TG Rythu Bharosa Scheme : రైతు భరోసాకు 'సీలింగ్' విధిస్తారా..? సర్కార్ ఏం చేయబోతుంది..?-will ceiling be implemented in telangana rythu bharosa scheme key points read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Rythu Bharosa Scheme : రైతు భరోసాకు 'సీలింగ్' విధిస్తారా..? సర్కార్ ఏం చేయబోతుంది..?

TG Rythu Bharosa Scheme : రైతు భరోసాకు 'సీలింగ్' విధిస్తారా..? సర్కార్ ఏం చేయబోతుంది..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 10, 2025 05:36 AM IST

Telangana Rythu Bharosa Scheme : జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా స్కీమ్ అమలు కానుంది. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకోగా… అధికారికంగా మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. అయితే రైతు భరోసాకు సీలింగ్ విధిస్తారా..? లేదా..? అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో రైతు భరోసా స్కీమ్
తెలంగాణలో రైతు భరోసా స్కీమ్

తెలంగాణలో రైతు భరోసా స్కీమ్ పట్టాలెక్కనుంది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఇటీవలనే కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. స్కీమ్ అమలుకు సంబంధించి మంత్రివర్గం కూడా ఆమోదముద్ర వేసింది. జనవరి 26వ తేదీ నుంచి ఈ స్కీమ్ ను అమలు చేయాలని నిర్ణయించింది. ఏటా రూ. 12 వేల పంట పెట్టుబడి సాయం అందించబోతుంది.

yearly horoscope entry point

రైతు భరోసా స్కీమ్ ను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పథకం అమలులో సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఉన్న రైతుబంధు పథకం అమలులో అనేక లోపాలు ఉన్నాయని.. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. గతంలో మాదిరిగా స్కీమ్ అమలు ఉండదని… సాగు యోగ్యత ఉన్న భూములకే రైతు భరోసా ఇస్తామని కూడా క్లారిటీ ఇచ్చింది.

సీలింగ్ విధిస్తారా..? లేదా..?

స్కీమ్ అమలుపై ప్రాథమికంగా కొన్ని సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో సీలింగ్ అంశం కూడా ఒకటిగా ఉంది. గతంలో అమలు చేసిన రైతుబంధు పథకం కింద ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా.. పంట పెట్టుబడి సాయం అందించారు. ఎలాంటి సీలింగ్ ను కూడా నిర్ణయించలేదు. దీంతో రైతుకు ఎంత విస్తీరణంలో భూమి ఉందో.. అంతమేరకు పంట సాయం అందింది. అయితే దీనిపై అనేక వర్గాల నుంచి పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

ప్రస్తుతం అమలు చేయబోతే రైతు భరోసా పథకంలో సీలింగ్ ఉంటుందా..? ఉండదా..? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. నిజానికి కేబినెట్ సబ్ కమిటీ.. జిల్లా వారీగా రైతుల నుంచి అభిప్రాయాలను కూడా సేకరించింది. అసెంబ్లీలో నిర్వహించిన చర్చలో కూడా పలు సూచనలు, సలహాలు వచ్చాయి. దీనిపై కేబినెట్ భేటీలో కూడా చర్చ జరిగింది. అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది.

కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలను వెల్లడించారు. సాగు యోగ్యత ఉన్న భూములకు ఎలాంటి షరతు లేకుండా పంట పెట్టుబడి సాయం అందిస్తామని స్పష్టంగా చెప్పారు. అంటే… సీలింగ్ లేకుండానే ఈ స్కీమ్ ను అమలు చేస్తారా..? అన్న చర్చ కూడా తెరపైకి వస్తోంది.

ఇక తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన… రైతు భరోసా పథకం గురించి మాట్లాడారు. జనవరి 26 నుంచి అన్నదాతల అకౌంట్లలో ఎకరానికి 12 వేల రూపాయల డబ్బులను జమ చేస్తామని చెప్పారు. సాగు చేసే ప్రతీ ఎకరానికి రైతు భరోసా ఇస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. "ఐదు ఎకరాలో, పది ఎకరాలో కాదు ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి కూడా రైతు భరోసా అందుతుంది. జనవరి 26 నుంచి స్కీమ్ అమలు చేయబోతున్నాం. రూ. 8400 కోట్లు రైతుల అకౌంట్ల లోకి వెయ్యబోతున్నాం. ఇదే విషయాన్ని రైతులకు ధైర్యంగా చెప్పండి" అంటూ భట్టి ప్రకటన చేశారు. 

డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన చూస్తే… సీలింగ్ విధానం ఉండదేమోనన్న చర్చ మొదలైంది.  అయితే రేపోమాపో రైతు భరోసా స్కీమ్ అమలు కోసం మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. దీంట్లో సీలింగ్ విధించే అంశంపై ప్రస్తావించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా…. మరికొన్ని అంశాలపై కూడా స్పష్టత వస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం