Nalgonda : కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి.. కలెక్టర్‌ను కోరిన ఎస్సై భార్య, పిల్లలు
Nalgonda : తెలంగాణ పోలీస్ శాఖలో కొందరు అధికారుల అక్రమ సంబంధాలు రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి రాగా.. తాజాగా నల్గొండ జిల్లాలో ఓ ఎస్సై భార్య కలెక్టర్ వద్దకు వచ్చింది. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పిల్లలకు, తనకు ప్రాణభయం ఉందని తెలిపింది.
తెలంగాణలో కొందరు పోలీస్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ముఖ్యంగా అక్రమ సంబంధాల వ్యవహారాలు ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నాయి. తాజాగా.. నల్గొండ జిల్లాలో ఓ ఎస్సై భార్య, పిల్లలు కారుణ్య మరణం కోసం అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. ఈ వ్యవహారం జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
బాధితురాలి వివరాల ప్రకారం..
నల్గొండకు చెందిన ఎస్సై జాల మహేందర్ ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ విభాగంలో పని చేస్తున్నారు. 2010లో నార్కట్ పల్లికి చెందిన జోతితో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. ఇటీవల మహేందర్ ఇంటికి రావడం మానేశారు. అనుమానం వచ్చి భార్య జ్యోతి ఆరాతీసింది. దీంతో అసలు విషయం బయటపడింది.
వివాహేతర సంబంధం..
ఎస్సై మహేందర్ ఓ మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు భార్యకు తెలిసింది. అందుకే తమను పట్టించుకోవడం లేదని జ్యోతి వాపోయింది. అటు తనపై ఉన్న ఆస్తులను కూడా మహేందర్ ఆ మహిళా కానిస్టేబుల్‌కు రాసిచ్చాడని జ్యోతి ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై నిలదీస్తే.. తనను, తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నారని వాపోయింది.
ఫలితం లేదు..
ఈ మొత్తం తతంగం గురించి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని.. బాధితురాలు తెలిపింది. అందుకే కలెక్టర్ వద్దకు వచ్చినట్టు వెల్లడించింది. తమకు కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని పిల్లలతో సహా వచ్చి కలెక్టరేట్ వద్ద బ్యానర్ పట్టుకొని నిరసన తెలిపింది. తమకు కారుణ్య మరణాలకు అనుమతి ఇస్తే.. అవయవాలను ప్రభుత్వ ఆసుపత్రులకు దానం చేస్తానని స్పష్టం చేసింది.
కఠినంగా ఉండాలి..
ఇటీవల పోలీస్ శాఖలో ఇలాంటి వ్యవహారాలు పెరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఓ ఎస్సై, పలువురు కానిస్టేబుళ్లు ఇలాంటి కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిపట్ల ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలనే డిమాండ్ ఉంది. తాజా ఇష్యూపై కలెక్టర్ ఎలా స్పందిస్తారో అనే చర్చ జరుగుతోంది.