Dornakal Couple: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి, గంటల వ్యవధిలో కన్నుమూసిన వృద్ధ దంపతులు
Dornakal Couple: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త మరణంతో కలత చెందిన భార్య గంటల వ్యవధిలోనే కన్నుమూసింది.
Dornakal Couple: పెళ్లైనప్పటి నుంచి కలిసి జీవితం పంచుకున్నారు. పిల్లలను ప్రయోజకులను చేసి, బతికినంత కాలం ఒకరికొకరు అండగా నిలిచారు. ముదిమి వయసులో భర్త అనారోగ్యంతో కనుమూయగా, ఆయన మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా గుండె పోటుతో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
ఒకే రోజు వృద్ధ దంపతులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్థులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ముల్కల పల్లి గ్రామానికి చెందిన సత్తి ముత్తయ్య(85) పశువుల కాపరిగా పని చేసేవాడు. అతని భార్య యశోదమ్మ(80) కూలి పనులు చేస్తుండేది. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కొడుకులు కాగా.. అందరికీ పెళ్లిళ్లు కూడా చేసేశారు.
ఆ తరువాత పిల్లలు ఎవరి పనుల్లో వారు ఉంటుండగా, వృద్ధ దంపతులను వారు పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వృద్ధ దంపతులు తాము కష్టపడిన సొమ్ముతోనే జీవితాన్ని నెట్టుకొచ్చేవారు. యశోదమ్మకు వచ్చే పింఛను డబ్బులు వారికి కాస్త ఆసరా అయ్యేవి. ఈ క్రమంలో రెండు రోజల కిందట పింఛన్ డబ్బులు డ్రా చేసిన యశోదమ్మ భర్త ముత్తయ్యకు ఇచ్చింది.
అనంతరం ముసురులో కూడా పశువులను మేపేందుకు బయటకు వెళ్లారు. ఆ తరువాత ఇంటికి వచ్చి, రాత్రి భోజనం చేసి పడుకున్నారు. కానీ గురువారం తెల్లవారుజామున ముత్తయ్య అస్వస్థతకు గురయ్యాడు. ఉన్నట్టుండి మాట పడిపోవడంతో యశోదమ్మ కంగారు పడింది. వెంటనే పక్కన ఉన్న కొడుకులు, కోడళ్లకు విషయం చెప్పింది. వారు వచ్చి ముత్తయ్యను పరిశీలించి చూడగా, అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నాడు.
గుండెపోటుతో భార్య
ముత్తయ్య మృతి చెందడంతో భార్య యశోదమ్మ తీవ్రంగా రోదించింది. జీవితాంతం తోడుంటానని చెప్పి, అంతలోనే వదిలేసి పోయావంటూ ముత్తయ్య మృత దేహంపై పడి తీవ్రంగా విలపించింది. ఓ వైపు కట్టుకున్న భర్త దూరం కావడంతో తీవ్ర మనో వేదనతో గురైంది. మరోవైపు తీవ్రంగా రోదిస్తూ అక్కడే కుప్ప కూలింది. దీంతో యశోదమ్మ గుండెపోటుకు గురైనట్టు గుర్తించిన ఆమె కొడుకులు, కోడళ్లు యశోదమ్మను హుటాహుటిన ప్రైవేటు వాహనంలో ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో ఆమెను పరీక్షించిన డాక్టర్లు.. అప్పటికే యశోదమ్మ ప్రాణాలు విడిచినట్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు.
ఒకే రోజు గంటల వ్యవధిలోనే వృద్ద దంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం ఛాయలు అలుముకున్నాయి. జీవితాంతం కలిసి బతికిన దంపతులు.. ఒకే రోజు ప్రాణాలు కోల్పోవడంతో వారిద్దరూ మరణంలోనూ ఒక్కటిగానే నిలిచారంటూ గ్రామస్థుల్లో చర్చ జరిగింది. గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులు మృతిచెందడంతో ముగ్గురు కొడుకులు, ఆమె కూతురు తీవ్రంగా విలపించారు. వారిని మృతదేహాలకు నివాళులర్పించేందుకు గ్రామస్థులంతా తరలివచ్చారు. అనంతరం గురువారం సాయంత్రం వారి స్వగ్రామం ముల్కలపల్లిలో ముత్తయ్య – యశోదమ్మ అంత్యక్రియలు పూర్తి చేశారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)