్పొచ్చు….!

WhatsApp channel

సంబంధిత కథనం