TG Inter Students : ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల వైఖరే విద్యార్థులకు శాపంగా మారుతోందా? ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది?
TG Inter Students : పరీక్షలు దగ్గరపడుతున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమయంలో భరోసా ఇవ్వాల్సిన ప్రైవేట్ కాలేజీల సిబ్బంది.. దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఒత్తిడి పెంచుతున్నారు. ఫలితంగా బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇందుకు కారణాలు ఏంటో ఓసారి చూద్దాం.

హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో దాదాపు 150 వరకు ప్రైవేటు, కార్పొరేట్ ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువ రెసిడెన్షియల్ విధానంలోనే నడుస్తున్నాయి. చాలా కాలేజీల్లో సిబ్బంది చదువు పేరుతో విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. దూషిస్తూ కొడుతున్నారని విద్యార్థులు వాపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
వేధింపులు భరించలేక..
వేధింపులు భరించలేక కొందరు విద్యార్థులు మధ్యలోనే ఇంటికి వచ్చేస్తున్నారు. మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ రెండు నెలల్లో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగించే అంశం. బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు ప్రాణాలు తీసుకుంటున్నా.. సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
రోజుకు 18 గంటలు..
చాలా కాలేజీలు తమ విద్యా సంస్థలకు పేరు రావడానికి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా హాస్టళ్లలో చదివే విద్యార్థులు రోజుకు 16 నుంచి 18 గంటలు పుస్తకాలతోనే కుస్తీ పడుతున్నారు. ఉదయం 4 గంటలకే నిద్రలేపుతున్నారు. మళ్లీ రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్స్ ఉంటున్నాయి. రెగ్యులర్ క్లాసులు సాయంత్రం 5.30 వరకు ఉంటున్నాయని.. మళ్లీ 6 నుంచి స్టడీ అవర్స్ ఉంటున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.
కొన్ని ఘటనలు..
మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో మార్కులు ఆశించినంత రావడం లేదని కౌశిక్ రాఘవ్ అనే విద్యార్థి గతేడాది నవంబర్‌లో సూసైడ్ చేసుకున్నాడు. ఇటు నిజాంపేట్‌లోని మరో కాలేజీలో చదివే ప్రజ్ఞారెడ్డి భయంతో ఆత్మహత్య చేసుకుంది. అదే నిజాంపేట్‌లోని మరో కార్పొరేట్ కాలేజీలో జశ్వంత్ గౌడ్ అనే విద్యార్థి.. సిబ్బంది వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు బయటకు రానివి ఎన్నో ఉన్నాయి.
తనిఖీలు ఏవీ..
ప్రైవేట్ కాలేజీలు, హాస్టళ్లలో ఇంటర్ విద్యార్థులపై చదువు పేరుతో ఒత్తిడి చేస్తే.. కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు చెబుతున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా వారితో మాట్లాడాలని కాలేజీల నిర్వాహకులకు ఆదేశాలు జారీచేశారు. కానీ.. తనిఖీలు మాత్రం నిర్వహించడం లేదు. ఇప్పటికైనా ఇంటర్ బోర్డ్ అధికారులు ప్రైవేట్ కాలేజీల్లో తనిఖీలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
టెలి మానస్..
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలన్న ఆలోచనతో ‘టెలి-మానస్’ (టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండర్ నెట్‌వర్కింగ్ అక్రాస్ ది స్టేట్స్) సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా విద్యార్థులకు సైకాలజిస్టులు లేదా కౌన్సిలర్ల సేవల అందుతాయి.
డయల్ 14416..
ఇంటర్ పరీక్షల వేళ మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు ‘టెలి-మానస్’కు కాల్ చేసి నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇందుకోసం వైద్యారోగ్యశాఖకు చెందిన టెలీ మానస్ సేవలను ఉచితంగా వినియోగించుకొవచ్చని సూచించింది. విద్యార్థులు 14416 లేదా 1800914416 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సూచించారు.