ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మండల సమాఖ్యలకు బస్సులు ఇప్పించి.. వాటిని ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడిపించేందుకు అవకాశం కల్పించింది. దీని ద్వారా మండల సమాఖ్యలకు వాటి నుంచి గ్రామైక్య సంఘాలకు వీటి ద్వారా.. స్వయం సహాయక సంఘాలకు లబ్ధి జరగనుంది. మొత్తంగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు లబ్ధి చేకూరనుంది.
ఇదే కాదు.. ఇంకా చాలా నిర్ణయాలు మహిళలకు మేలు జరిగేలా ప్రభుత్వం తీసుకుంది. డ్వాక్రా గ్రూపుల్లో చేరే వయస్సు విషయంలో నిబంధనలను సడలించింది. 15 ఏళ్ల నుంచే చేరే అవకాశం కల్పించింది. అటు గరిష్ట వయస్సును కూడా 65 ఏళ్లకు పెంచింది. దీనిద్వారా మహిళలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకు లింకేజీ రుణాలు, ఇతర ఆర్థిక వనరులను కూడా డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలకు చేరవేసే ప్రయత్నం జరుగుతోంది.
రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక.. మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. వాటిల్లో మహాలక్ష్మి పథకానికి మంచి స్పందన వచ్చింది. లక్షలాది మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అలాగే గృహజ్యోతి, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల్లోనూ మహిళలకే పెద్దపీట వేస్తున్నారనే టాక్ ఉంది. ఇప్పటికే వీవోల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు. అటు రైస్ మిల్లులు కూడా మహిళలకు కేటాయిస్తామని సీఎం ప్రకటించడం మరో కీలక అంశంగా చెప్పవచ్చు.
'మహిళలు సాధికారత సాధించే వరకు, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగస్వాములయ్యే వరకు ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుంది. మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా, ఆర్థికంగా నిలబెడుతూ వ్యాపార రంగంలో నిలదొక్కుకునేలా.. రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించను' అని రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు.
మహాలక్ష్మి పథకం మహిళలకు ఉపయోగపడగా.. పురుషుల్లో అసహనం వ్యక్తం అయ్యింది. అటు రుణమాఫీ సాధ్యమైనంత వరకు చేసినా.. రైతుల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేక భావన ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మహిళలను మరింత మచ్చిక చేసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మహిళలకు సంబంధించి ఏ పథకానికి నిధుల కొరత లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి.
ఇటీవల వరంగల్ జిల్లాలో ఓ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. దీంట్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వందమంది మహిళల్లో దాదాపు 60 శాతం మంది ప్రభుత్వం పథకాలపై ఆనందం వ్యక్తం చేశారు. కానీ.. పింఛన్ తీసుకుంటున్న మహిళలు మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేక భావంతో ఉన్నారు. అలాగే పురుషుల్లో 50 శాతానికి పైగా ప్రభుత్వంపై అసహనంగా ఉన్నట్టు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు'తో చెప్పారు.
సోషల్ మీడియాలో ప్రచారం ఎలా జరిగినా.. క్షేత్రస్థాయిలో మహిళలు సంతృప్తిగానే ఉన్నారని.. ప్రభుత్వం మహిళల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయనే చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలోనూ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33 శాతం సీట్లు మహిళలకే కేటాయిస్తామని సీఎం ప్రకటించడం సంచలనంగా మారింది. దీనిపైనా మహిళల నుంచి సానుకూల స్పందన వస్తోంది.