MIM Model: మజ్లీస్ కా మోడల్ క్యా హై..?
MIM Model: గుజరాత్ నమూనాను మోదీ, ఢిల్లీ నమూనాను కేజ్రీవాల్ తమ పార్టీల విస్తరణకు ప్రచారం చేసుకుంటారు. మరి మజ్లిస్ మోడల్ ఏంటి? ఈ అంశంపై క్షేత్రస్థాయి రాజకీయ నాడీని పట్టే పీపుల్స్ పల్స్ సంస్థ ప్రతినిధి ఐవీ మురళీ కృష్ణ శర్మ పొలిటికల్ అనాలసిస్ ఇదీ..
‘‘దేశంలో ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు. కొన్ని పార్టీలు ఇంతకాలం గంపగుత్తగా ముస్లిం ఓట్లు పొందుతూ లాభపడుతున్నా, మైనార్టీలకు మాత్రం ఎలాంటి ప్రయోజనాలు చేకూరడం లేదు. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కూడా రాజకీయంగా అన్యాయం జరుగుతుంది. ఈ సామాజిక వర్గాలకు మేలు చేకూర్చేలా ఆల్ ఇండియా మజ్లీస్ ఇత్తేహాదుల్ ముస్లీమీన్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తాం...’’ అని ప్రకటిస్తూ ఆ పార్టీ అధ్యక్షులు అసదుద్ధీన్ ఓవైసీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
అసదుద్ధీన్ ఓవైసీ తాత అబ్దుల్ వాహెద్ ఓవైసీ నేతృత్వంతో 1958లో హైదరాబాద్ కేంద్రంగా ఈ పార్టీ ఆవిర్భవించింది. అసదుద్ధీన్ తండ్రి సుల్తాన్ సలాఉద్ధీన్ ఓవైసీ ఆధ్వర్యంలో బలోపేతమై, అసదుద్ధీన్ నాయకత్వంలో మరింత పటిష్టమైంది. హైదరాబాద్ పాతబస్తీలో గట్టిపట్టున్న ఈ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలనే వ్యూహంలో భాగంగా తెలుగేతర ప్రాంతాలలో మహారాష్ట్ర మొదలుకొని ప్రస్తుత గుజరాత్ ఎన్నికల వరకు పోటీపడుతోంది.
కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటోంది. దేశ వాప్తంగా పార్టీని విస్తరిస్తామంటున్న అసదుద్ధీన్ పార్టీకి పుట్టినిల్లు అయిన తెలంగాణలో మాత్రం ఒక ప్రాంతానికే పరిమితం కావడంపై విమర్శలు ఎదుర్కొంటోంది.
బీజేపీ ‘బి’ పార్టీగా ఆరోపణలు
దేశంలో నరేంద్ర మోడీ పాలన ప్రారంభమైన తర్వాత ఎంఐఎం 2014లో మహారాష్ట్రలో 24 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాలు, 2019 ఎన్నికల్లో 44 చోట్ల పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచింది. ఉత్తరప్రదేశ్‌లో 2017లో 38 స్థానాల్లో, 2022లో 5 పార్టీలతో కలిసి ‘బాగీదారీ పరివర్తన్ మోర్చా’ కూటమిని ఏర్పాటు చేసి 95 స్థానాల్లో పోటీ చేసినా ఒక స్థానం కూడా పొందలేదు. 2020లో బీహార్‌లో 20 స్థానాల్లో పోటీచేసి ఐదు గెలిచినా గత జూన్‌లో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి ఆర్జేడీలో చేరడంతో అక్కడ చతికిలపడింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా పోటీ చేసినా ఒక్క స్థానం కూడా పొందలేకపోయింది.
ఆయా రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ ఎలా ఉన్నా ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పడే ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీ గెలుపును సులభతరం చేస్తోందని లౌకికవాదులు, కాంగ్రెస్, ఆప్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఆర్జేడీ, తృణముల్ కాంగ్రెస్ వంటి పార్టీలు మండిపడ్డాయి. ఈ పార్టీలు ఇంతకాలం ముస్లిం ఓట్లతో ప్రయోజనాలు పొందాయి కానీ, ముస్లిం సామాజిక వర్గం అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదని, ముస్లింలను ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని అసదుద్ధీన్ ప్రతివిమర్శ చేశారు.
గుజరాత్లో నిరాటంకంగా సాగుతున్న బీజేపీ ప్రభుత్వానికి పరోక్షంగా మేలు చేకూర్చేలా అసదుద్ధీన్ తన అభ్యర్థులను పోటీలో దింపుతున్నారని ఇప్పుడు దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. మజ్లీస్ రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ప్రముఖ రాజకీయ పార్టీలు నష్టపోతున్నాయి. ఇదే సమయంలో ఎంఐఎం కూడా చెప్పుకోదగ్గ స్థానాలను సాధించలేదు. 2014 నుండి తెలంగాణేతర ప్రాంతాలలో ఇప్పటివరకూ 500 స్థానాలకుపైగా పోటీ చేసిన ఎంఐఎం కేవలం పది స్థానాలను మాత్రమే సాధించడం గమనార్హం.
పుట్టింట్లో పట్టు పెంచుకోరా..
దేశ వ్యాప్తంగా ముస్లింలకు ప్రతినిధిగా ఎదగాలని ఆకాంక్షతో పార్టీ విస్తరణకు పూనుకుంటున్న అసదుద్దీన్ పార్టీ పుట్టిల్లు అయిన తెలంగాణలో మాత్రం హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ నగరానికే పరిమితమైన ఈ పార్టీ ప్రత్యేక తెలంగాణలో కూడా ఎదగలేదు. ప్రత్యేక రాష్ట్రాన్ని మొదటి నుండి గట్టిగా వ్యతిరేకించిన ఎంఐఎం 2014 ఎన్నికల్లో తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్‌లో 13 స్థానాల్లో పోటీ చేయగా పాతబస్తీ పరిధిలో ఏడు స్థానాల్లో విజయం సాధించి, ఏపీలో అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది.
ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన మజ్లీస్ ఈ ఎన్నికల తర్వాత ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పంచన చేరింది. ఈ రెండు పార్టీల అంతర్గత అవగాహనతో 2018 ఎన్నికల్లో ఎంఐఎం కేవలం 8 చోట్లనే పోటీ చేసి తన ఏడు స్థానాలను నిలబెట్టుకుంది. ఈ ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణకు వివిధ రాష్ట్రాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన మజ్లీస్ తెలంగాణలో మాత్రం 2014 కంటే 2018లో తక్కువ స్థానాల్లో పోటీ చేయడం విమర్శలకు తావిచ్చింది.
20 నుండి 30 వేల వరకు ముస్లిం ఓట్లున్న నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ పోటీ చేయలేదు. 10% ముస్లింలు ఉన్న వివిధ రాష్ట్రాల్లో పోటీకి ఉత్సాహం చూపుతున్న ఎంఐఎం తెలంగాణలో దాదాపు 12 శాతానికిపైగా ముస్లిములు ఉన్నా పాతబస్తీకే పరిమితమైంది. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ముథోల్, నిర్మల్, సిర్పూర్, కరీంనగర్, కోరుట్ల, మహబూబ్‌నగర్, జహీరాబాద్, వికారాబాద్, షాద్‌నగర్, నిజామాబాద్ అర్బన్, బోధన్, కామారెడ్డి, మెట్పల్లి, జగిత్యాల, సంగారెడ్డి, రాజేంద్రనగర్ తదితర నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్నా ఎంఐఎం ఇక్కడ పోటీపై ఆసక్తి కనబర్చలేదు.
దీంతో రాష్ట్రంలో ఒకప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించిన మజ్లీస్ ఇప్పుడు టిఆర్ఎస్కు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటుందనే వాదనకు మరింత బలం చేకూరింది. ఈ వాదలను కొట్టిపారేస్తున్న ఎంఐంఎం రాష్ట్రంలో 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ బలపడుతోందని, సొంతగడ్డపై బీజేపీని అడ్డుకునే విధంగా వ్యవహరించాల్సి ఉంటుందని తన నిర్ణయాలను సమర్థించుకుంటోంది. టీఆర్ఎస్ కన్నా ముందు ఎంఐఎంకు సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ పార్టీతో సయోధ్య ఉండేది. పరస్పర ప్రయోజనాలు కాపాడుకుంటూ అభ్యర్థులను పోటీకి దింపేది. మైనార్టీ ఓట్లు కోరుకున్న చోట కాంగ్రెస్‌కు మజ్లీస్ సహకరించేది. కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా వున్నప్పుడు ఈ సఖ్యత బెడిసింది.
గ్రేటర్‌లోనూ పాతబస్తీకే పరిమితం...
ఎంఐఎం పార్టీ నగరంలో కూడా పాతబస్తీకి, అక్కడి శివారు ప్రాంతాలకే పరిమితమైంది. 2016లో జరిగిన జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో 150 స్థానాలకుగాను 60 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం 44 స్థానాలు గెలవగా, 2020 ఎన్నికల్లో 51 చోట్ల మాత్రమే పోటీచేసి 44 సీట్లు సాధించింది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తామంటున్న అసదుద్ధీన్ గ్రేటర్లో కనీసం సగం స్థానాల్లో కూడా పోటీ చేయకపోవడం గమనార్హం. పట్టున్న స్థానాల్లోనే పోటీ చేస్తూ ముస్లింలు నిర్ణయాత్మకంగా ఉన్న రిజర్వుడు స్థానాల్లో ముస్లిమేతర అభ్యర్థులను భరిలోకి దింపి లబ్ది పొందుతోంది. ముస్లింలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను కలుపుకొని పార్టీని విస్తరిస్తామని చెబుతున్న ఎంఐఎం నగరంలోనూ ఒక ప్రాంతానికే పరిమితమవడం ఆ పార్టీ ముస్లిమేతర స్థానాలలో ప్రాబల్యం పొందడంలేదని చెప్పడానికి నిదర్శనంగా మిగులుతుంది.
