KCR Comments on CBN : చంద్రబాబు మళ్లీ తెలంగాణకు వస్తారా.. కేసీఆర్ మాటలకు అర్థం ఏంటి?-why did kcr target ap cm chandrababu naidu again ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr Comments On Cbn : చంద్రబాబు మళ్లీ తెలంగాణకు వస్తారా.. కేసీఆర్ మాటలకు అర్థం ఏంటి?

KCR Comments on CBN : చంద్రబాబు మళ్లీ తెలంగాణకు వస్తారా.. కేసీఆర్ మాటలకు అర్థం ఏంటి?

KCR Comments on CBN : గులాబీ దళపతి కేసీఆర్.. మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి కట్టకుండా ఉంటే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చేవారు కాదని వ్యాఖ్యానించారు. అలాగే.. ఆయన తెలంగాణకు రావాలని కొంతమంది కొరుకుంటున్నారని చెప్పారు. దీంతో చంద్రబాబు మళ్లీ తెలంగాణకు వస్తారా అనే చర్చ జరుగుతోంది.

కేసీఆర్

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏది మాట్లాడినా.. అది సంచలనమే. తాజాగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సంపద మీద గుంట నక్కల్లాగా అందరూ కన్నేశారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. చంద్రబాబు విజయం, ఎన్డీయే కూటమి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

చంద్రబాబు రావాలట..

'తెలంగాణలో ఇప్పుడు ఉన్న పాలకులు సరిగా పని చేస్తలేరట. మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని కొన్ని పత్రికలు రాస్తున్నా యి. కూటమి కట్టకుండా చంద్రబాబు ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేవాడా. అలాంటి వారిని ఏవో అద్భుత శక్తులు ఉన్నవారిగా మనకు చూపే కుట్రలు జరుగుతున్నాయి' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియాలో వార్..

'తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసేందుకు కొందరు రెడీగా ఉంటారు. వారిపట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలి. ఒక పొరపాటు జరిగినా జీవితకాలం దుఃఖం తప్పదు' అని కేసీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ చేసిన ఈ కామెంట్స్‌పై టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. 'లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు.. మీకు చంద్రబాబు గురించి ఎందుకు' అని ప్రశ్నిస్తున్నారు. ఇటు గులాబీ సైన్యం కూడా ధీటుగా సమాధానం ఇస్తోంది. 'ఫస్ట్ మీ రాజధాని ఏంటో చూసుకోండి.. ఆ తర్వాత కేసీఆర్ గురించి మాట్లాడండి' అని కౌంటర్ ఇస్తున్నారు.

కేసీఆర్ ఎందుకలా అన్నారు..

టీడీపీని మళ్లీ తెలంగాణలో యాక్టివ్ చేస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో టీడీపీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఫలితాల ఆధారంగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. కేసీఆర్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. కామెంట్స్ చేశారని తెలుస్తోంది.

చంద్రబాబునే ఎందుకు..

ఇప్పుడే కాదు.. గతంలో 2018, 2023 ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019కి ముందు చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని వ్యాఖ్యానించారు. అప్పుడు జగన్‌కు కేసీఆర్ సపోర్ట్ చేశారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు తెలంగాణ రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు టీడీపీ యాక్టివ్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబును కేసీఆర్ టార్గెట్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

చంద్రబాబు తెలంగాణకు వస్తారా..

కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో.. చంద్రబాబు మళ్లీ తెలంగాణకు వస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై తెలంగాణ టీడీపీకి చెందిన ఓ నాయకుడితో 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు' ప్రతినిధి మాట్లాడారు. 'చంద్రబాబు ఏపీని వదిలి తెలంగాణకు రావడం కష్టమే. కానీ.. ఇక్కడ జనసేన, బీజేపీతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ విషయంపై స్పష్టత వస్తుంది. పార్టీని ముందుకు తీసుకెళ్లడం గురించి చంద్రబాబు సలహాలు ఇస్తారు. లోకేష్‌ను తెలంగాణ పార్టీ బాధ్యతలు చూడాలని కోరాం. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత.. బీజేపీతో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాం' అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.