జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ఈ బైపోల్ తో రాష్ట్ర రాజకీయాలు మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో డైలాగ్ వార్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
జూబ్లీహిల్స్ స్థానంలో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేయకపోయినప్పటికీ… డివిజన్ల వారీగా నేతలను మోహరిస్తోంది. మంత్రుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు కూడా పని చేస్తున్నాయి. ఎలాగైనా ఈ స్థానంలో గెలిచి… సత్తా చాటాలని భావిస్తోంది. సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఖాతా తెరవలేకపోయిన హస్తం పార్టీ… ఆ తర్వాత కంటోన్మెంట్ లో వచ్చిన ఉప ఎన్నికలో విజయం సాధించింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖాతా తెరిచినట్లు అయింది. ఈ క్రమంలోనే… జూబ్లీహిల్స్ లోనూ విజయం సాధించి… నగరంలో పట్టు పెంచుకోవాలని చూస్తోంది.
జూబ్లీహిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్ లోని చాలా మంది నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే టికెట్ ను బీసీ సామాజికవర్గానికే ఇచ్చేందుకు అధినాయకత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రధానంగా ఇద్దరు పేర్లు రేసులో ఉన్నాయి. ఇప్పటికే ముగ్గురు పేర్లతో కూడిన జాబితా కూడా ఢిల్లీలోని పార్టీ హైకమాండ్ కు చేరిపోయింది. ఇందులో నవీన్ యాదవ్, మాజీ మేయర్ గా పని చేసిన బొంతు రామ్మోహన్ పేరుతో పాటు మరో నేత పేరు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కూడా బీసీ సామాజికవర్గానికి చెందినవారే.
గతంలో ఇదే స్థానం నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేశారు. మంచి ఓట్లను సాధించారు. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసి తన ప్రభావాన్ని చూపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ నవీన్ యాదవ్… కాంగ్రెస్ లో చేరారు. స్థానిక నేతగా పేరుంది. ఇక బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ లో కీలకంగా పని చేశారు. రాష్ట్ర్ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ మొదటి మేయర్ గా కూడా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ… బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.
ఇక రహమత్‌నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికైన సీఎన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ఆ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నందున తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. ఆయన పేరు కూడా పరిశీలనలోకి రాగా… బీసీ అభ్యర్థికే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే దాదాపుగా నవీన్ యాదవ్, రామ్మోహన్ పేర్లలో ఒకరి పేరు ఫైనల్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఈ ఒక్కటి రెండు రోజుల్లో ప్రకటన రావొచ్చని తెలుస్తోంది..!
ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుందని భారత ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది . ఉప ఎన్నిక ప్రకటనతో నగరంలో మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 13 నుండి నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 21. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24గా నిర్ణయించారు.
సంబంధిత కథనం