KCR Strategy : ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఎందుకు ప్లాన్ చేస్తోంది?-why brs is planning a huge public meeting in february ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr Strategy : ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఎందుకు ప్లాన్ చేస్తోంది?

KCR Strategy : ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఎందుకు ప్లాన్ చేస్తోంది?

KCR Strategy : కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. కానీ ఏడాది పాటు కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఎక్కడా ఏం మాట్లాడలేదు. స్పందించాలని కేసీఆర్‌పై ఒత్తిడి ఉండేది. రెస్పాండ్ అవ్వలేదు. తాజాగా కేసీఆర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను రంగంలోకి దిగితే తట్టుకోవడం సులభం కాదని వార్నింగ్ ఇచ్చారు.

కేసీఆర్

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు ఏడాది కాలంగా మౌనంగా ఉన్న కేసీఆర్.. తాజాగా కీలక కామెంట్స్ చేశారు. శుక్రవారం గజ్వేల్ సమీపంలోని తన ఫామ్‌హౌస్‌లో జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్‌పై కన్నెర్ర చేశారు.

సోషల్ మీడియాలో పోల్..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పెద్ద ఎత్తున అసంతృప్తిని కూడగట్టుకుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణగా.. సోషల్ మీడియా పోల్‌ను ఆయన గుర్తుచేశారు. నెటిజన్లు ఏ ప్రభుత్వాన్ని ఎంచుకుంటారని అడిగిన ప్రశ్నకు.. కొన్ని వేల మంది సమాధానం ఇచ్చారని.. వారు 'ప్రజా పలాన పాలన' కంటే 'ఫామ్‌హౌస్ పాలన'ను ఎంచుకున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

నాపై ఒత్తిడి ఉంది..

ప్రతి రంగంలోనూ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయని గులాబీ పార్టీ చీఫ్ విమర్శించారు. ప్రభుత్వ పనితీరుపై తాను మౌనం పాటిస్తున్నానని.. కానీ పార్టీ శ్రేణుల నుంచి తనపై ఒత్తిడి ఉందని వివరించారు. "ఫిబ్రవరి నెలాఖరులో బహిరంగ సభ నిర్వహించి.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం" అని కేసీఆర్ కారు పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. కేసీఆర్ విమర్శల కంటే.. ఈ బహిరంగ సభ కామెంట్స్‌పై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్‌లో చర్చ..

ఫిబ్రవరి నెలాఖరులో బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేయడానికి కారణాలు ఏంటనే చర్చ బీఆర్ఎస్‌లో జరుగుతోంది. ఇదే అంశంపై 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు' బీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరితో మాట్లాడింది. అప్పుడు ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆయన మాటల్లో.. 'ఫిబ్రవరిలో బహిరంగ సభపై ప్రకటన వెనుక కేసీఆర్ వ్యూహం ఉంది. గతంలో పార్టీ నాయకులతో కేసీఆర్ చాలాసార్లు మాట్లాడారు. కానీ.. ఎప్పుడు ఇలాంటి ప్రకటన చేయలేదు' అని ఆ బీఆర్ఎస్ నేత వివరించారు.

క్షేత్రస్థాయికి కేసీఆర్..

'ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు. ఈ ఎన్నికల కోసం కార్యకర్తలు పనిచేయాలంటే కేసీఆర్ క్షేత్రస్థాయికి రావాలని పార్టీ నేతలం కోరాం. సమీక్షలు, సమావేశాలు కాకుండా.. భారీ బహిరంగ సభ పెడితే బాగుంటుందని చాలామంది నేతలు కేసీఆర్ వద్ద ప్రస్తావించారు. దానికి ఆయన కూడా అంగీకరించారు. ఇటు ప్రభుత్వంపైనా ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షంగా వీటిపై మేం మాట్లాడుతున్నా.. కేసీఆర్ మాట్లాడితే వేరేలా ఉంటుంది. అందుకే ఫిబ్రవరిలో బహిరంగ సభను నిర్వహించడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది' అని ఆ పార్టీనేత చెప్పారు.

సమయం ఇద్దామన్నారు..

'గతంలోనే వివిధ అంశాలపై స్పందించాలని మేం కేసీఆర్‌ను కోరాం. కానీ.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని ఆయన మాతో చెప్పారు. అందుకే ఏడాది కాలంగా మౌనంగా ఉన్నారు. ఏడాది గడిచినా కాంగ్రెస్ హామీలు అమలు చేయడం లేదు. పైగా కేసీఆర్‌ను కాంగ్రెస్ నేతలు వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నారు. వాటికి కౌంటర్ ఇవ్వకపోతే క్యాడర్ అసంతృప్తిగా ఫీల్ అవుతోంది. అందుకే ఫిబ్రవరి సభలో కేసీఆర్ ఉగ్రరూపం చూస్తారు' బీఆర్ఎస్ నేత 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు' ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.