TG Raithu Bharosa: రబీ సీజన్‌లోనైనా రైతుకు భరోసా దక్కేనా..? తెలంగాణలో రైతులు ఎదురు చూపులు…-will farmers get assurance even in the rabi season farmers in telangana are looking forward to ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Raithu Bharosa: రబీ సీజన్‌లోనైనా రైతుకు భరోసా దక్కేనా..? తెలంగాణలో రైతులు ఎదురు చూపులు…

TG Raithu Bharosa: రబీ సీజన్‌లోనైనా రైతుకు భరోసా దక్కేనా..? తెలంగాణలో రైతులు ఎదురు చూపులు…

HT Telugu Desk HT Telugu
Nov 19, 2024 10:28 AM IST

TG Raithu Bharosa: రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ దాదాపు ముగిసినట్టే. ఇప్పటికే ఖరీఫ్ వరి ధాన్యం మార్కెట్ ను ముంచెత్తుతోంది. వరి ధాన్యం కొనుగోళ్ల గురించి సర్కారు చెబుతున్న మాటలకు, క్షేత్ర స్థాయిలో మిల్లర్ల వ్యవహార శైలికి ఏ మాత్రం పొంతన లేదు.

తెలంగాణలో రబీ సీజన్‌లోనైనా రైతు భరోసా దక్కుతుందా?
తెలంగాణలో రబీ సీజన్‌లోనైనా రైతు భరోసా దక్కుతుందా?

TG Raithu Bharosa: పండించిన పంటను గిట్టుబాటు ధరకు విక్రయించుకోడానికి అష్టకష్టాలు పడుతున్న తెలంగాణ అన్నదాత.. రబీ సీజన్ కు సిద్ధమవుతున్నాడు. ఖరీఫ్‌లో సాయం అందని రైతాంగానికి ప్రభుత్వం కనీసం రబీ సీజన్ లోనైనా రైతులకు సాగు పెట్టుబడుల కోసం అందించే ఆర్ధిక సాయం ‘ రైతు భరోసా ’ కు నిధులు విడుదల చేస్తుందా..? రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందా..? అన్న అనుమానాలు అన్నదాతల నుంచి వ్యక్తమవుతున్నాయి.

హామీ మరిచిన సర్కారు

గత ఏడాది డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, తమ ఎన్నికల హామీల్లో ప్రధానమైనదిగా పేర్కొన్న రైతు భరోసా ( బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధం) కింద సాయమే చేయలేదు. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు వ్యవసాయ సీజన్లకు కలపికి ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి సాయంగా అందించింది.

ఈ మొత్తాన్ని ఎకరాకు రూ.7500 చొప్పున ఏటా ఎకరాకు రూ.15,000 పంటల పెట్టుబడుల కోసం అందిస్తామని పథకం పేరును మార్చి రైతు భరోసా అంటూ హామీ ఇచ్చింది. మరో అడుగు ముందుకేసి కేవలం రైతులకే కాకుండా.. కౌలు రైతులకు కూడా సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. రైతులు, కౌలు రైతులకు మాత్రమే కాకుండా.. రైతు కూలీలకు ఏటా రూ.12వేల సాయం అందిస్తామని హామీలు గుప్పించింది.

అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక రబీ, ఖరీఫ్ సీజన్లు ముగిసి ఇపుడు మరో రబీ సీజన్ ముంగిట ఉన్నారు. అధికారంలోకి వచ్చీ రాగానే నాటి రబీ లో గత ప్రభుత్వ మాదిరిగానే ఎకరాకు రూ.5వేల చొప్పున అందించింది. కానీ, ఖరీఫ్ లో పెట్టుబడి సాయం అందివ్వలేదు. రైతుల రుణమాఫీ చేసిన కారణంగా రైతు భరోసాను పక్కన పెటిందన్న విమర్శలు వ్యక్తం అయ్యాయి. కాగా, ప్రస్తుతం రైతులు రబీ (యాసంగి) పంటలకు సిద్ధమవుతున్న తరుణంలో రైతు భరోసాపై అన్నదాతల్లో ప్రశ్నలు మొదలయ్యాయి.

మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైనా కానరాని ప్రయోజనం

తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి విధివిధానాలు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఎలాంటి భూములకు సాయం చేయాలి..? సాగు యోగ్యమైన భూములు ఎన్ని ఉన్నాయి..? రైతుల సంఖ్య ఎంత..? పెట్టుబడి సాయం ఎవరెవరికి అందివ్వాలి..? అన్న అంశాలే ప్రధాన ఎజెండాగా మంత్రి వర్గ ఉప సంఘం పనిచేసింది.

వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తమ పదేళ్ల పదవీ కాలంలో రైతు బంధు పథకాన్ని అమలు చేయడం మొదలు పెట్టాక 11 సార్లు రైతులు పెట్టుబడుల సాయం అందించింది. అయితే, గత ప్రభుత్వం సాగులో లేని భూములకు కూడా సాయం అందించింది. ఇలా పదకొండు విడతల్లో సాగులో లేని భూములకు అందించిన రైతు బంధు సాయం ఏకంగా రూ.25,672 కోట్ల రూపాయలు. ఇంత మొత్తాన్ని ఆదా చేసేందుకు సాగుబడిలోని భూములను మినహాయించేలా, పడావు భూములు, అధిక మొత్తం భూమి చేతుల్లో ఉన్న వారిని మినహాయించి అసలు సిసలు రైతులకే సాయం అందేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రి వర్గ ఉప సంఘం సిఫారసు చేసినట్లు సమాచారం.

ఈ రబీలోనైనా పెట్టుబడి సాయం అందేనా..?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తోంది. రబీ సీజన్ ముంగిట ఉన్న రైతుకు సర్కారు పదవీ కాలం ఏడాది పూర్తవుతున్న సందర్భంగానైనా కనికరిస్తుందా లేదా అన్న సంశయంలో రైతులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 157.43లక్షల ఎకరాల భూమి ఉంటే, 152.51లక్షల ఎకరాల్లో వివిధ రకాలైన పంటలు సాగవుతున్నట్టు ప్రభుత్వం లెక్క తేల్చింది. కాగా, ఈ భూమి అంతా 74.58 లక్షల మంది పట్టాదారుల చేతుల్లో ఉంది. వాస్తవానికి 90శాతం భూమి (56.11లక్షల ఎకరాలు) అయిదు ఎకరాల్లోపు పట్టాలు ఉన్నదే.

అయిదు నుంచి పదెకరాల్లోపు 4.82లక్షల ఎకరాలు, పది నుంచి యాభై ఎకరాల మధ్య 1.17లక్షల ఎకరాల వరకు ఉంది. ఇపుడు రైతులు చేస్తున్న డిమాండ్ కూడా పదెకరాల్లోపు వ్యవసాయ భూములు ఉన్నవారికన్నా రైతు భరోసా సాయం అందించాలనే కావడం గమనార్హం. రాష్ట్రం మొత్తంలో భూ కమతాలు ఉన్న వారిలో పది ఎకరాల వరకు ఉన్న వారు ఏకంగా 97.83 శాతం మంది. పదెకరాల వరకు భూములున్న వారికి సాయం అందిస్తే రూ.1385 కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని ప్రభుత్వం లెక్క తేల్చింది. కనీసం వీరికైనా రబీలో సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )

Whats_app_banner