Warangal Crime: భర్త హత్యకు భార్య పన్నాగం.. బెడిసికొట్టిన ‘సుపారీ’ ప్లాన్.. వరంగల్ జిల్లాలో కలకలం
Warangal Crime: కట్టుకున్న భర్తను హత మార్చేందుకు ఓ వివాహిత ప్లాన్ వేసింది. తనకు పరిచయం ఉన్న వ్యక్తులకు రూ.10 లక్షలకు సుపారీ కూడా ఇచ్చింది. కానీ అనూహ్యంగా విషయం ఆమె భర్తకు తెలియడంతో.. సుపారీ ప్లాన్ కాస్త బెడిసికొట్టింది.

Warangal Crime: వరంగల్‌లో సుపారీ హత్యకు వేసిన స్కెచ్ బెడిసి కొట్టింది. ఇటీవల వరంగల్ నగరంలో ఇదే తరహాలో ఓ యువ డాక్టర్ ను తన భార్యే చంపించగా.. ఇప్పుడు ఈ సుపారీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన ధరావత్ సుమన్ హైదరాబాద్ లో బ్యాంక్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆయనకు నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన మంజులతో 2018లోనే వివాహం జరిగింది. కొద్దిరోజుల పాటు వారి సంసార జీవితం సాఫీగానే సాగగా.. ఒక పాప కూడా పుట్టింది.
ఇదిలా ఉంటే దాదాపు రెండు సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా.. వాళ్లిద్దరు ఒక్కటి కాలేకపోయారు.
రూ.10 లక్షలకు సుపారీ
తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మంజుల తన భర్తపై అటాక్ చేయించేందుకు ప్లాన్ వేసింది. ఈ మేరకు తన సమీప బంధువు అయిన మోతీలాల్ ను సంప్రదించింది. తన భర్త కాళ్లు విరగొట్టాలని, అందుకు డబ్బు ఇస్తానని చెప్పింది. ఇందుకు మోతీలాల్ ఓకే చెప్పడంతో ఆయన రాయపర్తికి చెందిన నరేశ్, తొర్రూరుకు చెందిన మల్లేశ్, ఆకులతండాకు చెందిన గోపీని సంప్రదించాడు. వారికి విషయం చెప్పగా.. రూ.2.5 లక్షలకు బేరం కుదిరింది.
ఈ క్రమంలోనే మరోసారి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరగగా.. సుమన్, మంజులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మొదట తన భర్తపై దాడి చేయించేందుకు ప్లాన్ చేసిన మంజుల, వరుస గొడవల నేపథ్యంలో ఆయనను అంతం చేయాలని నిర్ణయించుకుంది.
తన భర్తను చంపించేందుకు నిర్ణయించుకున్న మంజుల విషయాన్ని ఆల్రెడీ దాడి కోసం మాట్లాడుకున్న గ్యాంగ్ కు చెప్పింది. తన భర్తను ఎలాగైనా చంపాలని చెప్పగా.. వారు పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారు. చివరకు రూ.10లక్షలకు బేరం కుదుర్చుకుని వారికి సుపారీ ఇచ్చింది.
బెడిసికొట్టిన ప్లాన్
మంజుల ఇచ్చిన సుపారీ మర్డర్ ఓకే చెప్పిన గ్యాంగ్ లో రాయపర్తికి చెందిన నరేశ్ ఓ రోజు ధరావత్ సుమన్ కు ఫోన్ చేశాడు. తనతో మాట్లాడే పని ఉందని, ఓ విలువైన సమాచారం ఇస్తానని చెప్పాడు. ఆ సమాచారం ఇచ్చేందుకు తనకు రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మద్యం మత్తులో పలుమార్లు ఇలాగే ఫోన్ చేసి, డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన ధరావత్ సుమన్.. దాదాపు పది రోజుల కిందట నర్సంపేటకు వచ్చిన సమయంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హోళీ రోజే హత్యకు పథకం
కాల్ డేటా ఆధారంగా నరేశ్ వివరాలు సేకరించిన పోలీసులు కూపీ లాగడంతో అసలు గుట్టు బయటపడింది. నరేశ్ ను స్టేషన్ కు తీసుకొచ్చి విచారణ జరపగా.. భయంతో ఆయన అసలు విషయాన్ని పోలీసుల ఎదుట చెప్పేశాడు. తమకు మంజుల ఇచ్చిన సుపారీ వ్యవహారాన్ని పోలీసులకు వివరించాడు.
హోలీ పండగ రోజే బ్యాంకు ఉద్యోగి సుమన్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో సుమన్ భార్య అయిన మంజులతో పాటు మోతీలాల్, నరేశ్, మల్లేశ్, గోపీలను నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. కాగా కట్టుకున్న భర్తను హతమార్చేందుకు భార్య ప్లాన్ చేసిన వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం