BRS Khanapur : ఖానాపూర్‍లో 'తారకమంత్రం' ఫలించేనా..?-will brs focus on the party situation in khanapur ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Khanapur : ఖానాపూర్‍లో 'తారకమంత్రం' ఫలించేనా..?

BRS Khanapur : ఖానాపూర్‍లో 'తారకమంత్రం' ఫలించేనా..?

HT Telugu Desk HT Telugu
Sep 23, 2023 06:47 AM IST

TS Assembly Elections: టికెట్లు దక్కని నేతలను లైన్ లోకి తీసుకువచ్చే పనిలో పడింది బీఆర్ఎస్ హైకమాండ్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఘన్ పూర్ పంచాయితీకి పుల్ స్టాప్ పెట్టడంలో కీలకంగా వ్యవహరించిన కేటీఆర్.. ఖానాపూర్ పై కూడా ఫోకస్ పెడ్తారా అన్న చర్చ జరుగుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నేతలతో కేటీఆర్ (ఫైల్ ఫొటో)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నేతలతో కేటీఆర్ (ఫైల్ ఫొటో)

Telangana Assembly Elections 2023 : మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు... వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థులను ప్రకటించగా… కొన్ని నియోజకవర్గాల్లోని నేతలు అసంతృప్తి రాగాన్ని వినిపిస్తున్నారు. ఇక పలువురు అభ్యర్థులకు టికెట్లు రాకపోవటంతో…. ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి మరోలా ఉంది. టికెట్ దక్కించుకున్న నేతలు జోరు పెంచే ప్రయత్నాల్లో ఉంటే… సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికలకు టైం దగ్గరపడుతుండటంతో ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్యలో రాజీ కుదిరినట్టు అయింది. నిన్నటి వరకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేనంతగా ఉండే ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కుదిరింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కడియం శ్రీహరికి టికెట్ కట్టబెట్టినందుకు మండిపడ్డ రాజయ్య ప్రస్తుతం శ్రీహరితో దోస్త్ మేరా దోస్త్ అంటున్నారు. నిన్నటి వరకు ఓడించి తీరుతానన్న రాజయ్య నేడు గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. మంత్రి కేటీఆర్ వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. శుక్రవారం ప్రగతి భవన్ లో ఇద్దరినీ కూర్చోబెట్టి పార్టీ బలపేతంపై మాట్లాడారు. రాజయ్య భవిష్యత్తుకు కేటీఆర్ బలమైన హామీ ఇచ్చారని తెలుస్తోంది.

ఖానాపూర్ సెగ్మెంట్లో ఫలించేనా?

ఇది ఇలా ఉంటే… ఖానాపూర్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ ను కాదని జాన్సన్ నాయక్ కు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. జాన్సన్ నాయక్.. కేటీఆర్ కు మంచి మిత్రుడు కావటంతోనే టికెట్ దక్కిందని స్థానిక ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈనెల 25న నిర్మల్ జిల్లాలో కేటీఆర్ పర్యటిస్తున్నందున… వీరిద్దరి మధ్య కూడా సయోధ్య కుదురుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ మారతానన్న రేఖ నాయక్… మాట మార్చి తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్పుకొస్తున్నారు. తన పదవి కాలం ఇంకా 50 రోజులు ఉందంటూ నియోజవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో తన అభివృద్ధిని కించపరిచే విధంగా మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాన్సన్ నాయక్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతన్నారు. వీరి ఇరువురి గొడవలు తారక స్థాయికి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఆదిలాబాద్