పేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా.. రేవంత్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇళ్ల నిర్మాణానికి అనుమతి పత్రాలు పొందిన 47 వేల 235 మంది లబ్ధిదారుల్లో.. ఇప్పటివరకు కేవలం 17 వేల 982మంది మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారు. కొందరు అసలు తమకు ఇళ్లు వద్దని చెబుతున్నారు. సిమెంట్, ఇటుక, స్టీలు వంటి వాటి ధరలు భారీగా పెరగడంతో.. లబ్ధిదారులు పనులు ప్రారంభించేందుకు ముందుకు రావడం లేదు.
ఇంటి నిర్మాణం మొదలుపెట్టాలంటే.. కొంత మొత్తంలో అయినా డబ్బు అవసరం. బేస్‌మెంట్ వరకు కట్టాలంటే కనీసం లక్షా యాభైవేల వరకు ఖర్చవుతుంది. బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తయ్యాకే లక్ష రూపాయల బిల్లు వస్తుంది. అయితే.. తొలుత లక్షన్నర పెట్టుబడి పెట్టి పనులు ప్రారంభించడం పేదలకు కష్టమవుతోంది. అప్పుచేసి చేసి నిర్మాణం ప్రారంభిద్దామనుకున్నా.. బిల్లులు వస్తాయో, రావోననే ఆందోళన చాలామందిలో ఉంది.
ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్న లబ్ధిదారులు.. 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. ఇంత చిన్న ఇల్లు కట్టుకుంటే ప్రయోజనం ఏంటనే అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. పిల్లలకు, ఏదైనా ఫంక్షన్లు అయినా అసౌకర్యంగా ఉంటుందనే భావనలో ఉన్నారు. కానీ.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 600 చదరపు అడుగులకు మించి ఇల్లు కట్టుకుంటే.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిగా పరిగణించరని అధికారులు చెబుతున్నారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు.. మంజూరు పత్రం తీసుకున్న 45 రోజుల్లోపు ఇంటికి అవసరమైన మెటీరియల్.. అంటే స్టీలు, సిమెంట్, ఇటుక, ఇసుక, కిటికీలు, తలుపులు సమకూర్చుకోవాలి. ఈ నిబంధన ఇబ్బందికరంగా ఉందని లబ్ధిదారులు చెబుతున్నారు. మార్క్ అవుట్ ఇచ్చాక.. 90 రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇదీ సమస్యగానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మంజూరు పత్రాలను కూడా వెనక్కి ఇచ్చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ముచ్చర్ల గ్రామాన్ని తొలి విడత పైలెట్ గ్రామంగా ఎంపిక చేశారు. మొత్తం 94 మంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. వీరిలో 56 మంది తమకు ఇల్లు వద్దంటూ మంజూరు పత్రాలు వెనక్కి ఇచ్చేశారు. నిర్మాణం ప్రారంభించేందుకు తమ వద్ద డబ్బులు లేని కారణంగానే మంజూరు పత్రాలను వెనక్కి ఇచ్చామని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పైలెట్ గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది.
సంబంధిత కథనం