ఇందిరమ్మ ఇండ్ల 'విస్తీర్ణం'పై ఆంక్షలు ఎందుకు? 10 ముఖ్యమైన అంశాలు-why are there restrictions on the construction of indiramma houses 10 key points ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇందిరమ్మ ఇండ్ల 'విస్తీర్ణం'పై ఆంక్షలు ఎందుకు? 10 ముఖ్యమైన అంశాలు

ఇందిరమ్మ ఇండ్ల 'విస్తీర్ణం'పై ఆంక్షలు ఎందుకు? 10 ముఖ్యమైన అంశాలు

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. గతంలో 350 చదరపు అడుగులకు తగ్గకుండా.. ఎంత విస్తీర్ణంలో అయినా కట్టుకోవచ్చని ప్రభుత్వ స్పష్టం చేసింది. కానీ.. తాజాగా 600 చదరపు అడుగులు దాటొద్దనే నిబంధన విధించింది. ఈ నిబంధన విధించడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందిరమ్మ ఇంటి నమూనాతో సీఎం

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్ని విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాలు అనుకూలంగానే ఉన్నా.. ఇంటి నిర్మాణ వైశాల్యాన్ని కుదిస్తూ.. అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తొలుత 350 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చని ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా 600 చదరపు అడుగులకు మించొద్దని.. ఒకవేళ మించితే ఇంటి నిర్మాణం ప్రారంభమైనా రద్దు చేస్తామని స్పష్టం చేసింది.

కేంద్ర నిబంధనలే కారణం..

అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర నిబంధనలే కారణమని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇండ్ల నిర్మాణం లేకుంటే ఆర్థిక సాయం అందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన 10 అంశాలు ఇలా ఉన్నాయి.

10 ముఖ్యమైన అంశాలు..

1.పేదలకు మాత్రమే ఇండ్లు మంజూరయ్యేలా కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై నిబంధనలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుంది. పీఎంఏవై (అర్బన్‌), పీఎంఏవై (గ్రామీణ్‌) పేరుతో రెండు విధాలుగా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తుంది.

2.గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో యూనిట్‌కు రూ. 1.2 లక్షలు, కొండ ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు రూ.1.3 లక్షల చొప్పున కేంద్రం సాయం చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 2.5 లక్షల వరకు ఆర్థికసాయం అందిస్తుంది.

3.అర్బన్‌ ఏరియాలో అయితే ఇంటి వైశాల్యం 30 చదరపు మీటర్లు, గరిష్ఠంగా 45 చదరపు మీటర్లు మించొద్దు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వైశాల్యం 25 చదరపు మీటర్లకు తగ్గకుండా ఉండాలన్నది నిబంధన. ఇంతకంటే ఎక్కువ వైశాల్యంలో నిర్మించాలనుకుంటే.. కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

4.ఇంటి నిర్మాణ విస్తీర్ణానికి సంబంధించి గతేడాది చివర్లోనే కేంద్రం స్పష్టమైన నిబంధనలు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిని గుర్తించకుండా ఎంత వైశాల్యంలోనైనా నిర్మించుకోవచ్చని మొదట చెప్పినట్టు తెలిసింది.

5.రాష్ట్రంలో మొదటి విడత ఇండ్ల నిర్మాణం మొదలయ్యాక.. కేంద్ర సాయం కోసం దరఖాస్తు చేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలు చూసుకుని జరిగిన పొరపాటును గుర్తించింది.

6.ఈ ఏడాది 4.5 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటి వరకు 72 వేల 45 ఇండ్లను మంజూరు చేసింది. ఇందులో చాలావరకు గ్రౌండ్‌ అయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం.. పునాదులు పూర్తయ్యాక మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ విడుదల చేయాల్సి ఉంది.

7.కొన్ని ఇండ్లు 600 చదరపు అడుగులకన్నా అధికంగా ఉండటంతో.. వాటికి కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం లేదు. అదనపు వైశాల్యంలో నిర్మించుకున్న ఇండ్లను రద్దుచేయాలా? లేక కేంద్రంతో సంబంధం లేకుండా రూ. 5 లక్షలు మొత్తం ఇవ్వాలా? అన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

8.గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే.. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం అధికంగా నిధులు విడుదల చేస్తుంది. గృహ నిర్మాణ పథకంలో కూడా పట్టణ ప్రాంతాల్లో ఒక్కో యూనిట్‌కు రూ. 2.5 లక్షలుగా ఆర్థిక సాయం అందిస్తుంది.

9.రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి మొత్తం 147 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ, వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, రామగుండం, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, ఖమ్మం తదితర 15 మున్సిపల్‌ కార్పొరేషన్లు కాగా.. 131మున్సిపాలిటీలు ఉన్నాయి.

10.పీఎంఏవై(అర్బన్‌)లో భాగంగా ఈ ప్రాంతాల్లో మంజూరయ్యే ఇండ్లకు ఒక్కో యూనిట్‌కు రూ. 2.5 లక్షల చొప్పున సాయం అందుతుంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణాల్లో నిర్మించే ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వంపై తక్కువ భారం పడుతుంది.

సంబంధిత కథనం