Sangareddy Bjp: సంగారెడ్డి బీజేపీ టిక్కెట్ పులిమామిడికి దక్కేనా?
Sangareddy Bjp:రాబోయే ఎన్నికల్లో సంగారెడ్డి అసెంబ్లీ టికెట్ కోసం కోటి ఆశలతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరిన భారత రాష్త్ర సమితి (బిఆర్ఎస్) నేత, సదాశివపేట్ మున్సిపల్ కౌన్సిలర్ పులిమామిడి రాజుకు బీజేపీ టికెట్ వస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.
Sangareddy Bjp: రాజు కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాల, కిషన్ రెడ్డి ల సమక్షంలో సోమవారం అట్టహాసంగా బీజేపీ పార్టీ లో జాయిన్ అయ్యాడు. అయితే బీజేపీ అగ్ర నాయకులు ఎవరికి టికెట్ ఇస్తున్నాము అనే విషయాన్నీ ఎక్కడా మాట్లాడలేదు . ఇప్పటికే బీజేపీ టికెట్ ని ఆశిస్తూ పలువురు నాయకులు, బీజేపీలో ఎప్పటినుండో పని చేస్తున్నారు. తమకే టికెట్ ఇవ్వాలని కోరుతూ పార్టీ అధి నాయకత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
పాతవారిని కాదని కొత్తగా బిఆర్ఎస్ నుండి వచ్చిన నాయకునికి టికెట్ ఇస్తారా అనేది ప్రశ్నగా మిగిలింది. 2018 ఎన్నికల్లో పోటీచేసిన రాజేశ్వర్ రావు దేశపాండే, సీనియర్ నాయకులూ విష్ణువర్ధన్ రెడ్డి, శివరాజ్ పాటిల్, డాక్టర్ రాజు గౌడ్, పుల్లంగారి సురేందర్, తోట చంద్రశేఖర్, కే సంగమేశ్వర్, మల్లేశం, అంబదాస్ , మాణిక్ రావు, ఎం నాగరాజు తో పాటు పలువురు నాయకులు సంగారెడ్డి సీట్ కోరుతూ అప్లై చేసుకున్నారు.
బీజేపీ లో ఎప్పటినుండో పనిచేస్తున్న వీరిని కాదని, పులిమామిడి రాజుకి టికెట్ ఇస్తారా అనే చర్చ మొదలైంది. ముదిరాజు సామాజికవర్గానికి చెందిన పులిమామిడి, అదే సామాజికవర్గానికి చెందిన ఈటల రాజేందర్ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు.
బిఆర్ఎస్ పార్టీ ముదిరాజులకి ఎవరికి టికెట్ ఇవ్వకపోవడం వలన, అదే కులానికి చెందిన రాజుకు టికెట్ ఇవ్వాలి అని ఈటల రాజేందర్ పార్టీ నాయకత్వాన్ని ఒప్పిస్తాడు అని పులిమామిడి నమ్మకంతో ఉన్నాడు. సంగారెడ్డి నియోజకవర్గం లో, ముదిరాజు కులానికి సుమారుగా 40,000 ఓట్లు ఉన్నాయ్ అని తాను అన్నాడు. టికెట్ కోసం పోటీపడుతున్నబీజేపీ నాయకులూ ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తవారికి టికెట్ ఇస్తే ఒప్పుకోబోమని అంటున్నారు.
ఇప్పటికే టిక్కెట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న నాయకులు తమకు తెలిసిన నాయకులతో కలిసి, అదినాయకత్వాన్ని ఒప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పులిమామిడి రాజు సదాశివపేట లో తప్ప నియోజకవర్గంలోని సంగారెడ్డి, కొండాపూర్, కంది మండలంలో తాను పరిచయం లేని ముఖం అని, ఇది తనకు టికెట్ ఇవ్వటంలో తీవ్ర అవరోధంగా ఉంటుంది అని అన్నారు.
సంగారెడ్డి లో రాజకీయ నిపుణులు మాత్రం ఎవరికి టికెట్ ఇచ్చినా బీజేపీ పార్టీ ఇక్కడ మూడో స్థానం తోటే సరిపెట్టుకోవాల్సి వస్తుందని అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ 15,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సారి కూడా పోటీ బిఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్, కాంగ్రెస్ అభ్యర్థి టి జగ్గా రెడ్డి మధ్యలో ఉంటుంది అని అభిప్రాయం ఉంది.
2018 ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశిస్తూ ఎంతో కష్టపడి పార్టీ కోసం పని చేసిన అప్పటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చి రెడ్డి, పార్టీ నాయకత్వం టికెట్ దేశపాండేకి ఇవ్వడం వలన పార్టీనే వదిలి బిఆర్ఎస్ లో చేరారు. పులిమామిడికి టికెట్ ఇస్తే కూడా ఇలాంటి పరిణామాలు జరిగే అవశ్యకత ఉంది అని పార్టీ నాయకులూ అభిప్రాయపడుతున్నారు.