పాతబస్తీని మోడల్‌గా చూపలేరా..?
ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ మోడల్‌ను ఆదర్శంగా ప్రచారం చేశారు. ఆప్ నేత కేజ్రీవాల్ ఢిల్లీి మోడల్‌ను చూపుతూ పంజాబ్‌లో అందలమెక్కి, ఇతర రాష్ట్రాల్లో విస్తరించడానికి ముందుకెళ్తున్నారు. దేశ వ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్న మజ్లీస్‌కు ఎలాంటి మోడల్ ఉంది..? నాలుగు దశాబ్దాలుగా పట్టునిలుపుకుంటున్న చారిత్రాత్మక కట్టడాలకు నెలవైన పాతబస్తీ అభివృద్ధిని ఎందుకు ఆదర్శంగా చూపించలేకపోతుంది...? పాతబస్తీపై ప్రభుత్వాలన్నీ వివక్షను చూపుతున్నాయని విమర్శించే మజ్లీస్ వాటితోనే ఎందుకు అంటకాగుతోంది...? ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి వరకూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా ఎంఐంఎంతో స్నేహపూర్వకంగా ఉండేందుకు ప్రాధాన్యతనిస్తాయి కానీ, ఆ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్న పాతబస్తీ పురోగతిని పట్టించుకోవడం లేదు.
ముస్లింల అభివృద్ధే లక్ష్యంగా ఎంఐఎం కృషి చేస్తుందని ఆ పార్టీ ఢంకా బజాయిస్తున్నా 70 శాతానికి పైగా ముస్లింలున్న పాతబస్తీలో అభివృద్ధి ఏమేరకు జరిగిందో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తేటతెల్లమవుతుంది. ఉపాధి, పారిశ్రామిక, వైద్య, విద్య, ఐటి, పర్యాటక రంగాలకు సంబంధించిన యూనిట్లను పాతబస్తీలో ఏర్పాటు చేయాలనే అంశంపై ఎంఐఎం పోరాడిన సందర్భాలు కనిపించవు. అక్కడ రోడ్ల విస్తరణ లేక ట్రాఫిక్ పద్మావ్యూహాన్ని తలపిస్తుంటుంది. పాతబస్తీలో అభివృద్ధికి సంబంధించి ఒక ఉదాహరణ తీసుకుంటే గ్రేటర్లో మెట్రో రైలు పనులు అన్ని వైపులా పూర్తయినాయి. ప్రభుత్వం ఇప్పుడు రెండో దశ పనులకు పూనుకుంటున్నా, మొదటి దశలోనే పాతబస్తీ వైపు ప్రతిపాదించిన పనులను ఇప్పటికీ ప్రారంభించకపోవడం ప్రధానాంశం. ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందితే అక్కడి ప్రజల జీవనోపాధి మెరుగవుతుంది.
పాతబస్తీలో పౌరులు నాలుగు దశాబ్దాలకుపైగా ఒకే పార్టీకి పట్టం గడుతున్నా ఆ ప్రాంతం వెనుకబడి ఉండడం అక్కడి ప్రజాప్రతినిధుల వైఫల్యమే. దేశ వ్యాప్తంగా ముస్లింలకు ప్రతినిధులుగా గుర్తింపు పొంది వారి జీనవ విధానంలో మార్పుకు కృషి చేస్తామని చెబుతున్న ఎంఐఎం చారిత్రాత్మక పాతబస్తీని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి, ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దితే ఇతర ప్రాంతాల ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుంది. లేకపోతే ఎంఐఎం పార్టీ మైనార్టీల మనోభావాలపైనే ఆధారపడుతుందని, స్వార్థపూరితమైన రాజకీయాలతోనే మనుగడ సాగిస్తుందనే అపవాదును మూటగట్టుకోవాల్సి ఉంటుంది.
- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ
(డిస్‌క్లెయిమర్: రచయిత ఐవీ మురళీకృష్ణ శర్మ పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి. ఇక్కడ ప్రచురితమైన అభిప్రాయాలు, విశ్లేషణలు ఆయన వ్యక్తిగతం. లేదా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పీపుల్స్ పల్స్వి హెచ్‌టీ తెలుగువి కావు..)