షర్మిల బాణంగానే ఉంటుందా? ధనుస్సుగా మారుతుందా?
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ‘‘బాణం’’గా ముద్ర వేసుకున్న షర్మిల... ఎప్పటికీ బాణంగానే మిగిలిపోతారా? లేక ఇకనైనా షర్మిల ‘ధనుస్సుగా మారుతారా?’ అనేది ఇప్పుడు ఆమె వేయబోయే అడుగులే నిర్ణయిస్తాయి.
తనకు తాను ‘జగనన్న వదిలిన బాణం’ అని ప్రకటించుకున్న వైఎస్.షర్మిల... పాదయాత్ర చేసి కష్టకాలంలో వైఎస్సార్సీపీని ఒడ్డున పడేశారు. ఆ తర్వాత జగనన్నతో విడిపోయినప్పుడు కొంతమంది ఆమెను వదిలేసిన బాణమని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోడలినని చెప్పుకుంటూ తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పెట్టినప్పుడు కేసీఆర్ బాణమని ప్రచారం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ బీఆర్‌ఎస్‌ని విమర్శించినప్పుడు... బీజేపీ వదిలిన బాణమన్నారు. ఇప్పుడు ఆ బాణం కాంగ్రెస్ అమ్ములపొదిలో చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ‘‘బాణం’’గా ముద్ర వేసుకున్న షర్మిల... ఎప్పటికీ బాణంగానే మిగిలిపోతారా? లేక ఇకనైనా షర్మిల ‘ధనుస్సుగా మారుతారా?’ అనేది ఇప్పుడు ఆమె వేయబోయే అడుగులే నిర్ణయిస్తాయి.
ట్రెండింగ్ వార్తలు
తెలుగు ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి బతికున్నంతకాలం షర్మిల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్‌ని వీడిన తన సోదరుడు వై.ఎస్.జగన్ రాజకీయ ఎదుగుదలకు అండగా నిలిచారు. ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీ నిర్మాణంలో తోడ్పడ్డారు. అయితే, 2019లో జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతో షర్మిలకు విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఆమె ఒంటరిగా రాజకీయాల్లో ఎదగాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఏపీలో జగన్‌కి వ్యతిరేకంగా కాకుండా మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణను ఎంచుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఇమేజ్ తెలంగాణలోనూ సాయపడుతుందని భావించి, 2021లో వైఎస్సార్ జయంతి రోజునే కొత్తపార్టీ స్థాపించారు.
త్యాగాలకు అడ్వాన్స్ గ్యారెంటీలు ఉండవంటారు. ఈ రెండేళ్ల కాలంలో తెలంగాణలో ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీల కంటే కూడా కేసీఆర్ ని షర్మిలే ఎక్కువ టార్గెట్ చేశారు. ఎండనకా, వాననకా వేలకిలోమీటర్లు పాదయాత్రలు చేశారు. తెలంగాణలో ఉన్న ప్రతి సమస్య గురించి మాట్లాడారు. పదేపదే తాను తెలంగాణ కోడలినని చెప్పుకున్నారు. అయినా, ఆమెను తెలంగాణ ప్రజలు ఎన్నడూ తమ మనిషిగా స్వీకరించలేదు. ఈ పరిణామాలను లోతుగా పరిశీలిస్తే... తమకు మొదటి నుండి పట్టున్న ఏపీని కాదని తెలంగాణను ఎంచుకోవడమే షర్మిల చేసిన వ్యూహాత్మక తప్పిదమని తెలుస్తుంది. తన రాజకీయ గమ్యం దారి తప్పిందని ఆలస్యంగానైనా గుర్తించిన షర్మిల తమ కుటుంబానికి మొదటి నుండి బాసటగా నిలిచిన కాంగ్రెస్ గూటికి చేరాలనుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే జరిగితే అది ఒక తెలివైన ఎత్తుగడే అవుతుంది.
‘‘అనువుగాని చోట అధికులమనరాదు’’ అన్నట్టుగా షర్మిల కాంగ్రెస్ లో చేరడం తెలివైన ఎత్తుగడే అయినా... తెలంగాణలో పనిచేయడానికి కాంగ్రెస్‌లో చేరితే మాత్రం మరోసారి ‘బాణం’ గురి తప్పుతుంది. తెలంగాణలో క్షేత్రస్థాయి పరిస్థితులను, ప్రజల మూడ్, పలు సర్వేల నివేదికలను బట్టి చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి, ఈ సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే ఆమె పరిస్థితి గుంపులో గోవిందలాగే తయారవుతుంది తప్ప, ‘‘ధనస్సు’’ గా మారే అవకాశాలే లేవు. పైగా, 2018లో చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవడంతో ఓటమిపాలైన కాంగ్రెస్‌కి, షర్మిల చేరిక నుంచి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యే ప్రమాదం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘జై సమైక్యాంధ్ర’ అన్న షర్మిల, ఇప్పుడు ‘జై తెలంగాణ‘ అంటే ప్రజలు స్వీకరిస్తారనుకుంటే, పప్పులో కాలేసినట్లే!
