రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా.. ఈ బైపోల్ తో మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్… ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి... జనంలోకి వెళ్తున్నాయి. అయితే బీజేపీ నుంచి ఎవరు అభ్యర్థిగా ఉంటారనేది తేలాల్సి ఉంది.
బీజేపీకి ఈ ఉపఎన్నిక ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. గ్రేటర్ పరిధిలో ఆ పార్టీకి కార్పొరేటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో… జూబ్లీహిల్స్ లో జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకెల దీపక్‌రెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరేకాకుండా కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురి పేర్లు ఫైనల్ లిస్టులో ఉన్నట్లు కూడా తెలిసింది.
ఇప్పటికే అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం కసరత్తు పూర్తి కాగా.. ఫైనల్ రేసులో ఉన్న అభ్యర్థులతో కూడిన లిస్టును పార్టీ పెద్దలకు పంపించారు. ఈ షార్ట్ లిస్టులో ముగ్గురు పేర్లు ఉండగా... వీరిలో ఒకరి పేరు ఖరారు కానుంది. టికెట్ ఎవరికి ఇచ్చినా మిగతా వ్యక్తులు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాల్సిందేనని పార్టీ నాయకత్వం ఇప్పటికే ఆదేశాలనిచ్చింది. అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని తేల్చి చెప్పింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రాధాన్యంగా తీసుకున్న రాష్ట్ర బీజేపీ... ఈ ఎన్నికను సమర్థంగా సమన్వయం చేసేందుకు ఉప ఎన్నిక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అభ్యర్థి ఎంపిక నుంచి… బూత్ స్థాయి కార్యకలాపాల వరకు ఎన్నికల వ్యూహాలను సమన్వయం చేసే బాధ్యతలు చూస్తోంది. స్థానిక సమస్యలను సేకరించడం, ప్రచారాన్ని సమర్ధవంతంగా నడిపించడం వంటి బాధ్యతలను ఈ కమిటీ చేపట్టే పనిలో ఉంది.
ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,87,206 మంది ఓటర్లు ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం 47.49 నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 పర్యాయాలు విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా… సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజాహరుద్దీన్కు 64,212 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు దక్కాయి.
సంబంధిత కథనం