తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. మార్చి 29 నాటికి మండలిలో ఐదు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీరిలో మహమూద్ అలీ,ఎగ్గె మల్లేశం, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, మీర్జా రియాజుల్ హాసన్ ఉన్నారు. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు మార్చి 20వ తేదీన పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రావటంతో... అధికార పార్టీనే కాదు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సంఖ్యా బలం పరంగా చూస్తే... వారికే మెజార్టీ సీట్లు దక్కనున్నాయి. ఇక ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు దక్కే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా… ఒక్క స్థానానినికి 28 మంది సభ్యులను ప్రతిపాదికన తీసుకునే అవకాశం ఉంది. అయితే ఓటింగ్ లో పాల్గొనే వారి సంఖ్యను బటి ఇది మారవచ్చు. అయితే సంఖ్యా బలం ప్రకారం చూస్తే బీఆర్ఎస్ తరపున 38 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే వీరిలో 10 మంది పార్టీ మారారు. ప్రస్తుతం వీరి బలం 28గా ఉంది. వీరి సంఖ్య ప్రకారం.. వీరి ఖాతాలోకి ఒక ఎమ్మెల్సీ సీటు వచ్చే అవకాశం ఉంది. మరో సీటు కోసం అభ్యర్థిని నిలబెడుతుందా..? లేదా అనేది పార్టీ నిర్ణయించే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
బీఆర్ఎస్ ఖాతాలోకి తప్పకుండా ఒక్క ఎమ్మెల్సీ సీటు రానుంది. అయితే ఈ సీటు కోసం పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సామాజిక సమీకరణాలతో పాటు సీనియార్టీ, విధేయత వంటి అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం రిటైర్ అవుతున్న మహ్మముద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇటీవలనే సత్యవతి రాథోడ్ ను విప్ గా నియమించారు. అయితే మరోసారి తనకు అవకాశం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వీరే కాకుండా బీఎస్పీ నుంచి చేరిన ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనటంతో పాటు ప్రభుత్వం పోరాడుతున్నారు. ఇక గత ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ పేరును ఖరారు చేసినప్పటికీ.. నాటి గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు. దీంతో దాసోజు శ్రవణ్ కు తీవ్ర నిరాశ మిగిలింది.న్యాయ పోరాటం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేతను కోరుతున్నారంట..!
ఇక మరికొంత మంది నేతలు కూడా ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచన ఏ విధంగా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదే నెలలో పోలింగ్ ప్రక్రియ ఉండటంతో…. త్వరలోనే పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సంబంధిత కథనం