2009 ఎన్నికల్లో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డిని రాయలసీమలోని పులివెందుల నియోజకవర్గానితో పాటు ఆంధ్రాలో, తెలంగాణలో పోటీ చేయమని కొంతమంది సహచరులు ఆయనకు సూచించారు. కానీ, వైఎస్సార్ ఆసక్తి చూపలేదు. పైగా వైఎస్సార్ తన ఇంటికి ‘శ్రీబాగ్’ పేరు పెట్టుకున్నారంటానే ఆయనలో ప్రాంతీయ అభిమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తెలుగునాట గట్టిపట్టున్న మహానాయకుడే సొంతూరిని వదిలిపెట్టలేదు. ఆయనకు భిన్నంగా సొంత రాష్ట్రం వదిలిపెట్టి, తన రాజకీయాలకు తెలంగాణను వేదికగా ఎంచుకోవడం ఒక సాహసోపేత నిర్ణయం! జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయనను ‘రాయలసీమ ముద్దుబిడ్డ’ అంటూ పొగిడిన షర్మిల, ఇప్పుడు తాను తెలంగాణ కోడలినని ఎంత చెప్పినా... ప్రజలు పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తాను హైదరాబాద్‌లోనే పెరిగాను, చదివానని ఎంత చెప్పుకున్నా తెలంగాణ ప్రజలు ఆయన్ను దూరమే పెట్టారని గుర్తించాలి.
చరిత్ర చెప్పిన సత్యం ఇదే
రాజకీయాల్లో బలాలు, బలహీనతలపై ఎవరికైనా ఒక అంచనా ఉండాలి. గతనుభవాలను పరిగణలోకి తీసుకుని ఎత్తుగడలు రూపొందించాలి. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ రెండు రాష్ట్రాలలో ఆధిపత్యం చెలాయించిన దాఖలాలు లేవు. యూపీ నుండి విడిపోయిన ఉత్తరాఖండ్‌లో ఎస్పీ, బీఎస్పీ బీహార్ నుండి విడిపోయిన జార్ఖండ్‌లో ఆర్జేడీ, జేడీ (యూ), మహారాష్ట్ర నుండి విడిపోయిన గుజరాత్‌లో శివసేన, ఎన్సీపీ, పంజాబ్ నుండి విడిపోయిన హర్యానాలో అకాలీదళ్ వంటి పార్టీలు నామమాత్రంగానే మిగిలాయని చరిత్ర చెప్తున్నది.
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను పరిశీలిస్తే తెలంగాణ సరిహద్దులో ఉన్న ఏపీలోని జగ్గయపేట, నందిగామ, కర్నూలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేసి గెలవగలదా..? ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ పార్టీలకు ఉనికే లేదు. ఇలాంటి విషయాలు లోతుగా అధ్యయనం చేయకుండానే షర్మిలా తెలంగాణలో పార్టీ పెట్టారు. సంవత్సరం తిరగ్గానే రాజశేఖరరెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మ, తన కూతురు షర్మిలకు తోడుగా ఉండడానికి కుమారుడు జగన్ నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
కుటుంబంలో అభిప్రాయభేదాలు రావడం, కూతురు రాజకీయ మనుగడ కోసం ఆమె అనేక ఒత్తిళ్ల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని తెలంగాణలో షర్మిలకు తోడుగా ఉండడమే తన ముందున్న లక్ష్యమని ఆమె చెప్పినా ప్రజలకు నమ్మకం కలగలేదు. అన్నమీద కోపంతో తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారని, ఆమె చెబుతున్నట్లు ‘రాజన్న రాజ్యం’ స్థాపన అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఉందనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ధృడంగా ఉంది.
ఆ భావన వల్లే వైఫల్యం
నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర, నిరసనలు, నిరాహార దీక్షలు, ధర్నాలు ఇలా అనేక కార్యక్రమాలతో ప్రజలకు కొంత చేరువైనా, బీఆర్‌ఎస్ నాయకులతో ఘర్షణ, వ్యక్తిగత దూషణలు వంటివి ఆమెకు మైనస్‌గా మారాయి. పాదయాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై షర్మిల రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించడంపై, ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై చేస్తున్న దాడులకు ఆమె ఏమి సమాధానం చెప్తారని ఎదురు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రశ్నల వెనక కూడా ఆమె ఏపీ మనిషి అన్న భావన తెలంగాణలో ఉండటమే కారణం. చివరికి ఆమె తెలంగాణ యాసతో, బతుకమ్మ ఆటలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేసినా అవి కృత్రిమంగానే మిగిలాయి.
తెలంగాణకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన వైఫల్యాన్ని గుర్తించిన షర్మిల త్వరలో వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి సిద్దమవుతునట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా రాహుల్ ట్వీట్ చేసినప్పుడు, రాహుల్ తిరిగి ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పుడు అభినందిస్తూ షర్మిల పోస్టులు పెట్టడం, కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్ ని కలవడం వంటివి చూస్తుంటే, ఆమె కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరితే, షర్మిల రాజకీయ జీవితాన్ని మలుపు తిరగవచ్చు. నిఖార్సయిన కాంగ్రెస్‌వాదిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్ బిడ్డగా షర్మిల కాంగ్రెస్‌లో చేరితే ఉభయ రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు వస్తుంది.
వైఎస్సార్‌కు కాంగ్రెస్ ఎంతో రాజకీయ జీవితం ఇచ్చింది. ఆయన కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన సీఎం పదవి కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పలు పథకాలకు ‘గాంధీ’ కుటుంబం పేర్లు పెట్టారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తానన్నారు. 2014లో రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలనేది తన ఆకాంక్ష అని కూడా వైఎస్‌ఆర్ చెప్పేవారు. ఆయన కోరికను తీర్చేలా షర్మిల కాంగ్రెస్‌కు దగ్గరవడం, ఆయన ఆశయాలను కొనసాగించడమే అవుతుంది. వైఎస్‌ఆర్‌సీపీ ఏర్పాటప్పుడే రాజశేఖరరెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ ఆయన ఆత్మగా ప్రచారంలో ఉన్న ఒక సీనియర్ నేత... కాంగ్రెస్ వైఎస్‌కు ఎంతో చేసిందని, ఆ పార్టీని వీడొద్దని ఆయన ఎంత నచ్చచెప్పినా వారు తమ దారి తాము చూసుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ మొత్తం వైఎస్‌ఆర్‌సీపీకి బదిలీ అయ్యింది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్న కారణంగా వైఎస్‌ఆర్‌టీపీకి మద్దతు లభించట్లేదు.
పీపుల్స్‌పల్స్ పరిశీలనలో తేలిందిదే
తెలంగాణలో షర్మిల పాదయాత్ర సందర్భంగా పీపుల్స్‌పల్స్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ప్రజా స్పందన నామమాత్రంగానే కన్పించింది. వైఎస్‌ఆర్‌టీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక శాతం లోపే ఓట్లు వస్తాయని, షర్మిల స్వయంగా బరిలోకి దిగాలనుకుంటున్న పాలేరులో కూడా ఆమెకి 3 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని పీపుల్స్‌పల్స్ పరిశీలనలో తేలింది.
‘‘ఎక్కడి నుండి వస్తున్నావో తెలిస్తే, ఎక్కడికి వెళ్తున్నావో తెలుస్తుంది’’ ప్రముఖ రచయిత కొడవగంటి కుటుంబరావు అన్నట్టు వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని షర్మిల ఆంధ్రప్రదేశ్‌పైనే దృష్టి సారించాలి. ఏపీలో, ప్రధానంగా రాయలసీమలో తన రాజకీయ ఎన్నికల పున:ప్రస్థానాన్ని ప్రారంభిస్తే ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఉనికి కోల్పోయి నోటాతో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికీ రాజశేఖరరెడ్డిపై గౌరవాన్ని సోపానంగా చేసుకొని కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకొచ్చే సదవకాశం షర్మిలకు కలుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో తన తండ్రి అస్త్రశస్త్రాలన్ని జగన్ తన దగ్గరే పెట్టుకున్నారు. వాటిని షర్మిల తనవైపు తెచ్చుకోవడం కొంచెం కష్టమే అయినా... అసాధ్యం మాత్రం కాదు. ఎందుకంటే, జగన్ చేస్తున్న తప్పులను గమనిస్తున్న రాష్ట్రప్రజలు, కాంగ్రెస్‌వాదులు షర్మిల లాంటి ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాజశేఖర్ రెడ్డిని వ్యతిరేకించినవాళ్లు, దివంగతనేత వైఎస్‌ఆర్ సతీమణి శ్రీమతి విజయమ్మను తిట్టిపోసినవాళ్లు మంత్రివర్గంలో కొనసాగుతుండటంతో రాజశేఖర్ రెడ్డి ఆప్తులు, కాంగ్రెస్‌వాదులు వైఎస్సార్సీపీకి దూరంగా ఉన్నారు. ఇలాంటి సంధి సమయంలో షర్మిల ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పగ్గాలు చేపడితే, రాజశేఖర్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్‌వాదులు, లౌకికవాదులు ఆమెకు అండగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తన తండ్రి కలను నిజం చేయడమే లక్ష్యంగా, చరిత్ర ఇచ్చిన ఈ సదవాకాశాన్ని ఉపయోగించుకుంటే ‘‘ఏపీలో షర్మిల ధనస్సుగా మారుతారనడంలో’’ ఎలాంటి సందేహం లేదు. తద్వారా తన తండ్రికి నిజమైన వారసురాలుగా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చిన ముద్దుబిడ్డగా చరిత్రలో నిలిచిపోతారు.
-ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
రీసెర్చర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ,
Email: peoplespulse.hyd@gmail.com
(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన విశ్లేషణ, అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతంగా భావించగలరు.)