Telangana BJP President : తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ ఎవరు.. ప్రకటనకు కౌంట్‌డౌన్ ప్రారంభం!-who will be the telangana bjp new chief countdown starts to announce ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Bjp President : తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ ఎవరు.. ప్రకటనకు కౌంట్‌డౌన్ ప్రారంభం!

Telangana BJP President : తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ ఎవరు.. ప్రకటనకు కౌంట్‌డౌన్ ప్రారంభం!

Telangana BJP President : తెలంగాణలో బీజేపీకి కొత్త సారథి వస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదిగో ఇదిగో అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన రాలేదు. అయితే.. తాజాగా కిషన్ రెడ్డి ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లడంతో.. కొత్త అధ్యక్షుడి ప్రకటన దాదాపు ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది.

తెలంగాణలో బీజేపీ

కేంద్ర మంత్రి, ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. షెడ్యూలు ప్రకారం.. సికింద్రాబాద్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకొని మరీ ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు జరుగుతున్న ఈ సమయంలో కిషన్ రెడ్డి ఉన్నపళంగా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ దూకుడు..

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ దూకుడు మీద ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో.. కేడర్ కూడా జోష్‌లో ఉంది. అయితే.. కిషన్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి సారథ్యం వహిస్తున్నారు. అదే సమయంలో కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. దీంతో రెండు బాధ్యతలు నిర్వహించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ వివిధ కారణాలతో ప్రకటన వాయిదా పడుతూ వస్తోంది.

సమన్వయం చేసే నేత కోసం..

కమలం పార్టీ పెద్దలు.. కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలు వంటి అంశాలను లెక్కలోకి తీసుకుందని సమాచారం. నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండే నాయకుడికి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

రేసులో చాలామంది..

రాష్ట్ర అధ్యక్షుడి రేసులో చాలామంది నేతలు ఉన్నారు. ముఖ్యంగా డీకే అరుణ, ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరే కాకుండా.. రఘునందన్ రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కూడా అధ్యక్ష పగ్గాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల పరిశీలకురాలుగా ఉన్న శోభా కరంద్లాజే ఇప్పటికే నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆ నివేదికను బీజేపీ పెద్దలకు అందించినట్టు సమాచారం.

బీసీ నాయకుడికి ఛాన్స్..

ఈసారి బీసీ నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీల గురించి పెద్ద చర్చే జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా బీసీలను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ బీసీ నేతకు పీసీసీ పగ్గాలు అప్పగించింది. దీంతో బీజేపీ కూడా బీసీ కార్డుపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఉగాది లోపే..

ఉగాది లోపే కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉందని.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా సమీపిస్తున్నాయి కాబట్టి.. వీలైనంత త్వరగా కొత్త సారథిని ప్రకటిస్తారని వివరించారు. అటు కిషన్ రెడ్డి సెడెన్‌గా ఢీల్లీ వెళ్లటంతో ఇక ప్రకటన దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. అయితే.. పార్లమెంట్ సమావేశాల కోసమే కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.