భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తృతమైన కనెక్టివిటీని అందించేలా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను అభివృద్ధి చేశారు. ప్రధానంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడలో రద్దీని తగ్గించడానికి దీన్ని అత్యాధునికంగా తీర్చిద్దారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. అలాగే ఇక్కడి నుంచి కొన్ని రైళ్లను నడుపుతున్నారు. కానీ.. ప్రయాణికులు మాత్రం అసౌకర్యానికి గురవుతున్నారు. అందుకు కారణాలు ఇలా ఉన్నాయి.
1.చర్లపల్లి రైల్వే స్టేషన్ సిటీకి దూరంగా ఉంది. స్టేషన్ నగరం వెలుపల ఉండటంతో చేరుకోవడం కష్టంగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులు, ఆటోలు తగినంత సంఖ్యలో అందుబాటులో ఉండటం లేదని అంటున్నారు.
2.చర్లపల్లికి మెట్రో స్టేషన్లు కూడా చాలా దూరంలో ఉన్నాయి. దీంతో మెట్రోలో రావడం కూడా కష్టంగా ఉందని ప్రయాణికులు అంటున్నారు. అటు కేవలం కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ప్రైవేట్ క్యాబ్‌లు, ఆటోలు అందుబాటులో ఉండటం లేదు. ఉన్నా.. ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు.
3.చర్లపల్లికి ఏ రైలు ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బంది పడుతున్నామని.. ప్రయాణికులు చెబుతున్నారు. స్టేషన్‌కు వెళ్లే రోడ్లు సరిగా లేకపోవడంతో.. ప్రయాణం కష్టంగా ఉందని అంటున్నారు. రాత్రి వేళల్లో స్టేషన్ పరిసరాలు అంతగా సురక్షితంగా ఉండటం లేదు అనే భావన ప్రయాణికుల్లో ఉంది.
4.వెస్టర్న్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ప్రాంతాల నుంచి చర్లపల్లికి చేరాలంటే గంటన్నర.. రెండు గంటలు పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. ఆటో, క్యాబ్ ఖర్చు ట్రెన్ టికెట్ల కంటే ఎక్కువ అవుతోందని అంటున్నారు.
5.చర్లపల్లి నుంచి బయల్దేరే రైళ్లు భువనగిరి, వరంగల్ వైపు వెళుతున్నాయి. దాదాపు 18 రైళ్లు బయల్దేరి.. వివిధ ప్రాంతాలకు వెళుతున్నాయి. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ఆదిలాబాద్ నుంచి చర్లపల్లికి రైలు టికెట్ సెకండ్ సిటింగ్ రూ.175, స్లీపర్ రూ.295 ఉంది. ఆ రైలులో చర్లపల్లిలో దిగాక ఆటో, క్యాబ్‌లో తక్కువ దూరం వెళ్లాలన్నా.. రూ.300 దాకా ఖర్చు పెట్టాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. రాత్రి అయితే.. ఈ ఛార్జీలు మరీ ఎక్కువ ఉంటున్నాయని చెబుతున్నారు.
6.వరంగల్, ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రైళ్లకు బదులుగా.. ముంబయి, పుణే, బెంగళూరు వైపు వెళ్లే రైళ్లను.. చర్లపల్లి నుంచి నడిపిస్తే ప్రయోజనం ఉంటుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
7.పలు రైళ్లను చర్లపల్లి నుంచి నడపడం వల్ల సమస్యలు వస్తున్నాయని.. కొందరు ఎంపీలు సౌత్ సెంట్రల్ రైల్వే దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను గతంలో మాదిరి సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నడిపించాలని ఆదిలాబాద్ ఎంపీ కోరారు. సికింద్రాబాద్‌కు వెళ్లకపోవడం వల్ల ఆదిలాబాద్ నుంచి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారని వివరించారు.
సంబంధిత కథనం