Warangal Crime: పాకాల ఫారెస్ట్ లో వన్య ప్రాణుల వేట, ఆటోలో తరలిస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో బయటపడ్డ బాగోతం..-wildlife poaching in pakala forest a tragedy unfolded when an auto collided with an rtc bus while transporting animals ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Crime: పాకాల ఫారెస్ట్ లో వన్య ప్రాణుల వేట, ఆటోలో తరలిస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో బయటపడ్డ బాగోతం..

Warangal Crime: పాకాల ఫారెస్ట్ లో వన్య ప్రాణుల వేట, ఆటోలో తరలిస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో బయటపడ్డ బాగోతం..

HT Telugu Desk HT Telugu

Warangal Crime: వరంగల్ జిల్లాలోని పాకాల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట ఆగడం లేదు. తరచూ అడవి జంతువులను వేటాడటం, వాటి మాంసాన్ని తరలిస్తూ దందా చేయడం ఇక్కడ కామన్ అయిపోయింది. తాజా జరిగిన ఓ ఘటన ఇదే పరిస్థితికి అద్దం పడుతోంది.

పాకాలలో వెలుగు చూసిన వన్య ప్రాణుల వేట

Warangal Crime: వరంగల్‌ జిల్లా పాకాల అటవీ ప్రాంతంఅలో వన్యప్రాణుల వేట వెలుగు చూసింది. వేటాడిని జంతువుల్ని తరలిస్తుండాగా ప్రమాదం జరగడంతో ఈ ఘటన వెలుగు చూసింది. పాకాల అభయారణ్యంలో వన్య ప్రాణులు వేటాడి, ఆటోలో తరలిస్తుండగా.. వారు వెళ్తున్న ఆటో కాస్త ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఓ వన్య ప్రాణి, మరో జంతు మాంసం బయటపడటంతో సదరు దుండగులు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని చిలుకమ్మనగర్ శివారు పాకాల సరస్సు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.

వరంగల్‌ ఫారెస్ట్ అధికారులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా అశోక్ నగర్ కు చెందిన ఇమ్మడి ఏకాంబ్రం, చిలుకమ్మ నగర్ కు చెందిన ఇస్లావత్ సుధీర్, బంగారి సుమన్, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మొండ్రాయిగూడెంకు చెందిన లవన్ కుమార్ స్నేహితులు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన వీరంతా కలిసి ఆదివారం తెల్లవారుజామున చిలుకమ్మనగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులను వేటాడేందుకు ఉచ్చులు బిగించారు. దీంతో ఆ ఉచ్చుల్లో ఒక కనుజు, కొండగొర్రె పడగా.. అదే అటవీ ప్రాంతంలో కనుజును కోసి, అక్కడే ముక్కలు చేసి మూట కట్టారు. కొండగొర్రెతో పాటు కనుజు మాంసాన్ని తమ ఆటోలో చిలుకమ్మనగర్ నుంచి అశోక్ నగర్ తరలించే పనిలో పడ్డారు.

ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో బట్టబయలు

వన్య ప్రాణులను వేటాడిన అనంతరం దుండగులు చిలుకమ్మనగర్ నుంచి అశోక్ నగర్ కు ఆటోలో బయలు దేరారు. పాకాల చెక్ పోస్ట్ దాటే క్రమంలో కంగారు పడిపోయి ఆటో వేగం పెంచారు. అదే చెక్ పోస్ట్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఎదురుగా రావడంతో.. వేగంగా బస్సును ఢీకొట్టిన ఆటో అక్కడే బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న కనుజు మాంసంతో పాటు కొండగొర్రె కళేబరం రోడ్డు పక్కన పడ్డాయి. దీంతో వారి బాగోతం బట్టబయలైంది.

ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ బస్సు దిగి అక్కడ పరిశీలించారు. అక్కడ కనుజు మాంసం, కొండగొర్రె కళేబరాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే స్థానిక ఫారెస్ట్, పోలీస్ అధికారులు సమాచారం అందించారు. కాగా ప్రమాదం జరిగిన తరువాత వన్య ప్రాణుల వేట విషయం బయటపడటంతో దుండగులు హుటాహుటిన అక్కడి నుంచి తప్పించుకున్నారు. బోల్తా పడిన ఆటోను లేపి, కనుజు మాంసంతో అక్కడి నుంచి ఉడాయించారు.

కాగా రోడ్డు ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏకాంబరం కాలు వేలు విరగడంతో చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి కొండగొర్రె కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేటగాళ్ల గురించి ఆరా తీయగా.. చిలుకమ్మనగర్ కు చెందిన ఇస్లావత్ సుధీర్ విషయం తెలిసింది.

దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా.. మిగతా నిందితుల పేర్లు చెప్పాడు. కాగా మిగతా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, నిందితులందరిపై వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. వన్య ప్రాణులను వేటాడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

HT Telugu Desk

సంబంధిత కథనం