TG MLC elections : యుద్ధం చేస్తారా.. ఊరుకుంటారా.. ఎమ్మెల్సీ ఎన్నికపై కేసీఆర్ మౌనం ఎందుకు?
TG MLC elections : కేసీఆర్.. రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట. కానీ ఇటీవల సైలెంట్‌గా ఉంటున్నారు. కారణాలు ఏంటో ఎవరికీ తెలియదు. కానీ.. నాయకులు మాత్రం అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోంది. బాస్ ఏం చెప్పడం లేదు.. ఏం చేద్దామని చర్చించుకుంటున్నారు.
త్వరలో తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికపై.. అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఇక్కడి నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు బీజేపీ ఈ సీటుపై కన్నేసింది. కానీ బీఆర్ఎస్ మాత్రం మౌనంగా ఉంది. పార్టీ నుంచి, కేసీఆర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో నేతలు అయోమయంలో ఉన్నారు.
ఎటూ తేల్చడం లేదు..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు. మూడో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత వరంగల్- నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. దాంట్లోనూ బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో.. కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ ఎమ్మెల్సీ ఎన్నిక తెరపైకి వచ్చింది. దీనిపైనా కేసీఆర్ ఎటూ తేల్చడం లేదు. పోటీ చేయబోతున్నామని గానీ.. చేయడం లేదని గానీ చెప్పడం లేదు.
క్షేత్రస్థాయిలో హస్తం.. కమలం..
అటు బీజేపీ, కాంగ్రెస్ మాత్రం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి. ఒక్క బీఆర్ఎస్ పార్టీనే క్షేత్రస్థాయిలో వర్క్ చేయడం లేదనే టాక్ ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ.. అధినేత నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో.. సైలెంట్‌గా ఉంటున్నారు. బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది.
పోటీ చేయకపోతే ఎలా..
అయితే.. ఈ ఎన్నికల ప్రభావం త్వరలో జరగబోయే స్థానిక సంస్థలపై ఎన్నికలపై పడుతుందనే చర్చ బీఆర్ఎస్‌లో జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవేళ ఓడిపోతే.. పంచాయతీ ఎన్నికలపై ప్రభావం చూపి.. ఆశించిన ఫలితాలు రావని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్టు నేతలు చెబుతున్నారు. కానీ.. అసలు పోటీ చేయకపోతే అస్త్ర సన్యాసం చేసినట్టు అవుతుందని కేసీఆర్ వద్ద కొందరు నేతలు అన్నట్టు తెలిసింది.
మౌనం ఎందుకు..
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని.. బీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచినా పార్టీలో ఉంటారనే గ్యారంటీ లేదు. అభివృద్ధి కోసమంటూ అధికార పార్టీలో చాలామంది చేరతారు. ఇవన్నీ తెలిసినా కేసీఆర్ ఈ ఎన్నికపై ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని కారు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
పార్టీకి మరింత ప్రమాదం..
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా 100 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని కేటీఆర్ గట్టిగా చెప్పారు. కానీ ఈ ఎన్నికపై ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్, బీజేపీ ప్రశ్నిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే.. బీఆర్ఎస్ పట్టు ప్రజల్లో ఎలా ఉందో తెలుస్తుంది. పోటీ చేయకపోతే బీఆర్ఎస్ భయపడిందని రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేస్తారు. అప్పుడు క్యాడర్‌లో నమ్మకం సన్నగిల్లుతుంది. ఇది పార్టీకి మరింత ప్రమాదం.
కొనసాగుతున్న సస్పెన్స్..
ఫలితాలు ఎలా వచ్చినా పర్లేదు.. పోటీ చేయాలని మెజార్టీ నేతలు కేసీఆర్ వద్ద అన్నట్టు తెలిసింది. ఫలితాలు ఆశించిన స్థాయిలో వస్తే.. శ్రేణుల్లో ఊపు వస్తుంది. మరింత గట్టి ఫైట్ చేయొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఒకవేళ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోతే.. లోపం ఎక్కడుందో సరిచేసుకునే అవకాశం ఉంటుందని నేతలు అన్నట్టు తెలిసింది. అయినా కేసీఆర్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చూడాలి మరి గులాబీ దళపతి ఏ నిర్ణయం తీసుకుంటారో.