Nizamabad congress: నిజామాబాద్ నేత‌ల‌కు ప‌ద‌వులు ద‌క్కేనా?-will nizamabad district leaders get posts and berths in cabinet ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nizamabad Congress: నిజామాబాద్ నేత‌ల‌కు ప‌ద‌వులు ద‌క్కేనా?

Nizamabad congress: నిజామాబాద్ నేత‌ల‌కు ప‌ద‌వులు ద‌క్కేనా?

HT Telugu Desk HT Telugu
Dec 15, 2023 01:54 PM IST

Nizamabad congress: ప‌దేండ్లుగా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన నాయ‌కులు త‌మ‌కు ఇప్ప‌టికైనా ప‌ద‌వులు ద‌క్కుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేని నిజామాబాద్ జిల్లాలో ఎవ‌రికి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.

నిజామాబాద్‌లో పదవులు దక్కేది ఎవరికి?
నిజామాబాద్‌లో పదవులు దక్కేది ఎవరికి?

Nizamabad congress: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం, ఉస్తేజం నెల‌కొంది. అధికారానికి దూర‌మై ప‌దేండ్లు కావ‌డం, అన్ని రాష్ట్రాల్లో వ‌రుస ఓట‌ముల‌తో ఆ పార్టీ నేత‌ల్లో పూర్తిగా నిరాశ ఆవ‌రించింది. అయితే క‌ర్నాట‌క‌లో ఆ పార్టీ విజ‌యం సాధించ‌డం, తెలంగాణ‌లోనూ ఆ ఊపుతో ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌డం అన్నీ క‌లిసి వ‌చ్చాయి.

సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో గ్రూపు రాజ‌కీయాల‌తో స్వంత పార్టీ నేత‌ల‌ను ఓడించే సంస్కృతి నుంచి అన్ని విభేదాలు ప‌క్క‌న పెట్టి పార్టీ కోసం ఒక్క‌తాటిపైకి వ‌చ్చే కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టింది. ఆ ఫ‌లితంగానే ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో తొమ్మిది స్థానాల‌కు గాను నాలుగు స్థానాలు గెలుచుకుంది. కేవ‌లం 3 వేల ఓట్ల‌తో బాల్కొండ నియోక‌వ‌ర్గంలో ఓడిపోయింది.

ఇక నిజామాబాద్ అర్బ‌న్‌లో రెండోస్థానంతో స‌రిపెట్టుకుంది. అయితే నిజామాబాద్ జిల్లాలో పార్టీలో బ‌ల‌మైన, ముఖ్య నాయ‌కులు ఉన్నారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కొంత‌మంది పార్టిలోకి వ‌చ్చారు. దీంతో కొత్త‌, పాత నాయ‌కుల‌తో పార్టీ బ‌లంగా త‌యార‌య్యింది. అయితే ఇటీవ‌ల పార్టీలోకి వచ్చిన కొత్త‌వారికి ప‌ద‌వులు ఇస్తారా? లేక మొద‌టి నుంచి పార్టీ జెండా మోసిన‌వారికి అవ‌కాశ‌మిస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

నిజామాబాద్ అర్బ‌న్‌లో ప‌లువురు ఆశావాహులు...

నిజామాబాద్ అర్బ‌న్ నుంచి ప‌లువురు నేత‌లు క్యూలో ఉన్నారు. అందులో ప‌ట్ట‌ణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు కేశ వేణు, మ‌రో సీనియ‌ర్ నాయ‌కులు న‌రాల రత్నాక‌ర్‌, తాహెర్ బిన్ హందాన్ తో పాటు అర్బ‌న్ నుంచి పోటీకి సిద్ద‌ప‌డ్డ పీసీసీ మాజీ అధ్య‌క్షులు డి శ్రీ‌నివాస్ కుమారుడు, ఫ‌స్ట్ మేయ‌ర్ డి సంజ‌య్ ఉన్నారు.

ఎన్నిక‌ల ముందు పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీఆకుల ల‌లిత కూడా ప‌ద‌వి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు కేశ వేణుకు మొద‌టి నుంచి పార్టీలో స‌రైన ప్రాధాన్య‌త దక్క‌లేద‌న్న‌ది ఆయ‌న అనుచ‌రుల టాక్‌. గ‌తంలో జిల్లా అధ్య‌క్షుడిగా నియ‌మిస్తార‌ని ఆశించిన‌ప్ప‌టికీ.. చివ‌రి క్ష‌ణంలో బాల్కొండ‌కు చెందిన మానాల మోహ‌న్‌రెడ్డికి జిల్లా అధ్య‌క్ష‌డిగా నియ‌మించారు.

ఇక ఇటీవ‌ల అర్బ‌న్ నుంచి పోటీ చేద్దామ‌ని భావించిన‌ప్ప‌టికీ.. టిక్కెట్టును షబ్బీర్ అలీకి కేటాయించారు.అయిన‌ప్ప‌టికీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అంద‌రూ ఒకేతాటిపైకి వ‌చ్చి ప్ర‌చారం నిర్వ‌హించారు. చివ‌రి వ‌ర‌కు గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. కానీ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.

ఇక రూర‌ల్ నుంచి మ‌రో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల న‌ర్సారెడ్డి, మ‌రో సీనియ‌ర్ నాయ‌కులు న‌గేష్‌రెడ్డి ఉన్నారు. అరికెల న‌ర్సారెడ్డితో పాటు న‌గేష్‌రెడ్డి రూరల్ నుంచి బ‌రిలోకి దిగాల‌ని భావించారు. కానీ హైక‌మాండ్ ఆదేశాల‌తో వెన‌క్కిత‌గ్గారు. ఇక బోధ‌న్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తూము శ‌ర‌త్‌రెడ్డి ఉన్నారు. బాన్సువాడ నుంచి బీసీ నాయ‌కులు కాసుల బాల్‌రాజ్‌తో పాటు ప‌లువురు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.

(మీసా భాస్కర్, హిందుస్తాన్ టైమ్స్, నిజామాబాద్)

Whats_app_banner