Telugu News  /  Telangana  /  Will Munugode Bypoll Result Affect On Telangana Next Elections
మునుగోడు ఉపఎన్నిక
మునుగోడు ఉపఎన్నిక

Munugode Bypoll Result : వచ్చే ఎన్నికలపై మునుగోడు రిజల్ట్ ప్రభావం ఎంత?

06 November 2022, 20:36 ISTHT Telugu Desk
06 November 2022, 20:36 IST

Munugode Bypoll 2022 : మునుగోడు ఉపఎన్నికను పార్టిలన్నీ సెమీఫైనల్స్ గా చెప్పుకొచ్చాయి. ఇక్కడ గెలిచి.. వచ్చే ఎన్నికల్లో తమకు వ్యతిరేకత లేదని చూపించాలనుకున్నాయి. అయితే రాబోయే ఎన్నికలపై మునుగోడు ఫలితం ప్రభావం ఉంటుందా?

మునుగోడు ఉపఎన్నిక(Munugode Bypoll)లో పార్టీలు.. అన్ని విధాలుగా పోటీ పడ్డాయి. ఎక్కడా తగ్గకుండా ప్రత్యర్థి పార్టీలకు ఊపిరి ఆడనీయకుండా చేశాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా గెలిచేందుకు పని చేశాయి. మునుగోడు సెమీఫైనల్ గెలిచి.. ఫైనల్స్ లోనూ గెలుస్తామనే వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. జనాలు కూడా అదే మూడ్ లోకి వెళ్లారు. కానీ గెలిచన తర్వాత.. అలాంటి పరిస్థితే కంటిన్యూ అవుతుందా? మునుగోడు ఉపపోరు నిజంగానే సెమీ ఫైనల్స్ అనుకోవచ్చా?

ట్రెండింగ్ వార్తలు

ఏ ఎన్నికను అయినా.. గెలిచిన వ్యక్తి.. ఓడిపోయిన వ్యక్తి తప్ప ఎక్కువ రోజులు ఎవరూ గుర్తుంచుకోరు. అసలు వచ్చే ఎన్నికల్లో ఇది ప్రధానంగా చర్చకు వస్తుందా అనేది అసలు ప్రశ్న. మునుగోడు(Munugode)లాంటి కీలకమైన సెంటర్లు తెలంగాణలో చాలా ఉన్నాయి. ఎక్కడపడితే అక్కడకు వెళ్లి మునుగోడులో గెలిచామనే ప్రస్తావనే పెద్దగా ఉండదు. అయితే ప్రజలు తమవైపే ఉన్నారని ఓ మెసేజ్ వెళ్లినట్టైంది. ఒకవేళ బీజేపీ(BJP) గెలిచి ఉంటే.. టీఆర్ఎస్(TRS) పార్టీని డిస్టర్బ్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అంతర్గతంగా పార్టీకి ఇబ్బందులు మెుదలయ్యేది. కమలం పార్టీ గెలిచి ఉంటే.. వలసలు కూడా పెరిగే అవకాశం ఉండేది.

2023లో ఎన్నికలు రానున్నాయి. నాలుగైదు నెలలు అయ్యాక.. మునుగోడు(Munugode) విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అయితే ప్రభుత్వ వ్యతిరేకతపై టీఆర్ఎస్ పార్టీకి గెలుపుతో క్లారిటీ వచ్చింది. తమపై వ్యతిరేకత లేదనే విషయాన్ని చెప్పుకొనేందుకు అవకాశం దక్కింది. వేరే పార్టీలోకి వెళ్దామనే ఆలోచన ఉన్నవారిని కూడా సైలెంట్ చేసేస్తుంది. ఈ ఉపఎన్నిక(Bypoll)ను మాత్రం.. ప్రచారాస్త్రాంగా కేసీఆర్ లాంటి నేత అస్సలు వాడుకోరు. బీజేపీ(BJP) గెలిస్తే.. ఈ ఉపఎన్నిక గెలుపును కచ్చితంగా వాడుకునేది.

మునుగోడు ఉపఎన్నిక(Munugode Bypoll) ద్వారా.. వేరే ప్రభుత్వం వచ్చేది లేదు.. ఉన్న ప్రభుత్వానికి వచ్చిన సమస్యా లేదు. ఈ విషయం జనాలకు కూడా బాగా అర్థమైనట్టుగా ఉంది. వాళ్లు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. డబ్బు, మద్యం ఇక్కడ పెద్దగా ప్రభావం చూపించిందని అందరూ చెప్పుకొనే బహిరంగ రహస్యమే. వేరే వాళ్ల ఖాతాలో ఉన్న సీటు వస్తే.. మంచిదే కదా అని టీఆర్ఎస్ పార్టీ(TRS Party) పోరాడింది. ఒకవేళ గెలిస్తే.. లాభం కదా అని బీజేపీ(BJP) అనుకుంది. అందుకే ఈ ఉపఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగింది.

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Polls) వచ్చే సరికి మెుత్తం మారిపోతుంది. పార్టీలు ఎత్తుకునే ప్రచారమే వేరుగా ఉంటుంది. ఇక మునుగోడు ఉపఎన్నికను పెద్దగా తీయవు. మునుగోడులో గెలిచాం... ప్రభుత్వ వ్యతిరేకత లేదనే విషయంపై టీఆర్ఎస్ క్లారిటీగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఏ ప్రభుత్వం రావాలనే అంశంపైనే ఎక్కువ చర్చ నడుస్తోంది. మార్చాలనుకుంటే.. మెుత్తం పార్టీలనే మారుస్తారు జనాలు. ఒక్క ఉపఎన్నిక ద్వారా పెద్దగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం ఉండకపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలొస్తే పార్టీలు చేసుకునే ప్రచారాలు, విమర్శలు కూడా మారిపోతాయి. వాటి ఆధారంగానే జనాలు కూడా ఆలోచనలో పడతారు. ఉదాహరణకు 2017లో నంద్యాల ఉపఎన్నికలో బంపర్ మెజారిటీతో గెలిచిన టీడీపీ.. సాధారణ ఎన్నికల్లో మాత్రం వైసీపీ చేతిలో దారుణంగా ఓడిపోయింది. అదే నంద్యాలలోనూ ఓడిపోయింది. అంటే సాధారణ ఎన్నికలు వస్తే.. జనాల మూడ్ మారిపోతుంది. నేతల మాటలు కూడా వేరుగా ఉంటాయి.

ఒకవేళ మునుగోడులో బీజేపీ గెలిచి ఉంటే మాత్రం.. ఈ అంశాన్ని ఎక్కువగా వాడుకునే అవకాశం ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం.. తమపై వ్యతిరేకత లేదనే విషయాన్ని ప్రస్తావిస్తుంది. కానీ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉంటుంది. సాధారణ ఎన్నికలు జరిగే విధానమే వేరుగా ఉంటుంది. మారితే ప్రభుత్వాన్ని మార్చేయాలనే ఆలోచనలోనే గాలి ఏదో ఒక పార్టీ వైపు వీస్తుంది.