KCR National Politics: ఆ ర్యాలీకి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు..?-why kcr did not go to the opposition rally at haryana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Why Kcr Did Not Go To The Opposition Rally At Haryana

KCR National Politics: ఆ ర్యాలీకి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు..?

Mahendra Maheshwaram HT Telugu
Sep 28, 2022 09:53 AM IST

kcr national politics: ఓవైపు రాష్ట్రంలో మరోసారి పవర్ లోకి వచ్చేందుకు పావులు కదిపేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... మరోవైపు జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీపై కూడా అదేస్థాయిలో ఫోకస్ చేస్తున్నారు. అయితే తాజాగా విపక్షాలు తలపెట్టిన ఓ ర్యాలీకి వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో)
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో) (twiiter)

కేసీఆర్.... ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో... ఎక్కడ తగ్గుతారో... ఎక్కడ నెగ్గుతారో అనేది ఆసక్తికరంగానే ఉంటుంది. ఆయన వేసే అడుగులు కూడా...అంత ఈజీగా అంతుచిక్కవనే చెప్పొచ్చు. అయితే గత కొంతకాలంగా ఆయన చేస్తున్న కామెంట్స్, ఇస్తున్న నినాదాలు కూడా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలోనూ కొత్త పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ అంటూ కొద్దిరోజులుగా ఢిల్లీవైపు అడుగులు వేస్తున్నారు. సౌత్, నార్త్ ఇండియా పర్యటనలు కూడా చేశారు. అయితే తాజాగా ప్రతిపక్షాలు భారీ ర్యాలీని తలపెట్టాయి. అయితే ఇందుకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. అంతేకాదు పార్టీ తరపున కూడా ఎవర్నీ పంపలేదు. ఇప్పుడు ఈ పరిణామామే హాట్ టాపిక్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

opposition rally at haryana: తాజాగా బీజేపీ వ్యతిరేక పార్టీలు హర్యానా వేదికగా భారీ ర్యాలీని తలపెట్టాయి. హర్యానా దివంగత సీఎం దేవీలాల్ జయంతిని 'సమ్మాన్ దివస్' పేరుతో సెప్టెంబరు 25న ఫతేబాద్ లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీజేపీని వ్యతిరేస్తున్న పలు ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే వేదిక మీదకు తెచ్చే ప్రయత్నాలకు ఐఎన్ఎల్డీ శ్రీకారం చుట్టింది. ఈ ర్యాలీకి టీఆర్ఎస్, టీఎంసీ, టీడీపీతో పాటు పలు ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానం పంపారు ఐఎన్ఎల్డీ నేత ఓం ప్రకాష్ చౌతాలా. ఈ ర్యాలీకి హాజరైన వారు ప్రాంతీయ పార్టీల కూటమి గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ నీతీష్ కుమార్, తేజస్వి లాంటి వాళ్లు మాత్రం బీజేపీ వ్యతిరేకంగా కూటమి ఉంటుందని.. అందులో కాంగ్రెస్ ఉంటుందని తేల్చి చెప్పేశారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేకంగా కూటమి ఉండకపోవచ్చని అర్థం అవుతుంది.

అయితే బీజేపీ విధానాలకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్...ఈ ర్యాలీకి హాజరవుతారని అందరూ భావించారు. కానీ ఆయన వెళ్లలేదు. కనీసం పార్టీ తరపున కూడా ఎవర్నీ పంపలేదు. ఈ పరిణామమే చర్చనీయాంశంగా మారింది. దసరాకు జాతీయ పార్టీ లేదా వేదిక పెట్టాలని కేసీఆర్ చాలా కాలంగా కసరత్తు మొదలుపెట్టిన కేసీఆర్.. కాస్త వెనక్కి తగ్గారనే చర్చ మొదలైంది. హర్యానా ర్యాలీకి వెళ్లకపోవడమే బలం చూకురుస్తోంది. జాతీయ రాజకీయ పరిణామాల కారణంగా కేసీఆర్ ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. నితీశ్, లాలూ వంటి నేతలు సోనియాగాంధీతో భేటీ అవ్వటం కూడా గులాబీ బాస్ ను వెనక్కి తగ్గేలా చేస్తున్నాయనే చర్చ కూడా ఉంది. కలిసి వచ్చే నేతలెవరూ కనిపించకపోవడం...వచ్చినా కాంగ్రెస్ ప్రస్తావన తీసుకువస్తుండటం డైలామాలో పడేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ హర్యానా ర్యాలీకి వెళ్లలేదా...? లేదా ఇంతకుముందు వార్తలు వచ్చినట్లే దసరా తర్వాత పక్కాగానే పార్టీని ప్రకటిస్తారా..? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు కాంగ్రెస్ - టీఆర్ఎస్ మధ్య దోస్తీకి బీజం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయనే చర్చ కూడా ఓవైపు నుంచి వస్తోంది. అయితే ఈ వార్తలను టీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్